Sale!

Vedamantra Samhitha

వేదమంత్ర సంహిత
– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

190.00

మరిన్ని Telugu Books కై
Tags: , , , , ,
Share Now

Description

వేదమంత్ర సంహిత

Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

వేదాల్లోకి వెళ్దాం!
ఈ ప్రపంచంలో ‘మతం’ అనేదే లేని చోటు ఒకటి ఉండేది. అది వేద కాలపు భారత(ప్ర)దేశం. ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే ‘అంకితమైన’, ‘ఆసక్తి కల’ అనీ అర్థాలు. భగవంతుడు కాంతి రూపుడు. భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైనది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని భావం. అలాంటి భారతదేశంలో మతం లేని భగవత్‌ చింతన మాత్రమే ఉండేది. అది వేద ప్రతిపాదితం. వేదంలో మతం లేదు. మతం లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించేవారు. మహర్షుల ఉపదేశాలూ, సందేశాలూ, పరిశీలనలూ, ప్రతిపాదనలూ వేదం అయినాయి.
మొదట మూడు! తరువాత నాలుగు!!
‘వేదం’ అంటే విద్య లేదా జ్ఞానం అని అర్థాలు. తొలి దశలో వేదం ఒకటే. ఆపై మూడు విభాగాలై ‘త్రయీ విద్య’ అయింది. ‘ఋక్‌’, ‘యజుర్‌’, ‘సామ’ అని ఆ విభాగాలకు పేర్లు. మహాభారత కాలానికి కూడా వేదం త్రయీ విద్య గానే ఉండేది. అటు తరువాత ‘అథర్వ’ అన్న మరొకదానితో వేదం నాలుగు విభాగాలు లేదా శాఖలయింది. వేదం అన్నది నైతిక మార్గదర్శకాల, కర్మ కాండల, ప్రవర్తనా సూత్రాల క్రోడీకరణ కూడా! దైనందిన జీవనానికీ, అధ్యాత్మిక అభ్యాసానికీ మహర్షులు పలువురి సమష్టి ప్రయత్నమే వేద సంపుటి. ‘వేద యతి యతో ధర్మాధర్మ ఇతి వేదః’- ధర్మా ధర్మాలను తెలియజేసేది వేదం.
మంత్రాలు… బ్రాహ్మణాలు… ఆరణ్యకాలు… ఉపనిషత్తులు!
వేదం నాలుగు భాగాలుగా ఉంటుంది. మంత్రం, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్‌ అనేవి. మంత్ర భాగాన్ని ‘సంహిత’ అని కూడా అంటారు. ఈ సంహితలు అయిదు. అవి ఋక్‌ సంహిత, కృష్ణ యజుస్సంహిత, శుక్ల యజుస్సంహిత, సామ యజుస్సంహిత, అథర్వ సంహిత. ఇక, బ్రాహ్మణాలు అయిదు. అవి ఐతరేయ బ్రాహ్మణం, తైత్తిరీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం, గోపథ బ్రాహ్మణం. మంత్రం అన్నదానికి పలు అర్థాలున్నాయి. యజ్ఞం చేసే వాళ్లు పలికే శబ్ద సమూహం మంత్రాలే. మంత్రాలను ‘ఋక్‌, యజుస్‌, సామ’లని అన్నారు. ఋక్‌లు అంటే స్తుతులు, దైవప్రార్థనలు. వీటిని ‘సూక్తాలు’ అనీ అన్నారు. వేద సాహిత్యమంతా మంత్రాలే. మంత్రం లేదా సంహిత భాగానికి వివరణలు బ్రాహ్మణాలు. యజ్ఞాలను నిర్వహించే తీరును బ్రాహ్మణాలు వివరిస్తాయి.
ఋక్‌లు, బ్రాహ్మణాలు కర్మకాండకు సంబంధించినవి. మంత్రం, బ్రాహ్మణ శాఖల తరువాత ఆరణ్యకాలు ఉంటాయి. ఆరణ్యకాలు రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి ఐతరేయారణ్యకం, తైత్తరీయారణ్యకం. ఆరణ్యకాలు వైరాగ్యాన్ని ఉపదేశిస్తాయి. వానప్రస్థాశ్రమంలో అరణ్యాలలో అధ్యయనం చెయ్యడం వల్ల అవి ‘అరణ్యకాలు’ అని అనిపించుకున్నాయి. చివరి సమన్వయం (సింథసిస్‌) ఉపనిషత్తులలో తెలుస్తుంది. ఉపనిషత్తులు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి. అందుకనే వాటిని ‘బ్రహ్మకాండ’ అని అన్నారు. ఉపనిషత్తులు 108 కనిపిస్తున్నా పది ఉపనిషత్తులు మాత్రమే మౌలికమైనవి, ముఖ్యమైనవి. ఆది శంకరాచార్యులు దశోపనిషత్తులకు మాత్రమే భాష్యాలు రాశారు. అవి- ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరి, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకాలు. ఇవన్నీ కలుపుకొంటేనే వేద వాఙ్మయం.
