Description
శ్రీ వేమన పద్య సారామృతము
శతక ప్రబోధం
మనిషి పూర్ణ ఆయుర్దాయం ఆనందంగా జీవించాలి. జీవన గమనంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను అధిగమించాలి. తోటివారికి ఆదర్శంగా ఉండాలి. అందరికీ సంతోషాన్ని పంచాలి. ఇందుకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు దోహదపడతాయి. మనిషి వీటి సాధనలో సఫలీకృతుడైతే అతడే భగవత్ స్వరూపుడవుతాడు. వేదశాస్త్ర పురాణేతిహాసాలు మానవాళికి ఇచ్చే సందేశమిదే.
భక్తి అంటే చేసే సుకర్మలపట్ల శ్రద్ధ, ఏకాగ్రత. జ్ఞానమంటే జీవించే విధి విధానాల పట్ల నేర్పు, నైపుణ్యం, జాగరూకత. అత్యాశలకు పోకుండా ఉండటం, సమభావం, సమదృష్టి కలిగి ఉండటం, కోర్కెలపై అదుపు, నిగ్రహశక్తితో తామరాకుపై నీటిబొట్టు చందంగా ఉండటం వైరాగ్యం!
వేదాల సారాన్ని ఉపనిషత్తుల్లో పొందుపరచినట్లే- పురాణేతిహాసాల సంగ్రహాన్ని, నీతి శాస్త్రాల సారాన్ని, శతక సాహిత్యరూపంలో కవీశ్వరులు, మహనీయులు మానవాళికి అందించారు. నాలుగు పాదాలతో మకుట శోభతో విరాజిల్లే నూరు పద్యాలు నూరేళ్ల జీవితాన్ని శుభప్రదం చేస్తాయి. గీతా సారంలా జీవన ప్రస్థానాన్ని తీర్చిదిద్దుతాయి. శీలసంపదను, ఆధ్యాత్మిక వికాసాన్ని చిన్ననాటి నుంచే పిల్లలకు అందివ్వాలన్న తలంపుతో మౌఖికంగా శతకసాహిత్యాలు నేర్పే ఒరవడి మనకు ఉంది. మనిషి పెరిగేకొద్దీ వాటి అంతరార్థాలను ఆకళింపు చేసుకొంటూ, బుద్ధిబలంతో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడన్నది వాటి రూపశిల్పుల ఆశయం, ఆకాంక్ష!
అక్షరం వాగ్దేవి రూపం. భాష ఆ మాతకు అలంకారం. శతకం వెంటఉంటే ఓ సద్గురువు తోడున్నట్లేనని గ్రహించాలి. వేదాంత సర్వస్వాన్ని, సిసలైన భక్తితత్వాన్ని ధూర్జటి మహాకవి తన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యాల్లో అద్భుతశైలిలో వివరించాడు. ‘శ్రీకాళహస్తీశ్వరా! మనిషి విరక్తి భావనతో సర్వస్వాన్ని త్యజించానని చెబుతాడు. కానీ మనసులో వాంఛలు చావవు. జ్ఞానం కలగదు. మరి దేనికీ వైరాగ్యభావన? విభూతిని దేహంనిండా పూస్తాడు. కానీ గర్వమనే పూతతో శరీరం నిండి ఉంటుంది. దేనికా విభూతి పూతలు? కనులు మూసి ధ్యానంలో ఉన్నట్లుగా ఉంటాడు. ఆత్మజ్యోతి దర్శనం కలగదు. ఎందుకా ధ్యానం? తాను ఎన్నో మంచి పనులు చేశానని గొప్పలు చెబుతాడు. కానీ అవి ఎవరికీ పనికిరావు. ఇటువంటి ఆడంబరాలతో ఉంటూ, జీవిత పరమార్థాన్ని గ్రహించడం లేదు’ అంటాడు ఓ పద్యసుమంలో ధూర్జటి.
కంచర్ల గోపన్న భక్త రామదాసుగా, భద్రాచల రామదాసుగా ప్రసిద్ధుడు. తన దాశరథీ శతకంలో శ్రీరాముణ్ని కరుణాసముద్రుడిగా సంబోధిస్తాడు. భక్తితత్వాన్ని, శ్రీరాముడి వైభవాన్ని పరాక్రమాన్ని వర్ణించి చెబుతాడు. ‘మంచి గంధపు చెక్కను చీల్చినా, అరగదీసినా తన పరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది. సద్గుణవంతుడు కష్టాల బారిన పడినా ఇతరులకు మేలు చేసే గుణాలను వీడడు’ అంటూ భాస్కర శతకంలోని ఓ పద్యం సద్గుణ సంపద గురించి తెలియజెబుతుంది. సక్రమంగా నాటని వరిపైరు పెరిగి ఏ విధంగా ధాన్యాన్ని ఇవ్వదో అలాగే మనిషి తన ప్రయత్నం తాను చెయ్యకపోతే ఆ పనికి భగవానుడు అనుకూలించడని కుమార శతకంలోని ఓ మణిపూసలాంటి పద్యం హితవు పలుకుతుంది.
సూటిగా సులభశైలిలో జీవిత సత్యాలను, సమాజ పోకడలను, నీతివర్తనలను మానవీయ విలువలను తన పద్యాలద్వారా బోధించిన మహనీయుడు, ప్రజాకవి యోగివేమన. ‘శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా… పెద్దలనెడి మాట వినగవలయు’ అంటూ వేమన హితవు పలికాడు. తనలోను, ఇతర జీవరాశుల్లోను ఈశ్వర చైతన్యాన్ని గుర్తెరగడమే ఆధ్యాత్మిక పరిణతి అంటూ పరమార్థాన్ని విశదపరచాడు.
భగవానుడి లీలావైభవాలను కీర్తించే ఎన్నో శతకాలు పరతత్వాన్ని తెలిపేవిగా ఉన్నాయి. ప్రతి శతకపద్యం ఓ పూజాపుష్పం. వాటిని పఠించడం భగవదర్చన! నీతిశతకాల దివ్యప్రబోధం జీవనసౌందర్యాన్నిఇనుమడింపజేస్తుంది.
– దానం శివప్రసాదరావు