Description
పవిత్ర వృక్షాలు
రచన: జే.వేణీమాధవి.
సనాతన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు ఒక ఉత్తమ జీవన విధానాన్ని ప్రతిభింబిస్తాయి. మన పండుగలు మన ఋతువులు, వాతావరణ మార్పులు మరియు పరిసర ప్రకృతితో ముడిపడి వున్నాయి అనటం మనందరి ప్రత్యక్షానుభవం. రామాయణ భారత పురాణాల్లోని వనాల వర్ణనలు అప్పటి పుష్కలమైన వన సంపదను గురించి తెలుపుతున్నాయి. ఇప్పుడవి క్రమంగా కనుమరుగై పోతున్నాయి. ఒకప్పటి మన దేవాలయాలు పుణ్య క్షేత్రాలు కూడా అడవులు, పర్వత శిఖరాలు, నదీ తీరాలు మరియు సంఘమ తీర్ధాల వంటి విశిష్టమైన ప్రదేశాల్లో నిర్మించేవారు. అక్కడ పరిసర భౌగోళిక స్థితిగతుల ననుసరించి అయస్కాంత శక్తి కేంద్రీకృతమై వున్నట్లు అధ్యయనాల్లో కనుగొనటం జరిగింది.
ఇక మానవ నిర్మిత దేవాలయంలోని విశిష్టత, దాని యొక్క స్థల విశేషము, మంత్ర శక్తి, తంత్ర శక్తి, యంత్ర శక్తుల వల్ల చైతన్యవంతమవటం జరుగుతుంది. ఇవే కాక అక్కడి స్థల వృక్షాలు మరియు ఆయా దేవతలకు సంబంధించిన దివ్య వృక్షాల వల్ల కూడా అక్కడి చైతన్యం ఉత్తేజితమౌతుంది. ప్రతి దేవతకూ ప్రీతి పాత్రమైన పత్రాలు, పుష్పాలు, ప్రసాదాలు, వర్ణాలు, పూజా విధులు మొదలగునవి వుండటం మనకు తెలిసిన విషయమే. వారికి ఇష్టమైన పత్ర మరియు పుష్ప జాతుల వృక్షాలు ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో విరివిగా వున్నప్పుడు ఆ చుట్టు ప్రక్కల ప్రదేశ మంతా శక్తిమయమైపోతుంది. ఆ క్షేత్రంలో అడుగిడినంత మాత్రాన్నే భక్తులకు దివ్యానుభూతులు కలుగుతుంటాయి. ఇది మన ప్రాంతాల్లోని తిరుమల, శ్రీశైల, యాదగిరిగుట్ట, శ్రీకాళహస్తి, అన్నవరం, భద్రాచలం వంటి విశిష్ట క్షేత్రాల్లో ప్రత్యక్షంగా చూస్తుంటాము. దేవతలు ఏ వృక్షాలలో నివాసముంటారో పురాణాల్లోని వివిధ సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. వీటన్నింటినీ సమగ్రంగా ఒక దగ్గర కూర్చి బెంగుళూరుకు చెందిన డా||ఎల్లప్పా రెడ్డి గారు ఒక పుస్తక రూపంలో మనకందించారు. దానినే ‘పవిత్ర వృక్షాలు’ అన్న పేరిట టి.టి.డి. వారు అనువదించి ప్రచురించడం జరిగింది.