Lalitha Aradhana

లలితారాధన
– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

250.00

Share Now

Description

లలితారాధన 

Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

సమగ్ర అవగాహనతో చేసే పనిలో పూర్ణత్వం ఉంటుంది. పరతత్వంపై అవగాహన అంత సులభం కాదు. నిరంతర సాధన, నిష్ఠ, జిజ్ఞాస ఉంటేనే దాని దరిదాపులకు చేరగలం. అందుకే దాన్ని బ్రహ్మ పదార్థం, బ్రహ్మ విద్య అంటారు.
     పరతత్వాన్ని పూర్వంగా గ్రహించినది- వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే వాగ్దేవతలు. వారు శబ్దబ్రహ్మకు సగుణ రూపాలు. వాక్కుకు అధిష్ఠాన దేవతలు. పరతత్వాన్ని వారు మాతృరూపంగా దర్శించారు. శ్రీమాతగా వర్ణించారు.
వాగ్దేవతలు చేసిన ఈ పరతత్వ అవతార వర్ణన బ్రహ్మాండ పురాణంలో సవివరంగా ఉంది. దేవకార్యం నిమిత్తం చైతన్యం అనే చిదగ్ని నుంచి ఒక దివ్య స్త్రీ మూర్తి ఆవిర్భవించింది. వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ, పాశాంకుశాలు, ఇక్షు కోదండం (చెరకు విల్లు), పుష్పబాణాలను నాలుగు చేతుల్లో ధరించి అవతరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశ్వర, సదాశివులే ఆ దేవికి దివ్యాసనం. ‘సౌందర్యాతిశయంతో ప్రకాశించే మహాలావణ్యవతి, నిర్విశేష బ్రహ్మాత్మకు పట్టపురాణి, త్రిమూర్తులను సమ్మోహింపజేయగల మహా సౌందర్యరాశి, లిప్తకాలంలో అనేక కోటి బ్రహ్మాండాలను సృజింప సమర్థురాలు, సర్వశక్తులకు కేంద్ర బిందువు’ అంటూ దివ్యావతారాన్ని వర్ణించారు వాగ్దేవతలు.
శ్రీచక్ర రాజనిలయగా, త్రిపుర సుందరిగా, శివశక్తుల ఐక్యరూపిణిగా… ఇలా 999 విలక్షణ విశేష నామాలతో ఈ దివ్య మంగళస్వరూపాన్ని పరతత్వ పూర్ణావతారంగా స్తుతించారు. ఏ అసాధారణ నామం ఇన్ని మహోన్నత గుణగణాలను, విలక్షణ విషయ, విశేషణాలను సూచిస్తుందో అదే ‘లలిత’ అని, లలితాంబా నామంతో సమస్ర నామావళిని పూర్ణం చేశారు వాగ్దేవతలు. ఇదే లలితా సహస్రనామాలుగా ఖ్యాతి గడించింది, భక్తులకు కల్పతరువు అయింది.
‘అన్ని లోకాలకు ఆవల వెలిగే దివ్య ప్రకాశం- లలిత’ అని పద్మపురాణం చెబుతోంది. లలిత అన్న శబ్దానికి- శోభ, మాధుర్యం, విలాసం, గాంభీర్యం, స్థైర్యం, తేజస్సు, లాలిత్యం, ఔదార్యం అనే అర్థాలున్నాయి. దయారసమంతటికి లలిత పరమావధి. ఈ దేవి మహాకారుణ్య రూపిణి, శృంగార రస ప్రధానమైన స్వరూపం, సర్వోత్తమ గుణగణాల రాశి.
లలితా దేవి వైభవాన్ని బ్రహ్మాండ పురాణం ఇలా కీర్తిస్తోంది- ‘ఈ మహాదేవి నుంచి వెలువడే మహోజ్జ్వల ప్రభలే బాల, పంచదశి, మహాషోడశి లాంటి మంత్రరాజాలు. సరస్వతీ దేవి వీణావాదన కూడా ఈ దేవి మధుర కంఠధ్వని ముందు వెలాతెలాపోతుంది. ఈ తల్లి దయగల క్రీగంటి చూపుకోసం యుగాలుగా బ్రహ్మాదులు నిరీక్షిస్తారు. త్రిమూర్తులకూ ఈ దేవి లీలామాత్రంగానే దర్శనమిస్తుంది’.
మణిద్వీపం ఈ దేవి నివాసస్థానం. భక్తి, దయ, కరుణ, సేవ, సద్గుణ సంపద, శ్రద్ధ, ప్రేమ, ధర్మం, సౌశీల్యం లాంటి గుణమణులతో ప్రకాశించేదీ మణిద్వీపం. ఈ మణిద్వీపంలో భక్తుల చింతలు తీర్చే చింతామణి గృహం ఈ దేవి మందిరం. భండాసురుణ్ని సంహరించడానికి అవతరించింది లలితాదేవి. సూక్ష్మంగా పరికిస్తే జనన మరణ వలయంలో చిక్కుకున్న జీవుడే భండాసురుడు. అతడి సోదరులైన విషంగుడు దుష్ట విషయాసక్తికి, విశుక్రుడు ఇంద్రియ లోలత్వానికి ప్రతీకలు. అతడి రాజ్యం శూన్యక నగరం. ఇంద్రియాలకు వశమైన మానవ శరీరమే శూన్యక నగరం. భక్తితో ఈ తల్లిని సేవిస్తే ఆ ఆసురిక భావాలను జయించగలడు మనిషి- అనేది అంతరార్థం.
లలితాదేవి అర్చనలో జ్ఞానం శ్రేష్ఠమైన పూజాద్రవ్యం అంటుంది పురాణం. చైతన్య కుసుమాలే పూజా పుష్పాలు. అహింస, సత్యభాషణ, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, దయ, తపస్సు, ఆత్మభావన అనే దివ్య గుణాలు ధరించిన భక్తుడి మనసే చైతన్య కుసుమం. భక్తి, శ్రద్ధ, దైవంపై విశ్వాసం, శీల సంపదలు ఉంటేనే మనిషి మనసులో ఈ దివ్యగుణాలు ప్రతిష్ఠితమవుతాయి. మానవ సేవను ఉన్నత సాధనా మార్గంగా ఎంచుకోవాలి. అప్పుడే భక్తుడి మనసు లలితమవుతుంది. ఆత్మ- లలిత అవుతుంది.   – పిల్లలమర్రి సి.వి.సత్యనారాయణ