Description
లక్ష్మీ నరసింహ ఆరాధన
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
నారసింహాయనమః
మహావిష్ణువు దశావతారాల్లో నాలుగోది శ్రీ నృసింహావతారం. వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నృసింహస్వామి అవతరించాడు. ఇదే పర్వదినాన శ్రీ నృసింహ జయంతిని జరుపుకొంటారు.
హిరణ్యకశిపుడు రాక్షస రాజు. అతడి భార్య లీలావతి. ఆమె గర్భవతిగా ఉండగా హిరణ్య కశిపుడు తపస్సుకు వెళతాడు. అదే అదనుగా ఇంద్రుడు రాక్షస సంహారానికి పూనుకొన్నాడు. లీలావతి గర్భంలో ఉన్న పిండాన్ని కూడా వధించేందుకు సిద్ధపడిన ఇంద్రుణ్ని నారద మహర్షి అడ్డుకుంటాడు. లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆమె గర్భస్థ శిశువుకు మహర్షి విష్ణుభక్తిని బోధించాడు.
తన తమ్ముడు హిరణ్యాక్షుణ్ని వధించిన విష్ణువు మీద పగబూనిన హిరణ్యకశిపుడు తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి, తనకు నరుల వల్ల కానీ, జంతువుల వల్ల కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంట కానీ, బయట కానీ, ప్రాణమున్నవాటి వల్ల కానీ, ప్రాణం లేనివాటి వల్ల కానీ మరణం సంభవించకూడదని వరాలు పొందాడు. ఇంద్రుడి నుంచి తన భార్యను రక్షించినందుకు నారద మహర్షికి కృతజ్ఞతలు తెలిపి, భార్యను ఇంటికి తీసుకువెళ్ళాడు.
పుట్టిన బిడ్డకు ప్రహ్లాదుడు అని నామకరణం చేశాడు. వరగర్వంతో దేవతలను హింసించసాగాడు. అతడిలో విష్ణుద్వేషం పెచ్చరిల్లింది. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. పుత్రుడి మనసు మార్చాలని గురుకులంలో చండామార్కుల వద్ద శిక్షణ నిమిత్తం ఉంచాడు. ప్రహ్లాదుడు గురుకులాన్నే విష్ణుమయంగా మార్చేశాడు. సంసారపు ఊబిలో కూరుకుపోయి కర్మ బంధాల్లో చిక్కుకుపోయిన మానవుడికి శ్రీహరి నామస్మరణ ఒక్కటే తరుణోపాయమని తోటి విద్యార్థులకు బోధించాడు.
కొడుకు తన దారికి రాకపోవడంతో హిరణ్యకశిపుడు బాలుణ్ని చిత్రహింసలపాలు చేశాడు. ఏదో విధంగా వధించాలని శతథా ప్రయత్నించాడు. పరమ భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడిని అవేవీ ప్రభావితం చేయలేదు. శ్రీహరి స్మరణమే ముక్తికి మార్గమని తండ్రికి కూడా బోధించాడు.
శ్రీహరి ఇందుగలడందు లేడని సందేహము వలదని చెప్పిన పుత్రుణ్ని హిరణ్యకశిపుడు ‘ఈ స్తంభంలో నీ దేవుణ్ని చూపించు’ అని ఓ స్తంభాన్ని గదతో మోదాడు. అంతే! స్తంభం నుంచి అతి భయంకరమైన శబ్దం వెలువడింది. స్తంభం నిలువునా చీలిపోయింది. అందులో నుంచి మహావిష్ణువు మహోగ్ర రూపంతో నృసింహస్వామిగా ఆవిర్భవించాడు.
బ్రహ్మ వరాలకు భిన్నంగా, ప్రత్యామ్నాయంగా, పగలూ రాత్రీ కాని సంధ్యా సమయంలో ఇంటా బయటా కాకుండా నేలా నింగీ కాని గడప మీద, సజీవం, నిర్జీవం కాని పదునైన గోళ్లతో, నరమృగ రూపంతో హిరణ్యకశిపుణ్ని తన తొడల మీద పడుకోబెట్టి, ఉదరాన్ని చీల్చి, రక్తనాళాలను తెంచి, పేగులను బయటికి లాగి సంహరించాడు. నిరంతర హరినామ ధ్యానతత్పరుడైన బాలప్రహ్లాదుణ్ని కాపాడాడు.
‘నర’ పదానికి ‘మరణం’ అని, ‘సింహ’ పదానికి నాశనం చేసేదని అర్థాలున్నాయి. అంటే నారసింహుడి స్మరణ పునర్జన్మ లేకుండా, ముక్తిని అనుగ్రహిస్తుందని భావం. నారమంటే జీవకోటి, సింహమంటే ఈశ్వరుడు అనే అర్థాలూ ఉన్నాయి. జీవుడు పరమాత్మలో ఐక్యమైపోవాలనేదే ఈ అవతారం అంతరార్థం. స్తంభం మనోనిశ్చలతకు ప్రతీక. ఈ స్థితిని ప్రాణాయామం ద్వారా సాధించవచ్చని రమణమహర్షి ప్రవచించారు. నిశ్చల తత్వం ద్వారా(నిశ్చల తత్వే జీవన్ముక్తిః) ముక్తిని పొందవచ్చని ఆదిశంకరులూ ప్రబోధించారు.
ఈ పర్వదినాన స్వామి వ్రతం చేస్తే, శత్రు జయం కలుగుతుందని, ఆరోగ్య సిద్ధి చేకూరుతుందని హేమాద్రి నృసింహ పురాణం, స్కాంద పురాణం, పురుషార్థ చింతామణి, స్మృతి దర్పణం, గదాధర పద్ధతి, చతుర్వర్గ చింతామణి చెబుతున్నాయి.
– చిమ్మపూడి శ్రీరామమూర్తి