Brahmaputra Pushkaralu

Brahmaputra Pushkaralu

బ్రహ్మపుత్ర పుష్కరాలు

మరిన్ని Telugu Books కై
,
Share Now

Description

Brahmaputra Pushkaralu

బ్రహ్మపుత్ర పుష్కరాలు

Brahmaputra Nadi – Pushkara Vaibhavam

బ్రహ్మపుత్రనది – పుష్కర వైభవం

బ్రహ్మ పుత్ర నది. ( భుల్లం బుతుర్/ లౌహిత్య)

బ్రహ్మపుత్ర నది హిమాలయాల్లోని మానస సరోవరం సమీపంలో పుట్టింది. ఈ నది టిబెట్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, బంగ్లాదేశ్‌ల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది చాలా వరకు పర్వత ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. సాధారణంగా నదులకు స్ర్తీ నామాలు ఉంటాయి. కానీ ఈ నదికి మాత్రమే పురుష నామం ఉండటం విశేషం. ‘గంగా- బ్రహ్మపుత్ర డెల్టా ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా. ఈ నదిపై చైనా ప్రపంచంలోనే అతి పెద్దదైన ‘జల విద్యుత్‌ ప్రాజెక్టు’ను నిర్మిస్తోంది.

బ్రహ్మపుత్ర నది పొడవు – దాదాపు 2900 కిలోమీటర్లు. ఇటు నదికి పురాణ ఐతిష్యం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు. ఈ నదికి పురుష నామము ఉండుటకు పురాణ ప్రాశస్త్యం ఉంది అది తెలుసుకుందాం! అది కృతయుగ కాలం. ఆ కృతయుగ కాలంలో కైలాసపర్వత ప్రాంతంలో శంతనుడు అనే మహర్షి ఉండేవారు. శంతన మహర్షి మహా తపస్సంపంన్నుడు. అతని భార్య అమోఘ.

ఆమెమహా పతివ్రత. ఒకసారి బ్రహ్మదేవుడు తన హంస వాహనంపై శంతన ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అమోఘ మాత్రమే ఆశ్రమంలో ఉన్నది. అమోఘలోని దివ్య తేజస్సును చూసి బ్రహ్మ ఆమె యందు తన తేజస్సును ఉంచితే మానవలోకానికి హితం కలిగే సంతానం పుడుతుంది అని భావించి ఆమెకు తన అభిప్రాయాన్ని తెలిపాడు. అందుకామె తిరస్కరించింది. తాను పతివ్రతనని.. దగ్గరకు వస్తే శపిస్తానని హెచ్చరించింది. ఇంతలో శంతనుడు కూడా వస్తుండటం చూసిన బ్రహ్మ.. తన తొందరపాటుకు సిగ్గుపడి తన తేజస్సును నేలపై జారవిడిచి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. శంతనుడు అక్కడ హంసకాలి గుర్తులను, బ్రహ్మతేజస్సును చూసి జరిగిన విషయాన్ని అమోఘ నుంచి తెలుసుకున్నాడు. జరుగబోయే విషయాలను తన దివ్య దృష్టిద్వారా గ్రహించి.. ఆ బ్రహ్మ తేజస్సును గ్రహించమని అమోఘకు తెలిపాడు. ఆమె ఆ తేజస్సును గ్రహించ గానే గర్భాన్ని ధరించి ఒక చతుర్భుజుడైన కుమారునికి జన్మనిచ్చింది. అతడు నీల వస్త్రములతో నానావిధ ఆభరణములతో, నాల్గు చేతులలోపద్మం, పుస్తకం, శక్తి, వరద ముద్రలను దాల్చి ఆవిర్భవించాడు.

అతని ముఖం మొసలి ముఖం. శరీరం పొలుసులతో కూడి జలజంతువుల శరీరంలాగా ఉన్నది. ఆ శిశువు ఎర్రని రంగులో ఉండటం వల్ల శంతనుడు అతడికి లౌహిత్యుడు అని పేరుపెట్టి జనమధ్యంలో కలపకుండా ఉత్తరాన కైలాసపర్వతం, దక్షిణాన గంధమాదన పర్వతం, పశ్చిమాన జారుధి పర్వతం, తూర్పున సంవర్తక పర్వతం ఉన్న ఒక జలకుండమధ్యంలో విడిచిపెట్టారు. అక్కడ చాలా కాలం తపస్సు చేసిన లౌహిత్యుడు అయిదు యోజనాల పొడవు కల నదముగా మారిపోయాడు. తండ్రి ఆజ్ఞతో తల్లిని సంహరించిన పరశురాముడు.. తన గండ్రగొడ్డలిని ఈ నదములోనే కడిగాడు. అందుకే ఈ నదానికి లౌహిత్య నదము అనే పేరు కూడా వచ్చింది.

బ్రహ్మ తేజస్సు వల్ల పుట్టినందున ఈ నదికి బ్రహ్మపుత్ర అనే పేరు వచ్చింది.

బ్రహ్మపుత్ర యొక్క పురాణ సంస్కృత నామం లౌహిత్య. దీనినుండే అస్సాంలో ఈ నదిని పిలిచే పేరు లుయిత్ వ్యుత్పత్తి చెందింది. స్థానికంగా అక్కడ నివసించే బోడోలు ఈ నదిని భుల్లం – బుతుర్, అని పిలుస్తారు. అంటే బోడో భాషలో ‘గర గర శబ్దం చేసేది’ అని అర్ధం. దీన్నే బ్రహ్మపుత్ర అని సంస్కృతీకరించారు.బంగ్లాదేశ్ లో, బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా సాగి దిగువ గంగలో కలుస్తుంది, ప్రాంతీయులు దీనిని పద్మా నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా పారి మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ రెండు పాయలు చివరకు బంగ్లాదేశ్లోని చాంద్ పూర్ అనే ప్రదేశంలో కలిసి బంగాళా ఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగ, బ్రహ్మపుత్ర నదీ జలాలు గంగ – బ్రహ్మపుత్ర డెల్టాని ఏర్పరుస్తుంది. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది చెప్పవచ్చు.. నదుల పరిశుభ్రంగా ఉంచడం ఒక్క ప్రభుత్వం బాధ్యతే కాదు….అది అందరి బాధ్యత. మన నదులను శుభ్రంగా ఉంచుదాం మన నదీ జలాలను వృధా కాకుండా కాపాడుకుందాం!

శ్రీపాదశ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ
విద్యాఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష నిపుణులు
రాజమహేంద్రవరం