Chaturvedamulu

చతుర్వేదములు 

250.00

Share Now

Description

చతుర్వేదములు

సకల సృష్టితో సామరస్యం!
వేదం నాదంజంబూద్వీపం, మధ్య భారతంలో ఓ ప్రాంతం… జనపదాలకు మరీ దగ్గర కాదు… అలాగని దట్టమైన కీకారణ్యం కాదు.. ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతం… మొక్కల లేలేత చిగుళ్లను మేస్తున్న జింకల గుంపులు, అక్కడక్కడా కనువిందు చేస్తున్న నెమళ్లు. ఆకాశమంత పెరిగిన ఆ వృక్షాల కింద బాసింపట్టు వేసుక్కూర్చున్న ఆ బాల శిష్యులు గురువు పాడిన పాటను అందంగా అందుకుంటున్నారు… ఆలపిస్తున్నారు.. అది సామవేదం…

సింధు నదికి ఉత్తర భాగం… పక్షూనది గురగురమంటూ ప్రవహిస్తోంది. కుడివైపు ఎత్తైన పర్వత శిఖరాలు, ఎడమవైపు ఏటవాలు లోయ… దూరం నుంచి చూస్తే దట్టంగా ఉన్న ఆకుపచ్చటి దేవదారు వృక్షాలు… అక్కడో జన సమూహం. ఆవు నెయ్యి, అనేక రకాల వనస్పతులు, సంభారాలతో యజ్ఞం చేస్తున్నారు. వారందరి నోటా ఒకటేపాట… ఇంద్రుణ్ణి కీర్తిస్తూ… అది సామగానం…

కాలం మారినా, ప్రాంతమేదైనా గానమదే.

వేదాలు నాలుగు. అందులో సామవేదానిది ప్రత్యేక స్థానం. మిగిలిన మూడూ మంత్ర ప్రధానమైనవి. ధీరగంభీరమైనవి. కానీ సామం మాత్రం నాదభరితం. రాగయుక్తం.సర్వసృష్టితో అనుసంధానం చేసే సాధనం. అది అనేక ప్రత్యేకతల సమాహారం.

ఈవిశాల విశ్వంలో నిరంతరాయంగా శబ్ద ప్రవాహం ఉంటుంది. అందులోని లయే నాదం. ప్రణవంలోనూ, ప్రకృతిలోనూ ఆ లయే ఉంది. అణువణువులోనూ నిండి నిబిడీకృతుడైన సర్వేశ్వరుడిని వేద రుషులు నాద రూపంలో దర్శించారు. అలాగే అర్చించారు. అదే సామగానం. సృష్టిలోని ప్రతి అణువూ నాదమయమై ఉన్నందువల్ల ఈ వేదం చాలా ప్రత్యేకమైందిగా కనిపిస్తుంది.

భగవద్గీత పదో అధ్యాయం. ఇరవై రెండో శ్లోకంలో…
‘వేదానాం సామవేదోస్మి దేవానామ్‌ అస్మి వాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా!’

వేదాల్లో సామవేదాన్ని తానేనని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతారు. తానే ఆ వేద రూపుడినని సాక్షాత్‌ భగవానుడు తెలియజేయడం వల్ల నాదోపాసన చేస్తే ఆ పరబ్రహ్మను పూజించినట్లేనన్న విషయం స్పష్టమవుతుంది. ఈ వేద మంత్రాలు రుక్కులకంటే విలక్షణమైనవిగా, శ్రావ్యంగా, మనోహరంగా పాడడానికి వీలుగా ఉంటాయి. నిజానికి ఇందులో ఉండే దాదాపు పద్దెనిమిది వందల మంత్రాలు రుగ్వేదం నుంచి తీసుకున్నవే. డెభ్బై అయిదు మాత్రమే అచ్చంగా సామవేదానికి సంబంధించినవి. గానమే ఇక్కడ ప్రధానం. అది కూడా ప్రణవ సంబంధమై ఉంటుంది. సామవేదం సంగీతపరమైందని ఆ మంత్రాలను పలికే తీరునుబట్టి చెబుతారు. ఈ మంత్రాలను చదువుతున్నప్పుడు ఛందస్సుకానీ, అర్థంగానీ పరిగణనలోకిరావు. కేవలం గానాలాపనే ఉంటుంది.

సామ అనే శబ్దానికి చాలా విశేషార్థాలు ఉన్నాయి. వీటిని బృహదారణ్యకం, ఛాందోగ్యంలాంటి ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ‘సా చ అమశ్చేతి తత్సామ్నః సామత్వం’ అంటుంది బృహదారణ్యకం. సా అంటే రుక్కు అని అర్థం. రుక్కు అంటే వేద మంత్రం. అమ అనే పదానికి గాంధారం లాంటి స్వరాలు అని అర్థం. కలిపిచూస్తే వేద గానం అనే అర్థం వస్తుంది. జైమిని మహర్షి సామ అంటే గానం అని వివరించారు. స కార, ఉకార, మకార సంయుక్తమైన సామ అనే పదానికి పరమేశ్వరుడికి సమీపంలో ఉండడం అనే అర్థాన్ని కూడా చెబుతారు. మనస్సును ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి, అంతర్ముఖం చేసి పరమాత్మలో లీనం చేయాలి. ఆ దేవదేవుణ్ణి స్తుతులతో, ప్రార్థనలతో ధ్యానిస్తూ ఉండాలి. దాని వల్ల మనసు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంది. ఇలా బ్రహ్మానందాన్ని పొందడానికి సామవేద మంత్రాలు సోపానాలుగా ఉంటాయి. సామవేదం వేదాలకు తలమానికం. మిగిలిన వేదాలూ సామవేదాన్ని కీర్తిస్తున్నాయి. ‘రుచం సామ యజామహే’ అని అధర్వణ వేదం సామవేదాన్ని ప్రస్తుతించింది. అలాగే ‘న సామ యజ్ఞో భవతి’… సామం లేనిదే యజ్ఞం లేదు అని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు పండితులు.

