Description
శ్రీ గాయత్రీ ఆరాధన
గాయత్రి జపించండి
ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి మద్రాసులోని వన్నియ తెయ్ నంపేట్ నుండి నలభై మంది బ్రాహ్మణులు వచ్చారు. స్వామివారికి నమస్కరించి వారందరినీ బాధిస్తున్న ఒక సమస్య గురించి స్వామివారికి విన్నవించారు. వారు ఉంటున్న ప్రాంతంలో బ్రాహ్మణులు ధైర్యంగా తిరగడానికి సిగ్గుపడుతున్నారని, అక్కడ ఉన్న కొంతమంది నాస్తికవాదులు తమని చూసి గేలి చేస్తున్నారని, కనపడిన ప్రతిసారి వారి శిఖలు, యజ్ఞోపవితాలు, వైష్ణవ ప్రతీకలైన ఊర్ధ్వపుడ్రాలు చూసి చాలా హేళనగా మాట్లాడుతున్నారని స్వామివారితో వాపోయారు.
అంతా విన్నవెంటనే స్వామివారు వారిని ఇలా అడిగారు, “మీరందరూ రోజూ గాయత్రి జపం చేస్తున్నారు కదా?” అని. అందరూ మౌనంగా ఉన్నారు. వారి మౌనంలోని సమాధానాన్ని స్వామివారు గ్రహించి, “ఇక రోజూ గాయత్రి జపం చెయ్యడం కొనసాగించండి. అంతా సర్దుకుంటుంది” అని ఆదేశించారు.
పరమాచార్య స్వామివారి ఆదేశం అనుసరించి వారు రోజూ గాయత్రి జపం చెయ్యడం మొదలుపెట్టారు. రెండు నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. వారు చాలా సంతోషించారు. మహాస్వామి వారిని దర్శించి విషయం అంటా చెప్పారు.
మహాస్వామి వారందరితో ఇలా అన్నారు, “మీకు కలిగిన కష్టాలకు కారణం అంతా మీరు గాయత్రి జపాన్ని వదిలేయడమే. గాయత్రి మంత్రం యొక్క శక్తిని అంచనా వెయ్యడం, లెక్కగట్టడం సాధ్యమయ్యే పని కాదు”
“మీ సమస్యలన్నిటికీ మూలం మీరు గాయత్రిని వదిలెయ్యడమే”
ఇది కేవలం అక్కడున్న బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన విషయం కాదు. శాస్త్రం చెప్పినట్టు మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే ఎవరూ మనల్ని బాధపెట్టారు. అందరూ అందరిని గౌరవిస్తారు.
[వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు సరైన వయస్సులో తప్పక ఉపనయనం చేసుకుని రోజూ సంధ్యావందనము, గాయత్రి జపం చెయ్యాలి. ఆరుగాలం శ్రమించే శూద్రులు గాయత్రి జపం చెయ్యవలసిన అవసరం లేదు. ఉదాయాన్నే తూర్పువైపుకు తిరిగి సూర్యునికి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తే చాలు సహస్ర గాయత్రి చేసిన ఫలితం వారి ఖాతాలో వేస్తారు. అనుకూలం ఉన్నవారు భవిష్యోత్తర పురాణంలోని బ్రహ్మప్రోక్త సూర్య స్తుతిని చదువుకోవాలి. సంధ్యా సమయంలో జపించే ఏ మంత్రమైనా గాయత్రియే అని పెద్దల ఉవాచ]
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।