Description
Adi Shankaracharya Charitra book in telugu
ఆదిశంకరాచార్య చరిత్ర (Adi Shankaracharya Charitra book)
శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి “చరిత్ర”లలో కొన్ని – శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
మాధవీయ శంకర విజయం – 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
చిద్విలాస శంకర విజయం – 15 – 17 శతాబ్దాల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
కేరళీయ శంకర విజయం – 17వ శతాబ్దికి చెందిన రచన
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు. తెలుగులో వీరి జీవిత చరిత్రను 1001 పద్యాలతో ధర్మదండము పేరిట పద్య కావ్యంగా డా. కోడూరి విష్ణునందన్ రచించారు.
జననము
శంకరుల జన్మస్థలం కాలడి
సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.
బాల్యము
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.
ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
సన్యాస స్వీకారము
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, “ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను” అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
గోవింద భగవత్పాదుల దర్శనం
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు ‘ఎవరు నువ్వు?’ అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. – “స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్” (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు)
శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
వారాణసిలో శంకరులు
గుర్వాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.
మనీషా పంచకం
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: “వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి.” ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ప్రస్థానత్రయం
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు “లలితా త్రిశతి”లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు ‘నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ’మని వ్యాసుని కోరగా, వ్యాసుడు “లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్ధాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక” అని దీవించాడు.