Description
వేద సూక్తములు
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అని ప్రశ్నించే వారు వేదమంత్రాల మహాబలానికి మూలం తెలుసుకోవాలి. వేదాల జ్ఞానసంపదనుబట్టే దాని గొప్పతనం అర్థమవుతుంది. సృష్టితోపాటు ఉద్భవించినట్టుగా భావిస్తున్న వేదవిజ్ఞాన సారాన్ని ఆనాటి మహర్షులే కనుక గ్రహించి మానవజాతికి అందించక పోయుంటే ఇవాళ భూమిపై ఈ కాస్తా ధర్మమైనా నిలిచేది కాదని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. అప్పుడు మానవుల జీవితాలు తెరచాపల్లేని నావల్లా అగమ్యగోచరం, నిరర్థకమేకాక నిస్సారమయ్యేవనీ వారంటారు. వేదవాజ్మయం ఎప్పుడు, ఎలా పుట్టిందనడానికి ఇప్పటికే కొన్ని భావనలు ప్రచారంలోకి వచ్చాయి. ఎవరికి వారు ఏదో ఒక ఆధారాన్నిబట్టి నిర్ధారిస్తున్నారు. శాస్త్రీయ మూలాధారమే అత్యంత ప్రామాణికమవుతుంది. న్యూఢిల్లీకి చెందిన రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్ ఏవీ మొహరిర్ వెలిబుచ్చిన ఇటీవలి ప్రతిపాదన ఈ కోణంలో ఆలోచింప చేసేదిగా ఉంది. ప్రపంచంలోనే అతిప్రాచీనమైన ఆధ్యాత్మిక తత్వంగా అద్వైత సిద్ధాంతాన్ని పేర్కొంటూనే, వేదమంత్రాలు సృష్టి ఆరంభంలో విశ్వశక్తి ప్రేరణతోనే అత్యంత ప్రాకృతికంగా ఆవిర్భవించినట్లు ఆయన తెలిపారు.
వేదాలు అపౌరుషేయాలని (ఎవరూ రాయనివి) భారతీయ తత్వవేత్తలు ఏనాడో తేల్చారు. మన పౌరాణికాల ప్రకారం ప్రళయాలు-ప్రణవాలు (సృష్టి ఆరంభం) ఒక మహాకాలచక్రంలో భాగం. గత ప్రళయం తర్వాత కృతయుగంతో మొదలై త్రేతా, ద్వాపర, కలి యుగాల పిమ్మట మళ్లీ ప్రళయం సంభవిస్తుంది. ఈ కృతయుగ కాలం మొదట్లోనే శ్రీమహావిష్ణువు మత్స్యావతారం దాల్చి, వేదాలను ఎత్తుకెళ్లిన సోమకాసురుడు అనే రాక్షసుని వధించి వాటిని రక్షించాడు. కాబట్టి, అవి తొలియుగం నాటికే వున్నట్టుగా భావించాలి. హైందవ విశ్వాసం మేరకు కృత(సత్య) యుగంతో సృష్టి ప్రారంభమై ఇప్పటికీ అనేక లక్షల సంవత్సరాలు అయింది. వేదాల సృష్టికర్త బ్రహ్మదేవుడే అన్న పౌరాణిక కథా వాడుకలో ఉంది. వేదనాగరికత క్రీ.పూ.1200 సంవత్సరం నాటిదని కొందరు, కాదు క్రీ.పూ.4000 సంవత్సరాల కిందటిదని మరి కొందరు భావిస్తున్నారు. వేదకాలం విషయంలో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ అత్యధిక హైందవులు ఇవి అనాదిగా ఉన్నవేనని విశ్వసిస్తున్నారు.
ప్రత్యేకించి ఎవరూ రాసినవి కాకపోయినా, లభ్యమవుతున్న సాహిత్య, చారిత్రకాది ఆధారాల మేరకు సంస్కృత భాషలోనే వేదవాజ్మయమంతా గ్రంథస్తం అయిందన్నది స్పష్టం.
అసలు, ఈ దేవభాష (సంస్కృతం)లోకి వేదాలు ఎలా రూపాంతరం చెందాయి? ఎవరూ రాయకపోతే వీటికి అక్షరరూపు ఎలా సిద్ధించింది? అన్న ప్రశ్నలకు రిటైర్డ్ ప్రొఫెసర్ ఏవీ మొహరిర్ విపులమైన అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. కిందటేడాది (2018) అక్టోబర్ 1-7 మధ్య వెలువడిన యూనివర్సిటీ న్యూస్ పత్రిక సంచికలో ప్రచురితమైన ఆయన పరిశోధనాత్మక వ్యాసం (సైన్స్, స్పిరిచువాలిటీ అండ్ గాడ్: యాన్ అటెంప్టెడ్ సింథసెస్) ఈ విషయాన్ని సమగ్రంగా చర్చించింది. న్యూఢిల్లీలోని ఐఏఆర్‌ఐ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్)కు చెందిన డివిజన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫిజిక్స్‌కు అధిపతిగా, డీన్‌గా పనిచేసి ఆయన రిటైరయ్యారు. వేదాలు అనాదిగా ఉన్నవన్న సనాతన వాదుల అభిప్రాయాన్ని ఏకీభవించే రీతిలోనే ఆయన అభిప్రాయం ఉండడం గమనార్హం.
