Description
అమరకోశం
ఇందులో మూడు కాండలున్నాయి.
౧. ప్రథమకాండ – మంగళాచరణము, పరిభాష, స్వర్గవర్గం, వ్యోమవర్గం, దిగ్వర్గం, కాలవర్గం, ధీవర్గం, వాగ్వర్గం, శబ్దాదివర్గం, నాట్యవర్గం, పాతాళవర్గం, భోగివర్గం, నరకవర్గం, వారివర్గం అనే విభాగాలున్నాయి. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 330.
౨. ద్వితీయకాండ – భూవర్గం, పురవర్గం, శైలవర్గం, వనౌషధివర్గం, సింహాదివర్గం, మనుష్యవర్గం, బ్రహ్మవర్గం, వైశ్యవర్గం, శూద్రవర్గం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 750.
౩. తృతీయకాండ – విశేష్యనిఘ్నవర్గం, సంకీర్ణవర్గం, నానార్థవర్గం, అవ్యయవర్గం, లింగాదిసంగ్రహవర్గం, పున్నపుంసకలింగశేషం, త్రిలింగశేషం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 483.
కొన్ని మచ్చుతునకలు :
అమరసింహుడు వివిధ విషయాలకిచ్చిన పర్యాయ పదాలు చాలా ఆసక్తికరంగా హృద్యంగా ఉంటాయి.
దేవతల పేర్లు – అమరులు, నిర్జరులు, త్రిదశులు, విబుధులు, సురులు, సుపర్వులు, సుమనులు, ఆదితేయులు, ఋభులు, అస్వప్నులు, అమర్త్యులు, అమృతాశనులు, బర్హిర్ముఖులు, క్రతుభుక్కులు, గీర్వాణులు, బృందారకులు.
అమృతానికి – పీయూషం , సుధ.
మబ్బుల వరుస – కాదంబిని, మేఘమాల
సూర్యుడు – సూర, అర్యమన్, ఆదిత్య, ద్వాదశాత్మన్, దివాకర, భాస్కర, అహస్కర, బ్రధ్న, విభాకర, భాస్వాన్, వివస్వాన్, సప్తాశ్వ, హరిదశ్వ, ఉష్ణరశ్మి, వికర్తన, అర్క, మార్తాండ, మిహిర, అరుణ, పూషన్, ద్యుమణి, తరణి, చిత్రభాను, విభావసు, త్విషాంపతి, అహర్పతి, భాను, హంస, సహస్రాంశు, తపన , సవితా(తృ), రవి, అంశుమాలిన్, ఖద్యోత, లోకబాంధవ, తమిస్రహన్, పద్మినీవల్లభ మొ||
స్త్రీ – యోషిత్, యోషా, యోషితా, నారీ, అబలా, సీమంతినీ, వధూ, ప్రతీపదర్శినీ, వామా, వనితా, మహిళా.
అమరసింహుడు బౌద్ధుడనే అభిప్రాయంతోనో, మఱేంటో గానీ అమరకోశం తరువాత యాదవప్రకాశాచార్యుని వంటి వైదిక గురువులు అంతకంటే విపులమైన వైజయన్తీ ఇత్యాది నిఘంటువులని నిర్మించినప్పటికీ అవి అప్రసిద్ధంగానే మిగిలిపోయాయి. ఎవరూ వాటి జోలికే పోలేదు. అమరసింహుడు బౌద్ధుడైనప్పటికీ, అందఱు దేవతల కన్నా ముందు గౌతమ బుద్ధుడి నామాలు పేర్కొనడం ఒక్కటి మినహాయిస్తే, తతిమ్మా చోట్ల ఆ ఛాయలేమీ గోచరించనివ్వలేదు. వైదిక/ పౌరాణిక దేవీదేవుళ్ళ నామాలూ తదితర వివరాల నిమిత్తం రమారమి అఱవై శ్లోకాలు కేటాయించాడు. అందువల్లనే ఇది బౌద్ధుల్లో కన్నా వైదికుల (హిందువుల) లోనే ఎక్కువ ప్రాశస్త్యాన్ని పొందింది. అమరాన్ని అనుసరించి తెలుగులో పైడిపాటి లక్ష్మణకవి, అడిదం సూరకవి మొ||వారు ఆంధ్రనామసంగ్రహం, ఆంధ్రనామశేషం, సాంబనిఘంటువు మొదలైన అచ్చతెలుగు పద్యనిఘంటువుల్ని నిర్మించారు. తెలగాణ్యుడైన తూము శ్రీరామదాసకవి ఆంధ్రపదనిధానం అనే మహా నిఘంటువుని కూర్చారు. ఇంతమంది వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో ఒక వ్యక్తి ననుసరించారంటే, ఇప్పటికీ అనుసరిస్తున్నారంటే అది నిస్సంశయంగా అతని గొప్పతనానికి ఎత్తిన పతాకమే కదా !
అమరకోశానికి ఉన్న అఱవై భాష్యాల్లో అయిదు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయని ప్రకాశకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సమీక్షించబడుతున్న అమరకోశ ప్రచురణ అన్నమాచార్యుల మనుమడైన తాళ్ళపాక తిరువేంకటార్యులు కూర్చిన సంస్కృతాంధ్ర మిశ్రమైన గురుబాల ప్రబోధికా వ్యాఖ్యతో సహా ముద్రించబడింది. ఏ కారణం చేతనో ఇది లోకంలో లింగాభట్టీయంగా ప్రసిద్ధి చెందింది.
(అమరకోశము – సంస్కృత పద్యనిఘంటువు ; రచయిత – అమరసింహుడు ; వ్యాఖ్యాత – తాళ్ళపాక తిరువేంకటాచార్యులు ; పుటలు – 1,000
Tags:
Amarakosam, Amarasimhudu, Nighantuvu, Pracheena Nighantuvu, Dictionary,