Description
మనుస్మృతి
మను ధర్మశాస్త్రం Pages : 496
హిందువైన ప్రతివాడు తన జీవితాన్ని కొన్ని ఆదర్శాలకు అనుగుణంగా మలచుకొనాలనుకుంటాడు. ఆ జీవిత ఆదర్శాలు కొన్ని ధర్మశాస్త్రాలలో చెప్పిన విషయాలకు బద్ధమై ఉంటాయి. అయితే ఆదర్శాలనేవి, ప్రత్యేకంగా జీవన సూత్రాలు కాలానుగుణంగా మారుతుంటాయి. అలాంటి వాటిని దేశ కాల ప్రాంతాలను అనుసరించి తరచు మానవ సమాజం మార్చుకొనటం అవసరము, సమంజసము కూడా. హిందూ జీవన విధానాన్ని నిర్దేశించే గ్రంథాలు అనేకం ఉన్నాయి. వాటిలో ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా ముఖ్య స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. హిందూ ధర్మశాస్త్రాలలో అతి ప్రసిద్ధమైనది మనుస్మృతి లేక మనుధర్మశాస్త్రం. ఆధునిక కాలంలో ఇంతగా విమర్శలకు, నిందలకు గురి అయిన మరొక గ్రంథంలేదు.
అసలు మనుస్మృతిలో ఏం విషయాలు ఉన్నాయి. అందులో గర్హనీయమైనవి ఏవి ? మెచ్చుకొనదగినవి ఏవి? అనే విషయాలను పలువురు విమర్శకులకు, ప్రశంసకులకు కూడా అందుబాటులోకి తీసుకొని రావాలని మేము మనుస్మృతి లేక మనుధర్మశాస్త్రాన్ని ప్రచురిస్తున్నాము. ఎన్నో గ్రంథాలలో అనేక గర్హనీయమైన విషయాలు ఉంటున్నాయి. అయితే అవి అన్నీ తగలవేయాలనే భావన సరియైునది కాదు, వానిలోని మంచి విషయాలను స్వీకరించి చెడు అనుకొన్నవి వదలివేయటమే సమంజసమైనదిగా మా భావన.
ఈ గ్రంథంలోని తాత్పర్యాలను సరళం చేయటం జరిగింది. అలాగే ధర్మశాస్త్రాలను లేక స్మృతులను గురించి తెల్పిన విషయాలు కొంతవరకు పాఠకులకు ఉపయోగపడవచ్చునని భావిస్తున్నాము.
మా ఇతర పుస్తకాలవలెనే ఈ మనుస్మృతి కూడా పలువురి ఆదరణకు పాత్రం అవుతుందని భావిస్తున్నాము.
– ప్రచురణకర్తలు