Puraanapanda Bhagavatam

పురాణపండ భాగవతం

150.00

మరిన్ని Telugu Books కై
,
Share Now

Description

పురాణపండ భాగవతం

భాగవత పద్యం.. పర్యావరణం

పురాణాల నిండా మతం, భక్తి, పూజలు తప్ప నిత్యజీవితానికి ఉపయోగపడే విషయాలేవీ లేవని కొంతమంది అభిప్రాయం. అందుకే పద్యాలు పాతకాలానివని, అవి ఇప్పుడు పనికిరావని భావించి పిల్లలకు పద్యాలు నేర్పే విషయంలో కూడా అశ్రద్ధ చేస్తున్నారు. నిజానికి మన పురాణాలు ‘పురా అపి నవీనాలు’. అవి ఎంత పాతవో అంత కొత్తవి. ఏ కాలానికైనా పనికొచ్చే ధర్మాలు, ఆదర్శాలు వాటిలో ఉంటాయి. ఉదాహరణకు.. పచ్చదనం, పరిశుభ్రం అంటూ మొక్కలు పెంచడం గురించి, వృక్షాల వల్ల ఉపయోగాల గురించి ఇటీవలికాలంలో ఊదరగొట్టేస్తున్నారు. కానీ, వృక్షాల గొప్పదనం గురించి బమ్మెర పోతన ఏనాడో భాగవతంలోనే చెప్పారు. బృందావనంలో గోపకులు గోవుల్ని మేపుతూ అలసిపోయి దట్టంగా ఉన్న చెట్ల నీడలకు చేరతారు. ఆ సందర్భంలో వారు బలరామకృష్ణులనుద్దేశించి చెప్పిన పద్యమిది..
‘‘అపకారంబులు సేయవెవ్వరికి, నేకాంతంబు నందుండు, నా
తప శీతానిల వర్ష వారకములై, త్వగ్గంధ నిర్యా సభ
స్మపలా శాగ్ర మరంద మూల కుసుమచ్ఛాయా ఫలశ్రేణి చే
నుపకారంబులు సేయునెల్లరకు నీ యుర్వీజముల్‌ గంటిరే?’’
చెట్లకున్న 16 సుగుణాల గురించి చెప్పే పద్యమిది. అవేంటంటే.. చెట్లు ఎవరికీ అపకారం చేయవట. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం చేయకుంటే అదే పదివేలు. ఈ యుగానికి ఇదే గొప్ప లక్షణం. చెట్లు ఏకాంతంగా ఉండగలుగుతాయట. ఏకాంతంగా ఉండగలిగినప్పుడే మనం ఎవ్వరమో ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది. అందువల్ల ఇవి మనుషులకు ఆదర్శం. అలాగే.. చెట్లు ఎండ నుంచి, చలిగాలి నుంచి రక్షిస్తాయి. మర్రిచెట్టు వంటివాటి నీడలు ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయని శాస్త్రం. వర్షంలో తడిసిపోకుండా దట్టమైన చెట్లు కాపాడతాయి. చెట్లపై తోలు వస్త్రాలకు, తాళ్లకు వాడతారు (త్వక్‌). వాటి సుగంధం గాలిని ఆరోగ్యకరంగా చేస్తుంది (గంధ). వాటి జిగురు కూడా ఉపయోగపడుతుంది (నిర్యాస).
వాటి బూడిదను వైద్యంలో ఉపయోగిస్తారు (భస్మ). వాటి ఆకుల పచ్చదనంతో పర్యావరణం మొత్తం ప్రాణవాయుమయం అవుతుంది(పలాశ). వాటి చిగుళ్లు కూరల్లో, పచ్చళ్లలో వాడతారు (అగ్ర). పూలలో ఉండే తేనె ఉపయోగం మందుల్లో ఎంతో ఉంది (మరంద). వాటి వేళ్లు ఆహారంగా, వైద్యంలో ఉపయోగపడతాయి(మూల). పూలు పూజకు ప్రశస్తం, శిరోధార్యం (కుసుమ). వాటి నీడ తాపోపశమనం (ఛాయా). వాటి ఫలాలు పుష్టికరమైన ఆహారం (ఫలశ్రేణి). ఇలా 16 ఉపయోగాలను ఒకే పద్యంలో నాలుగు పంక్తుల్లో పోతన తెలియజేశాడు. ఇంత చక్కని పద్యాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టకపోవడం వల్ల ఎంత కోల్పోతున్నాం? ఈ ఒక్క పద్యాన్ని కంఠస్థం చేయిస్తే విద్యార్థి స్వయంగా వృక్షాల గురించి స్వీయవివరణతో 16 పుటల వ్యాసం రాయగలుగుతాడు. అది మంచిదా? లేక.. చెట్ల మీద వ్యాసం కోసం గైడు చదివి అందులో వాక్యాలన్నీ కంఠస్థం చేసి పరీక్షలో అది గుర్తురాక మూర్ఖుడిగా మిగిలిపోవడం మంచిదా?
– గరికిపాటి నరసింహారావు