Sri Devi Leelamrutham

శ్రీ దేవి లీలామృతం
– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

180.00

Share Now

Description

శ్రీ దేవి లీలామృతం
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

అమ్మవారి – పూజ, అష్టోత్తర శతనామవళులు,
సహస్ర నామవళులు, ఉపనిషత్తులు, సూక్తములు,
కవచములు, అష్టకములు, అష్టోత్తర శతనామ స్తోత్రములు
మరియు అనేక స్తోత్ర రత్నములతో …
జయాన్ని అందించే విజయదశమి
అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి. దుర్గాదేవిగా పూజించినా, బతుకమ్మగా కొలిచినా, అపర కాళికాదేవిగా అర్చించినా, చాముండేశ్వరిగా ఏనుగు అంబారీపై ఊరేగించినా…ఏ రూపంలో ఎలా సేవించినా సకల జీవకోటినీ సంరక్షించే అమృతమూర్తి ఆ జగజ్జనని. దుష్టశిక్షణ, శిష్టరక్షణ గావించే జగన్మాత. ఆ లోకపావనిని పరమభక్తితో కొలిచే పండుగే విజయదశమి! యశస్సు, తేజస్సు, ధైర్యం, బలం, కార్యసిద్ధి, ఐశ్వర్యం, శాంతి, ఆయురారోగ్యాలను ప్రసాదించమని కోరుకుంటూ, అఖండ భారతావని భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకునే పర్వదినమే దసరా.
దసరా, దశరా, దశ హర అంటే పది రోజుల పండుగ అనే అర్థంలో చెబుతారు. ఈ దశ హరయే కాలక్రమంలో దసరా అని వ్యవహారంలోకి వచ్చింది. ఈ దసరా సందర్భంగా తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలు దేవీనవరాత్రులు. శరదృతువులో రావడం వల్ల ఈ నవరాత్రులను శరన్నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రుల్లో శక్తి పూజే ప్రధానం. ఒక్కోరోజు ఒక్కో విశిష్టమైన అవతారంలో దుర్గమ్మతల్లి భక్తులకు దర్శనమిచ్చి అనేక ఆధ్యాత్మిక అనుభూతులనందిస్తుంది.
నవరాత్రుల మూలకథ
మహిషాసురుడు అనే రాక్షసుడు లోకకంటకుడిగా మారి ముల్లోకాలలో స్వైరవిహారం చేశాడు. ఆ రాక్షసుడి భీకర చర్యలకు తట్టుకోలేని దేవతలు మహిషాసురుడిని సంహరించాలంటూ జగన్మాతను వేడుకుంటారు. దేవతల కోరిక మేరకు అమ్మవారు తొమ్మిది రోజులపాటు మహిషాసురునితో యుద్ధం చేసి, పదవరోజున ఆ అసురుణ్ణి సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసుడి పీడ వదిలిన దశమికి గుర్తుగా అప్పటినుంచి దసరాను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి విజయదశమినాడే సంహరించాడనీ, ఆ విజయానికి సంకేతంగానే విజయదశమినాడు ప్రజలంతా పండుగ ఆచరించినట్టు కూడా చెబుతారు.
మహాభారతంలో విజయదశమి పరంగా పాండవులు శమీవృక్షాన్ని పూజించి విజయాన్ని సాధించిన కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దసరా రోజు ఏంచేయాలి ?
శరన్నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. దుర్గాపూజ చేసేవారు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, తలస్నానం చేసి పూజామందిరం, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టి, పూజామందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. ఎర్రటి పట్టువస్త్రాలు ధరించి పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి చిత్రపటం లేదా ప్రతిమగానీ సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి కనకాంబరములు, పూవులు, నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటి పండ్లు అమ్మవారి పూజకు సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు మూడు ప్రమిదలు, తొమ్మిది వత్తులు తయారుచేసుకోవాలి. హారతికి ఆవు నెయ్యి, దీపారాధనకు నువ్వులనూనె సిద్ధం చేసుకోవాలి. నుదుట కుంకుమ ధరించి, శ్రీమాత్రేనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించిన అనంతరం దీపారాధన చేయాలి.
