Description
Garuda Purana telugu | గరుడ పురాణం
గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. ఈ పురాణంలో ఆచారకాండ (కర్మకాండ), ప్రేతకాండ (ధర్మకాండ), బ్రహ్మకాండ (మోక్షకాండ) అనే మూడు భాగాలున్నాయి. మొదటికాండను పూర్వఖండమనీ చివరి రెండు కాండలనూ కలిపి ఉత్తర ఖండమనీ వ్యవహరిస్తారు. ఈ కాండలొక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో వుంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడ పోలిక లేదు. ఆచారకాండలో 240 అధ్యాయాలు, ప్రేతకాండలో 50 అధ్యాయాలు, బ్రహ్మకాండలో 30 అధ్యాయాలు ఉన్నాయి.
ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్త్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.
ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ మరణానంతర ప్రయాణం, కర్మ, కర్మ నుండి విడుదల – అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలూ, నరకానికి మార్గమూ, ప్రేత జీవనమూ, నారకీయ శిక్షలూ, స్వప్న శకునాలూ, అపరకర్మకాండాదులూ మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి. కర్మకాండ విధింపబడింది. ప్రేతాలు చెప్పిన స్వీయకథలూ ఉన్నాయి. బౌద్ధుల ప్రేతకథ కూడ చెప్పబడడం విశేషం. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించం వల్ల ఇది పరమ పవిత్రత నాపాదించుకున్నది.
శ్రీకృష్ణ గరుడ సంవాదరూపంలోనున్న బ్రహ్మలేదా మోక్షకాండ ఉపాధి, మాయ, అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. గయాక్షేత్రం వర్ణనను అనిందాపూర్వంగా ఈ పురాణం చేసింది. తిరుపతి – తిరుమల అనే మాటలనైతే వాడలేదు గాని శ్రీనివాసునీ ఆయన కొలువైన కొండలన్నిటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది. ఇంకా ఎన్నో ఇతర క్లేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి.