Description
పంచ సూక్తములు
ఈ సకల విశ్వం పాంచభౌతికం…సర్వాన్నీ సృష్టించి, నిర్వహించే పరమాత్మను దర్శించడానికి రుషులు తపించారు. మహా పురుషుని అర్థం చేసుకుని ఆరాధించాలని ఆరాటపడ్డారు. ఆ విరాణ్మూర్తిపై వారి భక్తి ప్రపత్తులు, ప్రాకృతిక శక్తులపై వారి అవగాహనను క్రోడీకరిస్తే సూక్తాలయ్యాయి. మానవాళికి వేదాంత సూత్రాలయ్యాయి.
సూక్తం అంటే మంచిమాట.
‘బాగా చెప్పింది’ అనే అర్థం కూడా ఈ పదానికి ఉంది.
సమగ్రంగా నిరూపణ చేయడాన్ని కూడా సూక్తం అని అంటారు. ఈ అర్థాలన్నిటినీ సమన్వయం చేస్తే మనిషిని తీర్చిదిద్దే సమున్నతమైన మార్గదర్శకత్వ బోధన సూక్తం అని చెప్పొచ్చు. ప్రకృతి పరిణామక్రమం, దానిపై మనిషికి ఉండాల్సిన అవగాహన, చేయాల్సిన పనులు, చేయకూడని చర్యలు, సాధించాల్సిన అద్వైతభావన మొదలైన విషయాలన్నిటినీ వేదాల్లోని సూక్తాలు వివరిస్తాయి. భక్తుడి మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండడానికి, పరమాత్మ మీద లగ్నం కావటానికి భారతీయ రుషులు ప్రతిపాదించిన ప్రాథమిక సూచన వేద సూక్త పఠనం. నిజానికి ఇవి వేదాల్లో ఒకే చోట, ఒకే మంత్రభాగంగా ఉండవు. విభిన్న భాగాల నుంచి గ్రహించిన మంత్రాలతో సూక్తం తయారవుతుంది. వేదంలో చెప్పిన కొన్ని పరమ ప్రామాణికమైన అంశాలు, మనిషికి అత్యవసరంగా అందాల్సిన సందేశాన్ని గ్రహించి మహర్షులు చేసిన క్రోడీకరణే సూక్తాలు. నాలుగు వేదాల్లో వందలాదిగా ఉన్న సూక్తాల్లో పురుషసూక్తం, శ్రీసూక్తం, నారాయణసూక్తం, భూ, నీలాసూక్తం… పంచసూక్తాలుగా ప్రసిద్ధిపొందాయి.
పురుష సూక్తం
‘పురుష’ అనే పదానికి భగవంతుడు అని అర్థం చేసుకోవాలి. విశ్వానికి మూలశక్తి అయిన విరాట్పురుషుడి స్వరూప, స్వభావ వర్ణన, విశ్లేషణ ఈ సూక్తంలో ప్రధానాంశాలుగా ఉంటాయి. సాధారణభావనలో మనం ఊహించుకునే విష్ణుమూర్తి, పురుషసూక్తం ప్రకటించే నారాయణుడు ఇద్దరూ వేర్వేరు. ఈయన త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువు కన్నా పూర్వమే ఉన్నాడు. విశ్వం ఆవిర్భావానికి ఇతనే మూలకారణశక్తి.
ఓం తచ్ఛంయో రావృణీమహే
గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే…
అనే ప్రసిద్ధ మంత్రంతో పురుషసూక్తం ప్రారంభమవుతుంది. ఇందులో సకల దేవతల స్వరూపంగా విరాజిల్లే విరాట్పురుషుడి వైభవాన్ని శ్లాఘిస్తారు. భగవంతుడి సంకల్పంతోనే సృష్టి జరుగుతుందని, ఈ సృష్టి కార్యమంతా ఓ యజమని చెబుతుంది.దానికి కారకులైన వారికి, ఈ యజ్ఞాన్ని నిర్వహించేవారికి, ఇందులో భాగం తీసుకున్న ప్రతి ఒక్కరికీ చివరకు పశు పక్ష్యాదులతో సహా ప్రతి ప్రాణికీ శుభం కలగాలని ఆశిస్తూ పురుష సూక్తం ఆరంభమవుతుంది.