పూజకు ముందు రాజరాజేశ్వరి అష్టకం, రాజరాజేశ్వరి సహస్రనామాలు, దేవీ భాగవత పారాయణము చేయాలి. ఇంకా విజయదశమి రోజు అమ్మవారి ఆలయాల సందర్శనం శుభఫలితాలనిస్తుంది. ఆలయాల్లో రాజరాజేశ్వరి ఆష్టోత్తర పూజ, లలితా సహస్రనామము, నవరాత్రి వ్రతము, శ్రీదేవి లీలామృతం, రాజరాజేశ్వరి నిత్యపూజ, కోటి కుంకుమార్చన వంటి పూజలు, పంచామృతముతో అభిషేకం నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
సాయంత్రం వేళ :యుజ శుక్ల దశమినాటి సాయంసంధ్యా సమయాన్నే విజయకాలం అంటాం. అది సర్వ కార్యసాధకమైన సమయం. ఆ దశమీ దినం శ్రవణా నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. ఈరోజున సీమోల్లంఘనం చేస్తారు. అంటే ఊరి పొలిమేరలు దాటి తిరిగి వెనక్కి రావడమన్నమాట. ఈ విజయదశమి పుణ్యదినాన ప్రజలంతా ఊరిలో ఈశాన్య దిశలో ఉండే శమీవృక్ష ప్రదేశానికి వెళతారు. శమీవృక్షానికి పూజచేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. శమీ ఆకులను బంగారంగా పెద్దలకు పంచిపెడతారు. శమీపూజ చేసిన తరువాత పాలపిట్టను దర్శించే సంప్రదాయం కూడా ఉంది.
చెడుపై మంచి విజయమే దసరా
విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది. విజేతకు ప్రపంచం జేజేలు పలుకుతుంది. చెడుపై మంచి సాధించే గెలుపు అందరికీ మేలు చేస్తుంది. అలాంటి ఎన్నో విజయాలను మోసుకొచ్చింది కనుకే దసరా అందరికీ వేడుక అయింది. ఎప్పుడూ చెడుపై విజయమే ఇచ్చింది కనుక అది విజయదశమి అయింది. ఎన్నో యుగాలుగా అదే పరంపర కొనసాగుతోంది. నిజానికి దశ, హర అంటే పది చెడు లక్షణాలను తొలగించుకోవడం అని అర్థం. మనిషిలో పది దుర్గుణాలు అతణ్ణి అధర్మం వైపు నడిపిస్తున్నాయి. ఆ చెడుగుణాలపై విజయం కోసమే దసరా పండుగ చేసుకుంటాం. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకారం వంటి లక్షణాలు మనుషుల్ని దారి తప్పిస్తాయి. చెడు పనులకు ప్రోత్సహిస్తాయి. అవి పరోక్షంగా ఇతరులకు హానిచేస్తాయి. అందుకే వీటిపై విజయం సాధించాల్సి ఉంటుంది.
అందుకే మనలోని చెడును వదిలించుకోవడమే దసరా కానుక కావాలి. ఆ లక్ష్యసాధనలో మన విజయానికి అమ్మవారి ఆశీస్సులు కావాలన్నదే కోరిక కావాలి. అప్పుడే నవరాత్రి ఉత్సవాలు నిజమైన విజయాలను అందించే విజయదశమిగా మన ముంగిట నిలుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో బొమ్మల కొలువులూ, అలంకారాలు, పేరంటాలు వంటి వేడుకలు చేస్తారు.
నవరాత్రులూ …..నవరూపాలూ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి ఒక్కోరోజు ఒక్కో అవతార మహిమ చూపుతుంది. తనలోని వివిధ రూపాలను చూపి భక్తులను కరుణిస్తుంది. ఆశ్వయుజ శుద్ధపాడ్యమితో ప్రారంభమై తొమ్మిది రోజులూ తొమ్మిది అవతారాలలో ఆ కాత్యాయనిని మంత్రదీక్షతో పూజిస్తారు.
బాలాత్రిపురసుందరి : బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. అందుకే నవరాత్రుల్లో ప్రథమ దినాన అమ్మవారిని బాలాత్రిపురసుందరీదేవిగా ఆరాధించడం ద్వారా అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలని చెబుతారు పండితులు.
అన్నపూర్ణాదేవి : అమ్మవారు రెండవరోజు అన్నపూర్ణాదేవిగా కనిపిస్తారు. ఓ చేతిలో మధురసాలతో ఉన్న మాణిక్య పాత్ర, మరో చేతిలో రతనాల గరిట పట్టుకుని భక్తులను అన్నపూర్ణాదేవిగా అనుగ్రహిస్తుందా తల్లి. ఈ చరాచర సృష్టికి జీవనాధారం తానేనన్నదే అమ్మవారు ఆ రూపంలో దర్శనం ఇవ్వడంలోని అంతరార్థం.
