Description
Kautilyuni Arthasastram
Pullela SriRamachandrudu
సాధారణంగా నేడు అర్థశాస్త్రం అనగానే ఎకనామిక్స్ అనే అర్థంలో అనుకోవడం పరిపాటి. కానీ నేడు అర్థశాస్త్రంగా పేర్కొనేదానికీ, కౌటిల్యుని అర్థశాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదు.
కౌటిల్యుడు తన గ్రంథాన్ని అర్థశాస్త్రమని పేర్కొన్నాడు. దండనీతిని అర్థశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారతాన్ని బట్టి తెలుస్తుంది. భారతంలో ప్రముఖుడైన అర్జునుడు అర్థశాస్త్రంలోని నిష్టాతుడని శాంతి పర్వములో పేర్కొనబడింది. ఇంకోచోట శ్రేష్టులయిన రాజులు అర్థశాస్త్రాన్ని అనుసరిస్తారని కూడా చెప్పబడింది. అయితే దండనీతికి గల ఈ పేరు అంత ప్రచారంలో లేదనే చెప్పవచ్చు. ఆఖరుకు కౌటిల్యుడు కూడా విద్యల సంఖ్యను చెప్పేడప్పుడు అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అనే పేర్లు చెప్పాడు. కానీ ఎక్కడా ప్రత్యేకించి అర్థశాస్త్రమనే మాట వాడలేదు. దానికి బదులుగా దండనీతి అనే మాట ఉపయోగించాడు. అందువల్ల ఈ దండనీతి అనే పేరు బహుళ ప్రచారంలో వున్నది.
కాబట్టి కౌటిల్యుని అర్థశాస్త్రంలోని ప్రధాన విషయ వస్తువు రాజనీతికి సంబంధించినదని, మనకు లభ్యమవుతున్న అతి ప్రాచీన గ్రంథం అర్థశాస్త్రమని చెప్పవచ్చు. అయితే దీనికి అర్థశాస్త్రం అనే పేరు ఎందుకు పెట్టబడింది అనే విషయానికి కౌటిల్యుని వివరణ గమనించండి. మనుష్యుల జీవితాలకు మూలం అర్థం, లేదా “మనుష్యులకు భూమియే అర్థము. అట్టి భూమిని సంపాదించు ఉపాయములు, పాలించు ఉపాయములు, వీనిని గురించిన శాస్త్రము అర్థశాస్త్రము”.
దండనీతి ప్రధాన ఉద్దేశం కూడా యింతకు ముందు లభించునటువంటి భూమిని సమకూర్చుకోవటం, అలా సమకూర్చుకున్న దానిని రక్షించుకోవటం, వృద్ధి చేసుకోవటం, అలా వృద్ధి చేసుకున్న దానిని మంచివారి చేతులలో ఉంచడం. కాబట్టి రెండింటి ప్రధాన ఉద్దేశము భూమి సంపాదన, పరిపాలనములే కనుక దండనీతికి అర్థశాస్త్రము పర్యాయ పదంగా వాడబడినదని కౌటిల్యుని అభిప్రాయం.