సబ్రహ్మః, సశివః, సహరిః – అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే హరి అంటుంది పురుషసూక్తం. అమ్మవారి ఆలయమైనా, శివాలయమైనా, విష్ణ్వాలయమైనా పూజించే దేవుడు ఎవరైనా సరే అన్ని ఆలయాల్లోనూ మంత్రపుష్పంలో చెప్పే పురుషసూక్త భాగం ఇది. దైవశక్తి అంతటా నిండి ఉందనే అద్వైతభావాన్ని పురుషసూక్తం ప్రబోధిస్తోంది. విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ చైతన్యం ఒక్కటే. దాన్ని ఎవరు ఏ శక్తిగా భావించి పూజిస్తారో ఆ శక్తిరూపంలోనే ఆ చైతన్యం వ్యక్తమవుతుందనే విషయాన్ని పురుషసూక్తం విస్పష్టంగా ప్రకటిస్తుంది. అద్వైతభావనకు పురుషసూక్తం పునాదిగా నిలుస్తుంది.
ఎక్కడుంది?
రుగ్వేదం పదోమండలంలో ఈ సూక్తం ఉంది. కృష్ణయజుర్వేదం అరణ్యకం, 3వ ప్రపాఠకంలో, 12వ అనువాకంలో కూడా పురుషసూక్తం కనిపిస్తుంది. యజుర్వేదంలో ‘నారాయణ ఉపస్థాన మంత్రం’, ‘ఉత్తర నారాయణ అనువాకం’ పేర్లతో ఈ సూక్తాన్ని పేర్కొన్నారు.
నారాయణ సూక్తం
పురుషసూక్తం విశ్వవ్యాప్తమైన విరాట్ స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, నారాయణుడిగా ప్రకటించింది. నారాయణసూక్తం ఆ పరబ్రహ్మాన్ని నారాయణ స్వరూపంలోనే పూర్తిగా విశదీకరించింది. ఈ సూక్తంలో ప్రధానంగా రెండు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో భగవంతుడి మహిమ ప్రకటితమవుతుంది. రెండో భాగంలో ఆ భగవంతుడిని ఎలా, ఏవిధంగా, ఎక్కడ ధ్యానం చేయాలో, మనస్సును ఎలా లగ్నం చేయాలో వివరణత్మాకంగా ఉంటుంది.
నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
విశ్వమంతా జ్యోతిస్వరూపంగా నిండి ఉన్నవాడు నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ. నారాయణుని ధ్యానం చేసేవారిలో శ్రేష్ఠుడు నారాయణుడే అంటుందీ సూక్తం. సర్వోన్నతమైన ప్రతి అంశంలోనూ నారాయణ అంశను, నారాయణ తత్త్వాన్ని దర్శించడం ఇందులో ప్రధాన విషయం. ప్రపంచానికి లోపల, బయటా, కనిపించేదీ, వినిపించేదీ కూడా నారాయణుడే.
సముద్రేంతం విశ్వశంభువం… పద్మకోశ ప్రతీకాశగ్‌ం హృదయంచాప్యధోముఖం..’
సముద్రానికి అవతల భగవంతుడు ఉంటాడని ఈ మంత్రభాగానికి అర్థం. ఇక్కడ సముద్రమంటే సంసారసాగరం అని అర్థం చేసుకోవాలి. కోరికలు, భావోద్వేగాలనే అలలతో సంసార సాగరం ఎప్పుడూ కల్లోలంగా ఉంటుంది. సాధకుడు వీటిని అదుపులో ఉంచుకోవాలి. ఇది జరిగితే ధ్యానంలో మనస్సు లగ్నమవుతుంది. అంతిమంగా ఆ అనంతుడి సాక్షాత్కారాన్ని మనస్సు పొందుతుంది.
ఎక్కడుంది?
కృష్ణయజుర్వేదం అరణ్యకభాగం… నారాయణోపనిషత్తు, 13వ అనువాకంలో…
శ్రీసూక్తం
శ్రీ అంటే సంపద, లక్ష్మి అనే అర్థాలు ఉన్నాయి. పరమాత్మ అనంతమైన శక్తుల్లో లక్ష్మీశక్తి ఒకటి. జగత్తును పోషించేందుకు ఈ శక్తి చాలా అవసరం.
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.. శ్రీసూక్తంలో తొలి మంత్రమిది.
