Description
శ్రీ నరసింహ పురాణం
By గ్రంథి లత
Pages : 382
భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి పురాణ వాఙ్మయశాఖ చాలా విశిష్టమైనది. శతాబ్దాల నుంచి వర్ధిల్లుతూ ఉన్నది. పురాణాలలో సంప్రదాయాన్ని అనుసరించి పురాణాలలో మహా పురాణాలని ఉప పురాణములని, ఔపపురాణాలని, ఉపౌప పురాణములు కలవని పండితులు తెల్పుతున్నారు. కాని వీనిలో మహా పురాణములు, కొంతవరకు ఉపపురాణములు మాత్రమే ప్రచారంలోనికి వచ్చాయి. సంప్రదాయానుసారము మహా పురాణములు పదునెనిమిది అని చెప్పబడుతున్నాయి. ఉపపురాణాలు కూడా వంద కంటే అధిక సంఖ్యలో ఉన్నాయని తెలుస్తున్నా వానిని కూడా పండితులు అష్టాదశ సంఖ్యకే పరిమితం చేశారు. ఈ అష్టాదశ ఉపపురాణాలలో నృసింహపురాణం ఒకటి. ఇది పదకొండవ శతాబ్దం నాటికే భారతదేశంలో విస్తృత ప్రచారం పొంది మహాపురాణం స్థాయికి చేరింది. క్రీ. శ. 11వ శతాబ్దంలో విమతీయుడైన గజనీ మహమ్మద్ దండయాత్రలో అతని వెంట వచ్చిన అల్ బెరోని అనే పారశీక పండితుడు ఈ పురాణాన్ని మహా పురాణాలలో ఒకటిగా చేర్చడమే ఆనాటికే దీని ప్రఖ్యాతిని తెలియజేస్తున్నది. అలాగే, 13వ శతాబ్దంలో జీవించిన కవిత్రయంలో మూడవవాడైన ఎఱ్ఱాప్రెగడ తెలుగులో నృసింహ పురాణం రచించాడు. ఎఱ్ఱాప్రెగడ నృసింహ పురాణం ‘సంస్కృత నృసింహ పురాణానికి అనువాదం మాత్రం కాదు. ఆ రెండిటి ప్రణాళికలు పూర్తిగా భిన్నమైనవి.
సంస్కృత ‘నృసింహ పురాణ’ అనువాదం నేటివరకూ తెలుగులో వెలువడలేదు. అందుచేత సంస్కృత నరసింహ పురాణాన్ని యథాతథంగా తెలుగులోనికి తీసుకొని రావలయునని మేము భావించాము. బెంగుళూరు వాస్తవ్యురాలు శ్రీమతి గ్ర్రంథి లత గారు చక్కగా అనువాదం చేశారు. ఉపపురాణాలలో శ్రేష్టమైన ఈ నృసింహపురాణ అనువాదాన్ని తెలుగువారు సంపూర్తిగా ఆదరించగలని మా వినతి.