ఏనాటిది ఈ వేదం?
వేదానికి మూలం, కాలం ఇప్పటి వరకూ సరిగ్గా తెలియరాలేదు. అనుకోవడాలూ, అభిప్రాయపడడాలూ, వాదోపవాదాలూ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వేదం జీవనది అయి భారతం నుంచి ప్రపంచంలోకి ప్రవహించింది. జీస్‌సకు పదిహేడు శతాబ్దాల ముందే వేదం అరేబియాకు చేరింది. హీబ్రూ భాషలో ఉన్న పాత టెస్టమెంట్‌లో వేద సాహిత్యపు శైలీ, భావాలూ ఉన్నాయని విన్సెంట్‌ ఎ. స్మిత్‌ అనే పరిశీలకుడు తెలియజేస్తున్నాడు. వేదాన్ని దృష్టిలో పెట్టుకుని మహమ్మద్‌ నబికి కన్నా ముందు ఇప్పటికి 2,400 ఏళ్లకు పూర్వం జీవించిన అరబ్బీ కవి, దార్శనికుడు లబీబ్‌ ఇలా అన్నాడు- ‘‘ఓ ఆశీర్వదించబడిన హిందూ భూమీ, నువ్వు గౌరవించతగిన దానివి. ఎందుకంటే నీలో భగవంతుడు తన నిజమైన జ్ఞానాన్ని ప్రకటించాడు’’. విశ్వ గ్రంథ భాండాగారంలో ప్రథమ గ్రంథం ‘వేదం’ అని పరిశీలకులు నిర్ధారించిన దాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఆధునిక భావాలెన్నో!
వేదంలోని మొదటి అక్షరం ‘అ’. భారత భూమిపై వెలసి నెలకొన్న తాత్త్విక, సాత్విక రచనలకన్నిటికీ వేదమే అధారం. ‘ఫిలాసఫీ’ అని మనం ఆ రచనల్ని అనకూడదు. ‘వాస్తవిక విద్యను దర్శించడంలో హేతువునూ, తార్కికతనూ ఉపయోగించడం ‘ఫిలాసఫీ’ అవుతుంది. కానీ మనవి వేద జనిత రచనలు కనుక అవి ఫిలాసఫీ అవవు.
‘వసుధైక కుటుంబకం’ (భూమి ఒక చిన్న కుటుంబం) అన్న విశ్వభావన ప్రపంచ వాఙ్మయంలో తొలిసారి వెలువడింది వేదం నుంచే. శక్తి కేంద్రాల వంటి పలు దేవతలు వేదంలో కనిపిస్తున్నా ‘పరమ పురుషుడు ఒక్కడే’ (తస్మాత్సర్వైరపి పరమేశ్వర ఏవ హూయతే!) అని వేదం తొలిసారిగా మానవాళికి తెలియజేసింది.
‘ఎవరైతే అన్ని ప్రాణులనూ తమలో చూస్తారో, అన్ని ప్రాణులలోనూ తమను చూస్తారో అటువంటి వారికి రోత లేదా విద్వేషం కలగదు’ (యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి, సర్వ భూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే) అని మానవజాతికి తొలిసారి చెప్పి సర్వ జీవ సామరస్యాన్ని నిర్దేశించింది వేదమే. ఎన్నో సార్వకాలిక, సార్వజనీన సత్యాలు వేదం నుంచి పుట్టి ప్రపంచమంతా వ్యాపించాయి.
‘సంఘాన్ని ప్రేమించు గౌరవించు, ఆకలి చేత పీడించబడిన వాళ్లను రక్షించు’ అని వేదం మానవాళికి నేర్పింది. వర్ణ, లింగ వివక్షలు లేని సమాజాన్ని వేదం నిర్దేశించింది. వేదంలో ఒక వధువు, వరుడితో ‘‘నేను ఋక్‌ (సాహిత్యం), నువ్వు సామం (గానం)’’ అని అంటుంది. స్త్రీ,పురుషుల సంబంధం ఎలా ఉండాలో ఇక్కడ చెప్పింది వేదం. మరో చోట ఓ స్త్రీ ‘‘నేను శిరస్సును, నేను జెండా(పతాకం)ను, నేను నిప్పుల మాటలు పలుకుతాను. నా భర్త నన్ను అనుసరించనీ!’’ అంటుంది. ఇక్కడ స్త్రీ స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, స్త్రీ స్వాభిమానం వ్యక్తమవుతున్నాయి.
‘ఓ నమ్మకమా! మాకు నమ్మకాన్నివ్వు, భయం నుంచి విముక్తి నివ్వు, అంతులేని సంపదలకు మమల్ని అధిపతుల్ని చెయ్యి, శ్రేష్ఠమైన జ్ఞానాన్ని ప్రసాదించు’ అని మనతో పరమాత్మను అడిగిస్తోంది వేదం. అమెరికా దేశపు తత్త్వవేత్త ఆర్‌.డబ్ల్యూ. ఎమస్న్‌ (ఎమర్సన్‌ కాదు) ‘‘వేదంలోని భావం ఉష్ణంపై కాంతిలా ఉన్నతమైనది’’ అని అన్నాడు. ‘‘పరమాత్మ మనల్ని రక్షించాలి, మాకు పోషణనివ్వాలి, మాకు విద్యలలో సామర్థ్యం కలగాలి, తేజస్వులైన మాకు బ్రహ్మవిద్య అవగతం కావాలి, మాలో మాకు విద్వేషాలు కలగకుండా ఉండాలి’’ (ఓం సహనా వవతు సహనౌ భునక్తు, సహవీర్యమ్‌/ కరవావహై, తేజస్వీ నావథీ తమస్తు మా విద్విషా వ హై) అని వేదం మన చేత ప్రార్థన చేయిస్తూంటుంది.