ఇక్కడ లక్ష్మి అంటే మనం చూసే లౌకిక సంపద కాదు. ఎప్పటికీ తొలగిపోని, తరిగిపోని జ్ఞాన సంపదే అసలైన లక్ష్మి. యజ్ఞానికి ముఖ్యదేవత అగ్ని. ఇతని ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అగ్ని జ్ఞానానికి సంకేతం. అగ్ని ద్వారా లక్ష్మిని ఆహ్వానించడం అంటే జ్ఞానసంపదను ఆరాధించడమే. ఈ భావాన్ని కొనసాగిస్తూ శ్రీసూక్తంలోని రెండో మంత్రం ‘లక్ష్మీం అనపగామినీం’ అంటుంది. అంటే ఎప్పటికీ తొలగిపోని లక్ష్మి కావాలని కోరుకుంటాడు భక్తుడు. ఎప్పటికీ తొలగిపోని సంపద తత్త్వజ్ఞానం. తనను తాను తెలుసుకునే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానాన్నివ్వాలని లక్ష్మీస్వరూపంలో ఉన్న ప్రకృతిస్వరూపిణికి భక్తుడు శ్రీసూక్తం ద్వారా విన్నవించుకుంటాడు.
‘అలక్ష్మీర్నాశయామ్యహం..’ అంటుంది శ్రీసూక్తంలోని మరో మంత్రం.
నాలోని అలక్ష్మి నశించిపోవుగాక అని భక్తుడు కోరుకుంటాడు. అలక్ష్మి అంటే సాధారణ అర్ధంలో సంపద లేకపోవటం, దారిద్య్రాన్ని అనుభవించడం అవుతుంది. కానీ, ఇక్కడ వేరు. మనిషిలో ఉండే దుర్గుణాలన్నీ అలక్ష్మికి ప్రతిరూపాలే. అవన్నీ తొలగిపోవాలని కోరుకుంటాడు భక్తుడు. ఎప్పుడైతే దుర్గుణాలు తొలగిపోతాయో అప్పుడు మిగిలేది అనంతమైన జ్ఞానలక్ష్మి మాత్రమే. ఈ భావాన్ని కొనసాగిస్తూ శ్రీసూక్తంలో మరో చోట దారిద్య్రాన్ని ధ్వంసం చేయాలని భ¡గవతిని భక్తుడు వేడుకుంటాడు. భావదారిద్య్రాన్ని కలగకుండా ఉండేలా అనుగ్రహించమని భగవంతుణ్ణి కోరుకోవడం శ్రీసూక్తం ప్రకటిస్తున్న ప్రధానాంశం.
ఎక్కడుంది?
శ్రీ శక్తిని ఆరాధించే ఈ మంత్ర భాగం రుగ్వేదంలో కనిపిస్తుంది.
భూసూక్తం
మనిషి ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చాడు. ఇక్కడ అతడు నిలబడటానికి భూమి ఆధారంగా నిలిచింది. ఎదగటానికి అవసరమైన అన్ని పదార్థాలను భూమాతే ఇచ్చింది. చివరగా భౌతికమైన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దాన్ని కూడా తనలోనే కలిపేసుకుంటుంది. అందుకే భూమిపై మనిషికి కృతజ్ఞత తప్పనిసరిగా ఉండి తీరాలి. భూమి చూపిస్తున్న ఉదారతకు, ఆమెను దైవంగా ఆరాధించాలనే భావనను కలిగించే వేద మంత్ర భాగమే భూసూక్తం.
యత్ తే మధ్యం పృథివి యచ్చ నభ్యం యాస్త ఊర్జస్తన్వః సంబభూవుః తాసు నోధే హ్యభినః పవస్వ… మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః పర్జన్యః పితాన ఉనః పిపర్తు… ’ భూమిని తన తల్లిగా, తనను భూమి పుత్రుడిగా భావించాల్సిన కర్తవ్యాన్ని మనిషికి ఈ మంత్రం సదా గుర్తుచేస్తుంది. వైదిక సంప్రదాయంలో భూమిని కేవలం నివాసయోగ్యతను కలిగించిన జడరూపమైన పదార్థంగా భావించలేదు. భూమితో ఒకవిధమైన అనుబంధాన్ని వేదం మనిషికి కలిగించింది. ఈ భూమిపై ఉన్న ప్రతి మట్టికణంలో దివ్యత్వాన్ని దర్శింపచేసుకోవాల్సిన అవసరాన్ని వేదం ప్రకటిస్తుంది.
ఎక్కడుంది?
అధర్వణ వేదంలో, యజుర్వేదంలో ఈ మంత్ర భాగాలు కనిపిస్తాయి.