గాయత్రీదేవి : మూడవరోజు అమ్మ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో కనిపిస్తుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులను కరుణిస్తుంది. గాయత్రిని మించిన మంత్రము, అమ్మను మించిన దైవమూ లేవని అంటారు. గాయత్రి జపించేవారిని అమ్మవారు అనునిత్యం రక్షిస్తుందన్నది భక్తు ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు ప్రతి స్త్రీ ఒక శక్తిస్వరూపిణే. ఆమెలో ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలున్నాయి. అవి ఆమెలోని అపారమైన విద్యలకు సాక్ష్యాలు. కనుక స్త్రీలను గౌరవించడంవల్లేనే ఈ ప్రపంచం కాపాడబడుతోందన్నది గాయత్రీ అవతారమహిమగా మనం భావించవచ్చు.
మహాలక్ష్మి : మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన ఈతిబాధలూ ఉండవని భక్తుల విశ్వాసం. సకల సంపదల స్వరూపిణి అయిన శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే, సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. స్త్రీ శక్తిని కొలవడమే సంపదలనిస్తుందని, ఆమెను గౌరవించడంలోనే అష్టైశ్వర్యాలు దాగి ఉన్నాయని తెలుపుతూ కనకదుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో కనిపిస్తుంది.
లలితాత్రిపురసుందరి : శరన్నవరాత్రులలో ఐదోరోజు దుర్గాదేవి లలితాత్రిపురసుందరి అవతారంలో దర్శనమిస్తుంది. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్ఠానదేవతగా లలితాత్రిపురసుందరిని ఆరాధిస్తారు. మాతృమూర్తి, మాతృకా స్వరూపిణి చెరకుగడా, విల్లూ, పాశాంకుశాలు ధరించి ఉంటుంది. ఆమెకు ఇరువైపులా లక్ష్మీసరస్వతులు కొలువుతీరి సేవించుకుంటూ ఉండగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది లలితా త్రిపుర సుందరి.
సరస్వతీ దేవి : వీణానాదం చేస్తూ పుస్తకం ధరించిన రూపంతో సరస్వతీదేవిగా కనువిందు చేస్తుంది జగన్మాత.. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా, త్రిశక్తి స్వరూపిణియైన దుర్గాదేవి తన అంశంలోని నిజరూపాన్ని సాక్షాత్కరింపచేయడమే ఈ అలంకార ప్రత్యేకతగా చెబుతారు. అజ్ఞానమే అసలైన చీకటి. ఆ చీకటిని పారదోలడానికి విద్యాజ్ఞానం ఎంతో అవసరం. విద్యలకు ఆధిదేవత అయిన సరస్వతీ అవతారంలో అమ్మవారిని కొలవటంవల్ల అజ్ఞానం తొలగిపోతుందని చెబుతారు.
దుర్గాదేవి : మహిషాసురుడిని అంతమొందించే సమయంలో కాళికామాత ధరించిన అవతారాలలో దుర్గాదేవి అవతారం ముఖ్యమైనది. శరన్నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అష్టమినాడు మాత దుర్గ అవతారంతో మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసినవైనానికి గుర్తుగా అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఆ రోజు అమ్మను దుర్గాదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. ఎనిమిదవ రోజు…అంటే ఆశ్వయుజ అష్టమి రోజున దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినంగా పాటిస్తారు. ఆ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్రపూజ చేస్తారు.
మహిషాసుర మర్దిని : నవరాత్రులలో మహోగ్రరూప అవతారం మహిషాసురమర్దినీదేవి. తొమ్మిదవ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహవాహనం అధిష్ఠించి, ఆయుధాలు ధరించి, అమ్మ సకల దేవతల అంశతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది.
రాజరాజేశ్వరి : ఇక ఆఖరుగా రాజరాజేశ్వరీదేవి అలంకారం. రాజరాజేశ్వరీదేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. చేతిలో చెరకు గడ ఉంటుంది. భక్తులకు అభయం ఇస్తూ కనిపిస్తుంది. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవిగా పిలుస్తారు. ఆమెకే విజయం అని మరో పేరు. విజయాదేవి చెడుపై సాధించిన విజయమే విజయదశమికి చిహ్నంగా కనిపిస్తుంది అమ్మవారు.