Karunachala Ramana -MVR Sastry

కరుణాచల రమణ

200.00

Share Now

Description

ఎం.వి.ఆర్. శాస్త్రి గారి కొత్త పుస్తకం “కరుణాచల రమణ” మీద చదివి చెన్నై లో ఉండే శ్రీ ఎం.ఎస్.చైతన్య గారి సమీక్ష:
….
భగవాన్ గురించిన పుస్తకాలు కోకొల్లలు. కొన్నింట్లో ఒళ్ళు గగుర్పొడిచే అనుభవాలు, మహిమలు ఐతే ఇంకొన్ని రమణతత్వాన్ని లోతుగా విశ్లేషించేవి. తెలుగువాళ్ళ అదృష్టం కొద్దీ సూరి నాగమ్మగారు, మునగాల వెంకటరామయ్యగారు, కృష్ణభిక్షుగారు మొదలైనవారి రచనలవల్ల మనకు తిరువణ్ణామలై పరిచయమైంది. గత రెండు దశాబ్దాలుగా చాగంటి వారి పుణ్యమాని రమణాశ్రమం ఇంకాబాగా దగ్గరైంది. ఎంతగా అంటే అక్కడ అంగళ్ళలో అంతా తెలుగులో బేరాలు సాగేదాక.
‘కరుణాచల రమణ ‘ను శాస్త్రిగారు రాస్తాను అన్నప్పుడు సహజంగానే పాఠకులకు, అభిమానులకు ఉత్సాహం కలిగింది. రాజమౌళి వంటి వీరోచిత చిత్రాల దర్శకుడినుంచి విశ్వనాథ్ తరహా జీనర్ అంటే అది మాకొక సర్ప్రైజ్. శాస్త్రిగారు మనకోసం అనేకానేక గ్రంథాల్ని మథించి ఆణిముత్యాలను ఒకచోట పేర్చారు. మొత్తం 46 గ్రంథాలనుంచి (అందులో 33 ఆంగ్లం, 13 తెలుగు) 166 పేజీల సారాన్ని తీశారు.
ఎంతోమందిలానే వారుకూడా రమణుల మీద అనేకానేక అనుమానాలతో 2008లో మొదటిసారి ఆశ్రమానికి వెళ్ళినప్పటి అనుభవాలను ‘ముందుమాట ‘లో చెప్పిన దగ్గరినుంచి చివరిలో ప్రముఖుల నివాళుల వరకు శాస్త్రిగారి ట్రేడ్మార్క్ కనిపిస్తుంది.
ఏప్రిల్ 14 1950నాడు జరిగిన అద్భుతాన్ని చదివాక తరువాతి భాగానికి వెళ్లాలంటే కాస్త తమాయించుకోవాలి.ఇక అక్కడనుంచి సామాన్యప్రజానీకం నుంచి జగద్గురువుల వరకు భగవాన్ ఎలా మౌనంగానే జ్ఞానమార్గం చూపించారో తెలుపుతూ వస్తారు. ఇక్కడ మనం గమనించవల్సిన విషయం ఏమంటే తెలియని విషయాన్ని నేర్చుకొనేందుకు సాక్షాత్తు జగద్గురువులుకూడా జ్ణానగురువును వెతుక్కుంటూ వస్తారు; అనవసర అహంకారాలు, భేషజాలు వారికి ఉండవు అని.
ఇక ‘కరుణాచల ‘ అని పుస్తకంపేరులోనే పెట్టి అందుకు తగినట్టుగానే భగవానుల కరుణను అపరిమితంగా పొందిన జంతువులకు సముచిత భాగం కల్పించారు. నెర్రెలిచ్చిన గుడ్డులోంచి పిల్ల బయటకు రావడాన్ని పరీక్షిత్తుతో పోల్చినప్పుడు కలిగే భావావేశం అక్షరాల్లో ఇమడ్చలేం.
గతంలో శాస్త్రిగారి పుస్తకాలను ఏకబిగిన చదివేసిన అభిమానులు దీనిని మాత్రం కొద్దికొద్దిగా చదువుతూ ముందుకెళ్ళాలని నాసలహా. ఈపుస్తకంలో ఉన్నవిషయాలను మనమనసు ఏకబిగిన జుర్రుకునే శక్తితక్కువ అని నాఅభిప్రాయం.
రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు ఆర్భాటంగా పుస్తకాలు కొనేసి తీరా ఇంటికొచ్చాక వాటిని తెరవని నావంటివాళ్ళకు ఈపుస్తకం ఉపోద్గాతంగా పనికొస్తుంది. దీనిని చదివాక సూరినాగమ్మగారి 653పేజీల 273లేఖలు+28స్మృతులు, కృష్ణభిక్షుగారి శ్రీ రమణలీల మొదలైనవి చదువుకుంటూ ముందుకు సాగొచ్చు.