Karthika Maha Puranam

కార్తీక పురాణం

216 pages

198.00

Share Now

Description

Karthika Maha Puranam in Telugu

కార్తిక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏంటి?

కొన్ని మంచి మాటలు వింటేనే జీవితం సన్మార్గంలో నడుస్తుంటుంది. అప్పుడప్పుడన్నా అలాంటి మంచి మాటలను యధాలాపంగానైనా వినటం అవసరం. ఈ సత్యాన్ని తెలియచేస్తున్నట్లు ఉంటుంది కార్తీక పురాణ శ్రవణ ఫలం. శ్రవణమంటే వినటం అని అర్థం. పూర్వం తండ్రి చెప్పిన మాట వినకుండా ఆ తండ్రి కోపానికి గురై ఎలుకగా జన్మించిన ఓ కుర్రాడి కథ ఇక్కడ ప్రస్తావితమవుతోంది. స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం అయిదో అధ్యాయంలో ఇదంతా కనిపిస్తుంది. జనక మహారాజుకు వశిష్ఠుడు సర్వపాప క్షయకరమైన కార్తీక మాస విశేషాలను వివరించసాగాడు. కార్తీక మాసంలో శ్రీమహా విష్ణువు సన్నిధిలో భగవద్గీత పారాయణ చేయడం ఎంతో శుభప్రదం.

భగవద్గీతలో ఉన్న విభూతి, విశ్వరూప, సందర్శనాధ్యాయాలను పారాయణ చేయాలి. అలా చేయటం వల్ల వైకుంఠ వాసార్హత లభిస్తుంది. శ్రీమహా విష్ణువును తులసీ దళాలతోనూ, తెల్లనివి, నల్లనివి అయిన అవిశ పూలతోనూ, గన్నేరు పూలతోనూ పూజించటం ఎంతో మేలు. ఈ మాసంలో హరి సన్నిధిలో కార్తీక పురాణంలోని ఒక శోక్లాన్ని విన్నా లేదా ఒక శ్లోక పాదాన్ని చెప్పినా, విన్నా కర్మ బంధ విముక్తి లభిస్తుంది. అలాగే కార్తీక శుక్ల పక్షంలో వన భోజనం కూడా పాపనాశకరమే. ఈ మాసంలో చేసే జపాలు, హోమాలు అన్నీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. సర్వపాపాలనూ నశింపచేస్తాయి. వన భోజనం విషయంలో ముందుగా వనంలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాదులతో పూజించి భక్తితో ముందుగా వేద పండితులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన వారు భోజనం చేయాలి.

శ్రవణ ఫలం
పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే వేద వేదాంగ పండితుడు ఉండేవాడు. అయితే ఆయనకు జన్మించిన కుమారుడు మాత్రం తండ్రి మాట వినకుండా తిరుగుతూ ఉండేవాడు. ఓ సంవత్సరం కార్తీకం ప్రవేశించగానే ఆ మాస పవిత్రతను చెప్పి వ్రతాన్ని ఆచరించమన్నాడు దేవశర్మ. కానీ, కుమారుడు తండ్రి మాటను తిరస్కరించటమే కాక నాస్తిక ధోరణిలో తండ్రిని ఎదిరించాడు. దాంతో తండ్రికి కోపం మితిమీరి ఎలుకగా పుట్టమని శపించాడు. అప్పటికి ఆ కుమారుడికి జ్ఞానోదయమైంది. తప్పు క్షమించమని తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. తండ్రి కరుణించి ఎప్పుడు కార్తీక మహాత్మ్యాన్ని (కార్తీక పురాణాన్ని) వింటావో అప్పుడు పాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే దేవశర్మ కుమారుడు ఎలుకగా మారి సమీప అరణ్యంలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగాడు.

ఇంతలో ఓ రోజున విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి ఆ పరిసరంలో ఉన్న కావేరీ నదిలో స్నానమాడటానికి వచ్చాడు. ఆ తర్వాత ఎలుక ఉన్న చెట్టు దగ్గరకొచ్చి తన శిష్యులతో కార్తీక మహాత్మ్యాన్ని చెప్పటానికి, హరి పూజకు సంసిద్ధుడయ్యాడు. ఇంతలో ఓ దారి దోపిడీ వేటగాడు అక్కడున్నది సామాన్య మునులనుకొని వారిని బాధించి, వారి దగ్గరున్న వస్తువులను తీసుకెళ్ళటానికి వచ్చాడు. కానీ, ఆ సజ్జన దర్శనంతో అతడిలోని పాపపు ఆలోచనలన్నీ పోయి సాత్వికుడిగా మారి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడ్డాడు. తనలో ఏదో తెలియని మార్పు వచ్చిందని, అది తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కనుక తనకు ఇంకా ఏదైనా మంచి విషయాన్ని బోధించి ముక్తి లభించేలా చేయమని ప్రార్థించాడు.

విశ్వామిత్రుడు వెంటనే కార్తీక వ్రత మహాత్మ్యాన్ని గురించి చెప్పి కార్తీక పురాణాన్ని వినిపించాడు. జరుగుతున్నదంతా చెట్టు తొర్రలో నుంచి చూస్తున్న ఎలుకకు శాప విముక్తి కలిగి అసలు రూపం లభించింది. అప్పుడు ఆ దేవశర్మ కుమారుడు విశ్వామిత్రుడి కాళ్ళమీద పడి విషయమంతా చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది ఇంటికి తిరిగి వెళ్ళాడు. బోయ కూడా ఆనాటి నుంచి పూర్తిగా హింసకు దూరమై అత్యంత కాలంలో ముక్తిని పొందాడు. ఇదంతా పూజ, వ్రతం, పురాణ కథ అని కొట్టి పారేయనక్కరలేదు. తల్లితండ్రులను ఎదిరించిన వాడు కష్టాల పాలవుతాడని సజ్జన దర్శనం, సాంగత్యం మనిషిలో మంచి మార్పును తెస్తాయని చెప్పే సందేశాన్ని గమనించి ఆచరించవచ్చు.