ఆ రూపంలో…

ప్రతి వేదానికి ఒక్కో ప్రత్యేకరూపం ఉంటుంది. ఈ రూపాన్నే ఆ వేద పురుషుడి రూపంగా ఆరాధిస్తుంటారు.
‘నీలోత్పలదలశ్యామో సామవేదో హయాననః
అక్షమాలాన్వితోదక్షే వామే కుంభధారణ స్మృతః!’
నీలోత్పల వర్ణంతో ఉన్న దేహం, గుర్రపు ముఖం, కుడి చేతిలో కొరడా, ఎడమ చేతిలో భాండంతో సామవేద పురుషుడు ఉంటాడని రుషులు దర్శించారు.
* సామవేదం యజ్ఞ ప్రయోజనం కోసం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో సామగానం హింకార, ప్రస్తావ, ఆది, ఉద్గీథ, ప్రతిహార, ఉపద్రవ, నిధన భాగాలతో ఉందని వివరించారు. సామవేదాన్ని గానం చేయడానికి కృష్ణ, ప్రథమ, ద్వితీయ, చతుర్థ్థి, మంద, అతిస్వార్థ అనే లయలను పాటిస్తారు. ఈ గానానికి సహకారంగా దుందుభి, వేణువు, వీణ తదితర వాద్యాలను కూడా ఉపయోగిస్తారు. గానం లేని మంత్ర స్తుతిని శస్త్రం అని అంటారు. గాన రూపంలో ఉండే మంత్ర స్తుతిని స్తోత్రం అంటారు. అలాగే స్తుతుల్లో ఉండే భేదాలను స్తోమాలు అంటారు. యజ్ఞ సమయంలో సోమరసాన్ని తయారు చేసేప్పుడు సామగానం చేయడం కనిపిస్తుంది.

* రుగ్వేదం జ్ఞానకాండని, యజుర్వేదం కర్మకాండని వివరిస్తాయి. సామవేదం ఉపానన గురించి చెబుతుంది.

* సామవేదాన్ని మొదట వేద వ్యాసుడి దగ్గర జైమిని చదువుకున్నాడు. ఆయన నుంచి అది ఎంతోమందికి చేరింది. అసంఖ్యాకంగా శిష్యులు నేర్చుకోవడం వల్ల అది శాఖోపశాఖలుగా విస్తరించింది. ఒకప్పుడు ఉదీచ్య, ప్రాచ్య అనే రెండు ప్రధాన శాఖలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం కౌథుమశాఖ గుజరాత్‌ ప్రాంతంలో, రాణాయణీ శాఖ మహారాష్ట్ర, రామేశ్వరం ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. జైమిని శాఖ కర్ణాటకలో వినిపిస్తుంది.

* సామవేద సంహిత రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది పూర్వార్చిక, రెండోది ఉత్తరార్చిక రెండింటి మధ్య మూడో విభాగం ఉంటుంది. ఇందులో కేవలం పది మంత్రాలుంటాయి. దీన్ని మహానామ్న్యార్చిక అంటారు. పూర్వార్చికలోని యాభై తొమ్మిది దశతుల్లో ఆరువందల నలభై మంత్రాలుంటాయి. ఉత్తరార్చికలో మొత్తం పన్నెండు వందల ఇరవై అయిదు మంత్రాలుంటాయి.

* వేదాలను మంత్ర ద్రష్టలైన కొందరు రుషులు దర్శించి, తర్వాత సమాజానికి అందించారు. సామ వేద మంత్రాలను చూసిన రుషులు పదిహేడు మంది. వసిష్ఠుడు, వామదేవుడు, మేధాతిథి, భరద్వాజుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, శునశ్శేపుడు, సౌభరి, జమదగ్ని, ప్రస్కణ్వుడు, నృమేథుడు, ప్రాగాథుడు, కశ్యపుడు, రేభుడు, అత్రి, వాలఖిల్యులు. సామవేదంలో ఎనిమిది మంది దేవతల స్తుతి కనిసిస్తుంది. వారు అగ్ని, ఇంద్రుడు, సోముడు, ఉషస్సు, సూర్యుడు, విష్ణువు, రుతువులు, పురుషుడు. vedas in telugu

– యల్లాప్రగడ మల్లికార్జునరావు

vedas in telugu, చతుర్వేదములు, 4 vedas,