వేదాన్ని ‘శ్రుతి’ అని కూడా అంటారు. మనకు తెలుసు గానానికి శ్రుతి ఉంటుందని. గానం శ్రుతిలోనే ఉండాలి. మన జీవన గానాలు శ్రుతిలోనే సాగాలి. మనం శ్రుతిలో కలవాలి. వేదాలలోకి వెళదాం. సత్యాలను ఆస్వాదిద్దాం. -రోచిష్మాన్‌

———————

వేదమంత్రమయుడు.. గణపతి
విఘ్నేశవిధి మార్తాండ చంద్రేంద్రోపేందవందిత
నమో గణపతేతుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతేః
 వేదమంత్రాలే గణాలు. వాటిద్వారా వాచ్చమయ్యే పరబ్రహ్మమే గణపతి. ఆ స్వామినే బ్రహ్మణస్పతి అంటారు. బ్రహ్మాది దేవతలచే వందితమయ్యే పరతత్వం. గణపతి సహస్రంలో ‘సప్తకోటి మహామంత్ర మంత్రితావయద్యుతిః’ అని ఉంది. స్వామి శరీరాంగాల నుంచి వచ్చే ప్రకాశం ఏడు కోట్ల దివ్యమంత్రాలచే మంత్రితమైనదని దీని అర్థం. శ్రీ వినాయకుడు ఆదిపూజ్యుడు. ‘అన్ని దిశల నుంచి ఎదురయ్యే విఘ్నాల నుంచి కాపాడే స్వామీ.. జ్ఞానసంపదకు నిలయమై నిలిచే నీకు వందనాలు’ అని వేదమంత్రాలు ఘోషిస్తున్నాయి. గణపతిలో శివతత్వం, విష్ణుతత్వం, శక్తితత్వం ఇమిడి ఉన్నాయి. మంత్రశాస్త్రాలు గణపతిని దశభుజ గణపతిగా వర్ణించాయి. వాటి ప్రకారం.. ఆ గణనాథుడిలో పార్వతీపరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, రతీమన్మథులు, భూమీవరాహులు, పుష్టి, పుష్టిపతులు, అనే మిధున దేవతలు కలిసి ఉంటారు. వీటికి సంకేతంగానే గణపతి పదిచేతుల్లో ఆ మిధున దేవతలకు సంబంధించిన ఆయుధాలుంటాయి. పదకొండో హస్తంగా తొండం, రత్నకలశం ఉంటాయి.
సిద్ధి, బుద్ధి అనే ఇరువురు భార్యతో గణపతి సిద్ధి, బుద్ధులను ప్రసాదిస్తున్నాడు. ఉపాసనలో దేవతాశక్తులు ఆ దేవతకు భార్యస్థానంలో ప్రకాశిస్తాయని శాస్త్రం. అందుకే.. ‘సిద్ధిబుద్ధిపతిం వందే బ్రహ్మణస్పతి సంజ్ఞితం మాంగల్యేశం సర్వపూజ్యం విఘ్నానాం నాయకం పరం’ అని శాస్త్రప్రవచనం.
 ‘‘చతుర్విధం జగత్‌ సర్వం బ్రహ్మతత్ర
 తదాత్మకం హస్తాశ్చత్వార ఏవంత్‌
స్వర్గషు దేవతాశ్చాయం పృథ్వ్యాం
నరాంస్తదాతలే అసురాన్నాగముఖ్యాశ్చ స్థాపయిష్యతి బాలకః’’
అని ఉపనిషత్‌ ఘోష. అంటే.. దేవతా, మానవ, అసుర, నాగ జగత్తులను నియమించే శక్తిశాలి అని అర్థం. సృష్ట్యాదిలో బ్రహ్మదేవునికి కలిగిన విఘ్నాలను తొలగించడానికి గణపతి ప్రణవస్వరూపుడై వక్రతుండాకృతిలో దర్శనమిచ్చాడు. అందుకే వాగ్గేయకారుడైన ముత్తుస్వామి దీక్షితులు తన ‘వాతాపి గణపతిం భజే’ కృతిలో ‘ప్రణవ స్వరూప వక్రతుండం’ అని కీర్తించారు. నమో విఘ్నరాజం భజే!!
-పీవీ సీతారామమూర్తి, vedas