కార్తీక పురాణం

శివకేశవుల మాసం.. కార్తికం!

శివకేశవులకు ప్రీతికరమైన మాసం… ఆధ్యాత్మిక శోభను భావితరాలకు అందించే మాసం… మనిషిని సంఘజీవిగా మలిచే మాసం… ఇలా చెప్పుకుంటూ పోతే కార్తిక మాసానికి ఎన్ని విశేషాలో. మనిషిగా వికసించడానికీ, ఆధ్యాత్మికంగా ఎదగడానికీ ఈ మాసం లోని ప్రతి తిథీ ఓ జీవనశైలి పాఠమే.
పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్లే ఈ నెలకు కార్తిక మాసం అని పేరు. శివకేశవులకు ఎలాంటి భేదం లేదని చెప్పడానికి ఈ మాసానికి మించిన ఉదాహరణ లేదు. కార్తిక సోమవారాలూ, మాసశివరాత్రులూ శివుడికి ప్రీతిపాత్రమైనవి అయితే, కార్తికంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనవి. హరిహర మాసంగా పేర్కొనే ఈ మాసంలో కార్తిక స్నానం, దీపారాధన శ్రేష్ఠమైనవి. సూర్యోదయం కంటే ముందే చన్నీటి స్నానం చేసి, ఉసిరిచెట్టూ, రావిచెట్టూ లేదంటే తులసికోట దగ్గరో దీపం వెలిగించి, కార్తిక దామోదరుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటారు. నిజానికి ఈ మాసంలోని ప్రతి తిథీ ప్రత్యేకమైందే ప్రతి రోజూ పండగే. వీటిలో కార్తిక పౌర్ణమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి మరింత ప్రత్యేకమైనవి.
కార్తిక పౌర్ణమి
కార్తికమాసం మొత్తానికీ పౌర్ణమి తలమానికంగా చెబుతారు. పూర్ణచంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుడి దర్శనం, అభిషేకాలూ అత్యంత శుభఫలితాలను ఇస్తాయంటారు. కార్తిక పౌర్ణమికి త్రిపురపౌర్ణమి అనే మరో పేరుంది. త్రిపురాసురులను శివుడు కార్తిక పౌర్ణమి రోజునే సంహరించడం వల్ల దీనికా పేరు వచ్చినట్టు పురాణ కథనం. తారకాసురుడికి తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. తండ్రి మరణానంతరం దేవతలమీద ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సుచేశారు. వారి తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ అసురులు ‘రథంకాని రథం ఎక్కి విల్లుకాని విల్లుతో, నారికాని నారితో, బాణంకాని బాణాన్ని ఎక్కుపెట్టి ముగ్గుర్నీ ఒకేసారి కొట్టేవరకూ మాకు చావు రాకూడదు’ అని వరాన్ని కోరారు. విధాత అనుగ్రహించాడు. వరగర్వంతో వారు దేవతలనూ సాధువులనూ హింసించడం మొదలుపెట్టారు. ఆ అకృత్యాలు భరించలేని దేవతలు శివుడికి మొరపెట్టుకున్నారు. శివుడు త్రిపురాసురులను సంహరించటానికి సిద్ధం కాగా దేవతలందరూ శివుడికి సహకరించేందుకు ముందుకొచ్చారు. భూమి రథంగా, సూర్యచంద్రులు రథచక్రాలుగా, నాలుగువేదాలూ గుర్రాలుగా, బ్రహ్మదేవుడు సారథిగా మారిన రథంమీద శివుడు యుద్ధానికి బయలుదేరుతాడు. మేరుపర్వతాన్ని విల్లుగా, ఆదిశేషువుని వింటినారిగా, మహావిష్ణువుని బాణంగా చేసుకుని పరమేశ్వరుడు ఆ రాక్షసులను అంతంచేశాడు. అందుకే కార్తిక పౌర్ణమి రోజున శివుడిని శుద్ధ జలాలతో అభిషేకించి, మారేడు దళాలతో, జిల్లేడు పూలతో అర్చించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయంటారు.
ఉత్తమమైంది ఉత్థాన ఏకాదశి
కార్తికంలో అత్యంత విశేషమైంది ఉత్థాన ఏకాదశి. అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుడి పాన్పుమీద ఆషాడ శుద్ధ ఏకాదశిరోజు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి రోజు కన్నులు విప్పి యోగనిద్రనుంచి మేల్కొన్న రోజునే ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణుమూర్తిని షోడశోపచారాలతో పూజిస్తే యశస్సు, అపూర్వ వైభవాలు పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి.
క్షీరాబ్ది ద్వాదశి
కార్తిక శుద్ధ ద్వాదశికే క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. పూర్వం దేవతలూ దానవులూ అమృతం కోసం ఈ ద్వాదశి రోజునే క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారట. ఈ కారణంగానే ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, మథన ద్వాదశి అని పేర్కొంటున్నారు. లక్ష్మీనారాయణులు ద్వాదశి నాడే బృందావనంలోకి ప్రవేశిస్తారని పురాణవచనం. అందువల్లనే ఈ రోజు తులసి పూజ చేస్తే సకలపాపాలూ హరిస్తాయని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసీ కల్యాణం చేసే సంప్రదాయమూ కనిపిస్తుంది. విష్ణుమూర్తికి ప్రతీకగా ఉసిరి కొమ్మనూ లక్ష్మీదేవి నెలవైన తులసికోటలో ఉంచి లక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు.