Naga Devata Sarvaswam

నాగదేవతా సర్వస్వం

180.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

నాగదేవతా సర్వస్వం

నాగపంచమి

భారతీయ సంప్రదాయంలో నాగారాధనకు సముచిత స్థానం ఉంది. వేదకాలం నుంచీ నాగపూజ ఉంది. నాగేంద్రుడు శివుడికి హారమైతే, కేశవుడికి తల్పమయ్యాడు. మన పురాణేతిహాసాల్లో చాలా సందర్భాల్లో నాగుల ప్రస్తావన కనిపిస్తుంది. కద్రువ నాగమాత. మహా భారతంలో అసంఖ్యాకంగా నాగుల పేర్లు కనిపిస్తాయి. జనమేజయుడి సర్పయాగం ప్రముఖమైన ఘట్టం. హైందవ సంప్రదాయంలోనేగాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. ధ్యానముద్రలో ఉన్న జినుడు, బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగవిప్పి ఉన్న ప్రతిమలు కొన్నిచోట్ల లభించాయి. మొహంజొదారో శిథిలాల్లో అధఃకాయం నాగం, ఊర్ధ్వకాయం మానవుడుగల చిత్రాల ముద్రలు, యోగి పక్కనే పడగఎత్తి ఆడుతున్న సర్పాల ముద్రలు లభ్యమైనట్లు కొన్ని చరిత్ర గ్రంథాలు పేర్కొన్నాయి.

శ్రావణ శుద్ధపంచమిని నాగపంచమిగా, కార్తిక శుద్ధచవితిని నాగులచవితిగా పరిగణిస్తారు. నాగపంచమి గరుడ పంచమిగానూ ప్రసిద్ధం. భవిష్య పురాణంలో నాగపంచమి ప్రస్తావన ఉంది. నాగద్రష్ట, గరుడ పంచమీవ్రతాల వివరణ ఉంది. గరుడ పంచమీవ్రతాన్ని సోదరులు కలిగిన స్త్రీలు ఆచరించాల్సిన వ్రతంగా చెబుతారు. చతురస్రాకార మండపంలో బియ్యంపోసి సర్పప్రతిమను ఉంచాలి. దాని పడగకింద గౌరీదేవిని ఏర్పాటు చేసుకోవాలి. గౌరీదేవిని, నాగదేవతను శక్తిమేరకు పూజించి నైవేద్యం సమర్పించి కథ చెప్పుకోవాలి. ఈ వ్రతాన్ని పది సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేస్తే విశేష ఫలదాయకమని విశ్వాసం. చతుర్థినాడు ఉపవసించి పంచమినాడు పంచముఖ సర్ప ప్రతిమను పూజించాలని స్కంద పురాణం చెబుతోంది. వ్రతాచరణకు సంబంధించి ప్రాంతీయ భేదాలు కనిపిస్తాయి.

నాగపంచమిని గరుడ పంచమిగా వ్యవహరించడానికి పౌరాణిక నేపథ్యం ఉంది. ఉచ్చైశ్రవమనే అశ్వం పాలసముద్ర మథనంలో ఉద్భవించింది. అది శ్వేతవర్ణం గలది. కశ్యపుడి భార్యలైన కద్రువ, వినతలు సముద్ర తీరాన విహరిస్తూ దూరంనుంచి గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోకమాత్రం నల్లగా ఉందని పలికింది. వినత దానికి అంగీకరించక దేహమంతా తెల్లగానే ఉందని చెప్పింది. కద్రువ నలుపు చూపితే వినత ఆమెకు దాసి అయ్యేటట్లు, చూపలేకపోతే కద్రువే దాసి అయ్యేట్లు పందెం కుదిరింది. కద్రువ కపటబుద్ధితో తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరింది. వారు దానికి ఒప్పుకోలేదు. కద్రువ వారిని సర్పయాగంలో నశించాలని శపించింది. కర్కోటకుడనే కుమారుడు తల్లి శాపానికి వెరచి అశ్వరాజంపై వేలాడాడు. మర్నాడు దూరంనుంచి గుర్రం తోక నల్లగా కనిపించగానే వినత ఓటమిని అంగీకరించి కద్రువకు దాసి అయింది. నాగులపై ద్వేషంతో వినత కుమారుడు గరుత్మంతుడు నాగులను హింసించి భక్షిస్తుంటాడు. పాముల ప్రాణభయాన్ని తగ్గించడంకోసం వాసుకి రోజుకు ఒక్కొక్క సర్పాన్ని ఆహారంగా పంపడానికి గరుడుడితో ఒప్పందం చేసుకుంటాడు.

జీమూతవాహనుడు విద్యాధర యువకుడు. పర్వత ప్రాంతంలో విహరిస్తూ సర్పాల మృత అవశేషాలను చూశాడు. ఆ రోజున ఖగరాజుకు ఆహారంగా శంఖచూడుడనే పన్నగ కుమారుడు వచ్చాడు. కరుణాళువైన జీమూతవాహనుడు తానే గరుడుడికి ఆహారమై శంఖచూడుడి ప్రాణాలు కాపాడదలచాడు. ఎర్రటి వస్త్రం ధరించి వధ్యశిలపైకి ఎక్కాడు. గరుత్మంతుడు అతణ్ని భక్షించబోయేసరికి జీమూతవాహనుడి తల్లిదండ్రులు, భార్య వచ్చి అతణ్ని బతికించమని ప్రార్థించారు. గరుత్మంతుడు తప్పు గ్రహించి అతణ్ని వదిలిపెట్టాడు. జీమూతవాహనుడి కోరికపై సర్పజాతిని హింసించనని మాట ఇచ్చాడు. ఆ రోజును గరుడ పంచమిగా జరుపుకొంటారు.

నాగుల్ని పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. నాగదోష పరిహారార్థం పూజలు చేస్తారు. పాములు పంటలను అభివృద్ధి చేస్తాయనీ నమ్ముతారు. ఇతర దేశాల్లోనూ సర్పజాతిని గురించి అనేక నమ్మకాలున్నాయి.

– డి.భారతీదేవి