సృష్టి ఆవిర్భావం నాటి మహాశక్తి నుంచి వెలువడిన ప్రకంపనలు, శబ్దాలు, హల్లులు, అచ్చులు, పదాలు, లయలు, మోతలు, చలనాలు వంటివన్నీ భూమండలం వరకూ దిగి వచ్చి, సంస్కృత భాషలోకి రూపాంతరం చెందినట్లు మొహరిర్ అంటున్నారు. తత్ ఫలితంగానే ఎంతో శక్తివంతమైన వేదమంత్రాలు ఉద్భవించాయని, అలా అపౌరుషేయంగా అందిన ఈ వాజ్మయాన్నే అప్పటి మహర్షులు గ్రహించారని ఆయన వివరించారు. సంస్కృత భాష గురించి కూడా మొహరిర్ ఆశ్చర్యకరమైన విషయాన్నే వెల్లడించారు. వివిధ ప్రకంపనలు, శక్తుల పౌన:పున్యాల (తరచుదనం) సమ్మేళనంతోనే ఈ భాష ఆవిర్భవించినట్లు ఆయన పేర్కొన్నారు. అత్యంత సంక్లిష్టమైన పదబంధాలు, శబ్దాలు, స్వరాలు, రాగాల సహితంగా రూపొందిన ఈ అద్భుత భాష నాటినుంచీ మానవుల ద్వారా వెల్లడవుతున్నట్టు ఆయన తేల్చారు. మరి, నరులకు ఈ శక్తి ఎలా సమకూరింది? అన్న దానికీ ఆయన సమాధానం చెప్పారు. మానవ చేతనత్వం విశ్వాత్మ (Cosmic Universal Consciousness) శక్తితో కలిసి స్వరసమ్మేళనం (unison) పొందిన ఫలితమే ఇదని ఆయనన్నారు.
సంస్కృత భాష పుట్టిందే వేదాల కోసమేనేమో. దీని గొప్పతనాన్ని మొహరిర్ మరింత విపులంగా తెలిపారు. ఈ భాషలోని ప్రతీ అక్షరం ఒక ప్రత్యేకమైన తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటుందని, వివిధ అక్షరాలన్నీ ఒక్కచోట సమ్మిళితమై, సంయోగమై ఒక కట్టగా, ఓ పెద్ద గుంపుగా కూడి గుణాత్మక శక్తిని పలు పౌన:పున్యాలుగా విడుదల చేస్తాయని ఆయన అంటున్నారు. ఈ రకంగా స్వాభావికంగానే మానవులపై సంస్కృత భాష పెద్ద ఎత్తున ప్రభావం చూపినట్లు ఆయన అన్నారు. సంస్కృతం అనగానే అదేదో పండిత భాష అన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. కానీ, మొహరిర్ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ సంస్కృత భాషకు చెందిన ఆత్మ చేతన ప్రతి మనిషిలోనూ నిభిడీకృతమై ఉన్నట్టు చెబుతున్నారు. ఈ భాషా లక్షణాలు, స్పందనలు సహజసిద్ధంగానే అందరిలోనూ అంతర శక్తి (under current) గా పనిచేస్తున్నట్లు ఆయన నిర్ధారించారు. కులం, మతం, వర్గం, భాష, ప్రాంతం, విశ్వాసం, నమ్మకం, భౌగోళికత వంటి వాటన్నింటికీ అతీతంగా ప్రపంచ మానవులందరిపైనా ఈ భాష ఇదే రకమైన ప్రభావాన్ని కలిగిస్తుందన్నది ఆయన అభిప్రాయం.