నీలాసూక్తం
సామవేదంలో ప్రస్తావించిన ‘స్తోమత్రయస్త్రింశం’ అనే హోమానికి సంబంధించిన మంత్రాలు ఈ సూక్తంలో ప్రధానాంశాలు. ఈ సూక్తంలో ఆకాశానికి సంబంధించిన అంశాలుంటాయి. భూమికి ఊర్ధ్వదిశలో ఉండే నింగి ప్రాణికోటి అవసరాలు ఎన్నిటినో తీరుస్తుంది. భూమికి, ఆకాశానికి మధ్య సంబంధం, సూర్యగమనం, దిక్కులకు సంబంధించిన ప్రస్తావన ఇందులో ఉంది. మన వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి. వీటిలో ప్రత్యేకించి ‘మాతరిష్వ’ అనే వాయువు గురించి నీలాసూక్తం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. దీనికి దక్షిణ దిక్కు నుంచి వీచేగాలికి మాతరిష్వ అని పేరు. ప్రాణులను సంరక్షించే వాయువనే అర్థం కూడా ఉంది.ఈ సర్వవ్యాపకమైన వాయువును గురించి వివరణ ఇక్కడ కనిపిస్తుంది.
నీలాసూక్తంలో భూమిని విష్ణుపత్నిగా సంబోధిస్తుంది వేదం. ఇక్కడ విష్ణుపత్ని అంటే విష్ణువును పరిపాలకుడిగా కలిగినది అనే అర్థం చేసుకోవాలి. ప్రకృతిని సంరక్షించుకోవాలనే సందేశం అంతర్లీనంగా ఉంది.
ఎక్కడుంది?
కృష్ణయజుర్వేదం ఒకటో కాండ 7వ పన్నం, 10వ అనువాకంలో కొంతభాగం, 4 కాండ, 4వ పన్నంలో కొంతభాగం కలిపి నీలాసూక్తంగా మహర్షులు పేర్కొన్నారు.
ఇందులో సైన్స్ ఉంది…
మనిషికి అంతుచిక్కని రహస్యాల్లో సృష్టి క్రమం ఒకటి. ఈ సృష్టికి ఏది మొదలు? ఇందుకు కారణం ఎవరు? అనే ప్రశ్నలు చాలాకాలంగా మనిషిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు చెబుతూ, అందులోని వైజ్ఞానిక కోణాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తుంది పురుషసూక్తం. సనాతన భారతీయ వేదవ్యవస్థలోని సమున్నతమైన వైజ్ఞానికతకు, తార్కికతకు ఈ సూక్తం చక్కటి ఉదాహరణ.
పురుషసూక్తంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రభాగం ఇది. విశ్వావిర్భావానికి ముందే ఉన్న విరాట్పురుషుడికి వెయ్యి తలలు, వెయ్యి కళ్లు అంటుంది పురుషసూక్తం. ఇక్కడ సహస్రం అంటే వెయ్యి అనే అర్థం ఉన్నా ‘అనంతం’ అనే అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అనంతమైన వ్యాపక స్వభావం కలిగిన వాడు పరమాత్మ. నిశ్చలంగా ఉన్న నీటి మీదకు చిన్నరాయి విసిరేస్తే తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలకు మొదటి స్థానం బిందువు. రాయి నీటికి తగిలిన చోట బిందువు ఏర్పడి, వ్యాకోచం చెంది తరంగాలుగా మారి, అవి వ్యాపకత్వాన్ని పొంది ఎలాగైతే ఆ నది లేదా తటాకం అంతా విస్తరిస్తాయో అదే క్రమంలో ఈ విశ్వసృష్టి క్రమం ఓ మహాబిందువు కేంద్రంగా జరిగింది. గణితపరంగా చూస్తే వృత్తం మీద ఉండే ప్రతి బిందువూ శీర్షమే. అలాంటి ఎన్నో శీర్షాల కలయికే వృత్తం. అనంతమైన శీర్షాలు కలిగినవాడు పరమ పురుషుడు అనటంలో కూడా ఆ మహానుభావుడి అనంతమైన వ్యాపకత్వ లక్షణం కనిపిస్తుంది. ఇలా ఎన్నో గణిత భావనలు పురుషసూక్తంలో కనిపిస్తాయి.
సహస్రశీర్షా పురుషః.. భావాన్ని గణితశాస్త్రంలో అన్వయిస్తే శ్రీచక్రం ప్రాథమిక రూపం ఏర్పడుతుంది.
శ్రీచక్రం శక్తి స్వరూపం. లలితాదేవికి ప్రతిరూపం. ఈ రెండు భావనల్ని సమన్వయం చేస్తే ఎవరు విరాట్పురుషుడిగా ఉన్న నారాయణుడో ఆయనే దేవీ స్వరూపంలో ఉన్న మహాశక్తి అని అర్థమవుతుంది.