అందుకే, అత్యంత శాస్ర్తోక్తంగా వేదమంత్రాలు (సంస్కృత భాషలోనివి) చదువుతున్నప్పుడు తీవ్రస్థాయి ఆధ్యాత్మిక ప్రకంపనలు ఉద్భవించడం మనం చూస్తుంటాం. నిజానికి వేదమంత్రాలను పూర్తి స్వరరాగ ఛందోబద్ధంగా పఠించే నిష్ణాతులైన వేద పండితులు ఈ కాలంలో చాలా తక్కువ. వాతావరణాన్ని స్పందింపజేసేలా, పరిసర వ్యక్తుల్లో ప్రకంపనలు పుట్టించే రీతిలో అనూహ్య స్థాయిలో వేదమంత్రాల పఠనం ప్రస్తుత కాలానికి అసాధారణమే. అప్పుడు గాలికి సైతం చలనం వస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. గోదావరి వంటి నదీనదాల ప్రవాహ శబ్దాల (ఘోష)ను సైతం వేదమంత్రాల ప్రకంపనలతో పోలుస్తారు. మొత్తంగా సృష్టికి మూలమే ఓంకారమనే (ప్రణవనాదం) అత్యద్భుత విశ్వప్రకంపన సర్వమతాలకు అతీతంగా మన్ననలను అందుకొంటున్నది. ఇంతటి తేజోవంతమైన మంత్రోచ్ఛారణలకు ఉండే శక్తి సామర్థ్యాలు సామాన్యులకు అర్థం కావన్నది వారి అభిప్రాయం. ఋషుల కాలం వరకూ అక్కర్లేదు, త్రిమతాచార్యులు, ఆ తర్వాతి వారి కాలం వరకూ కూడా వేదమంత్రాలతో అద్భుతాల (ఎండిపోయిన పొలాలను పచ్చ బరచడం వంటివి)ను సృష్టించిన సందర్భాలు చరిత్రకు తెలుసు.
హోమగుండంలో నిప్పు రాజేయకుండానే మంత్రాలతో అగ్నిహోత్రాన్ని పుట్టించిన అంకుఠిత దీక్షాపరులను కండ్లారా చూసిన వారు ఇప్పటికీ వున్నారు. విశ్వవ్యాప్తంగా మానవులందరినీ ఆధ్యాత్మిక పరంగా ప్రభావితం చేయగలదు కాబట్టే, సంస్కృతాన్ని మొహరిర్ ఆసియా, యూరోపియన్ భాషలన్నింటికీ మాతృభాషగా అభివర్ణించారు. మానవాళికి చెందిన అన్ని వర్గాలు, జాతుల (నాగరికులు, అనాగరికులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు) నడుమ ఇదొక వాస్తవిక సర్వసాధారణ బంధం (common thread) వంటిదని ఆయన అన్నారు. ఇందులోని సౌందర్యగుణం, కవితాత్మక పద్యపాదాలు, కరుణ రసాత్మక రచనా సంవిధానం, మనసుకు ప్రశాంతతను చేకూర్చే సంగీతరస ధ్వని, ప్రేమ-భక్తి, ఉద్వేగాలు, దయార్ద్రత వంటివన్నీ విశ్వజనీనంగా కనిపించడానికి కారణమిదేనని మొహరిర్ అంటారు. ఈ దృష్ట్యా వేదాలు మనకు అందించే జ్ఞానం, వివేకంతో కూడిన శక్తి ఎవరో పనికట్టుకొని ఇచ్చిందో, రచించిందో, సంకలన పరిచిందో ఎంతమాత్రం కాదన్నది ఆయన నిర్ధారణ.
సైద్ధాంతిక వాస్తవం కూడా!
వేదాలు సృష్టి జనితం అన్న ప్రతిపాదనలోని సత్యం పలు ప్రముఖ సమీకరణలు, సిద్ధాంతాల ద్వారా కూడా అవగాహనకు వస్తున్నదని ఏవీ మొహరిర్ తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత, ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్త ఎర్విన్ స్క్రోడింగర్ తరంగ పనితనానికి చెందిన సమీకరణ, రాయల్ సొసైటీ ఫెలో అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్ర సమీకరణలు, కోప్లే మెడల్ గ్రహీత, జర్మనీ రసాయనిక శాస్త్రవేత్త ఆగస్ట్ కెక్యూల్ ప్రతిపాదించిన బెంజీన్ (పెట్రోలియం, బొగ్గులలో వుండే రంగులేని అస్థిర ద్రవపదార్థం) నిర్మాణ బదిలీ సిద్ధాంతం, నోబెల్ బహుమతి గ్రహీత, జర్మనీ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సుప్రసిద్ధ సాధారణ సాపేక్షికతా సిద్ధాంతం వంటి వాటితోపాటు ఇటువంటి మరిన్ని అధ్యయనాల సారం ఈ అభిప్రాయాన్ని రహస్యంగానైనా ఉటంకిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో సైద్ధాంతిక ప్రామాణికత నెలకొనవలసి ఉంది. ఇందుకు మరిన్ని లోతైన పరిశోధనలు అవసరం. vedas
-దోర్బల బాలశేఖరశర్మ