> ప్రహ్లాదుని తల్లిపేరు ఏమిటి? > ధుంధుమారుడు ఎవరు? > కల్మాషపాదుని కథ ఎక్కడొస్తుంది? > సప్తద్వీపాలు, సప్తసముద్రాలు ఎలా ఏర్పడ్డాయి? శ్రీమద్భాగవతంలో వివరించబడ్డ ఈ సమాధానాల కోసం భాగవతమంతా తిరగేయాల్సిందే అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. భారతీయులందరికీ ఆదరణీయ గ్రంథాలు రామాయణ, భారత, భాగవతాలు. వాటిలో సాక్షాత్తూ భగవానుడి స్వరూపమైన శ్రీమద్భాగవతం12 స్కంధాలతో 18వేల శ్లోకాలతో విరాజిల్లుతున్నది. శ్రీ వ్యాసభగవానుడు శ్రీమద్భాగవతంలో ఎంతోమంది మహారాజుల యొక్క వంశచరిత్రలు, మహానుభావుల గాథలు, అనేకనదుల వర్ణనలు, మహర్షుల చరిత్ర, దైవ-అసుర-అప్సరసాదుల వివరణలు, జనపదాలు, ద్వీపాలు, లోకాలు, సముద్రాలు, నగరాలు, పుణ్యతీర్థాలు, మహాపర్వతాలు, వివిధ అరణ్యాలు, వివిధ దేవీ-దేవతల స్తోత్రాలు….. ఇలా అనేకమైన విషయాలను నిక్షిప్తం చేసాడు. అందుకే అనేక రత్నాలను ఇముడ్చుకున్న సముద్రుడిలా గంభీరంగా ప్రకాశిస్తున్నది శ్రీమద్భాగవతం. మహావిస్తారమైన ఈ పురాణాన్ని నిత్యం పారాయణ చేసేవారైనా, సప్తాహంగా ప్రవచనం చేసేవారైనా ‘ఫలానా విషయం ఏస్కంధంలో ఏశ్లోకంలో ఎక్కడ చెప్పబడింది?’ అని అడిగితే వెంటనే స్ఫురించకపోవచ్చు. ఒకవేళ స్ఫురించినా స్కంథం-అధ్యాయం వరకు చెప్పవచ్చు. కానీ శ్లోకం సంఖ్య చెప్పడం కష్టసాధ్యం. అలాంటప్పుడు భాగవతంలో ఏదైనా ఒక విషయం పరిశీలించాలనుకుంటే, లేదా చదవాలనుకుంటే, 12 స్కంధాలలో, 18వేల శ్లోకాలలో అది ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? భాగవత గ్రంథమంతా త్రిప్పవలసిందేనా? ” భాగవత నామకోశమ్” గ్రంథం దగ్గర ఉంచుకుంటే చాలు… భాగవతంలో మనకు కావలసిన విషయం ఏదైనా సులభంగా, అతి తక్కువ సమయంలో సంపూర్ణ సమాచారాన్ని పొందగలుగుతాము. అనేక గ్రంథాలను సంకలనం చేసిన శ్రీ ఎస్.టి.జి. అంతర్వేది కృష్ణమాచార్య భాగవత ప్రియులకు చేసిన మహోపకారం ఈ గ్రంథం. రోజులో…. నెలలో…కాదు. 8సంవత్సరాలపాటు వారు భాగవతాన్ని పారాయణం చేసి, అందులో వచ్చే వివిధరకాలైన నామములన్నీ రాసుకుని తయారు చేసిన నిఘంటువు శ్రీ భాగవత నామకోశమ్. సంపూర్ణ వ్యాసభాగవతములోని 3200 నామములను క్రోడీకరించి, వాటిని సులభంగా అకరాది క్రమంలో కూర్చి ఈ గ్రంథాన్ని తయారు చేసారు. భాగవతంలోని ఆయా నామములు ఏ స్కంధం, ఏ అధ్యాయం, ఏ శ్లోకంనందు వివరించబడ్డయో పూర్తి వివరాలు ఇందులో మనకు లభించడం విశేషం. ముఖ్యమైన కొన్నింటిని శ్లోకాలతో సహా ఉదహరించారు. సంవత్సరాల తరుబడి పరిశ్రమ, భాగవతంపై పట్టు, రచనా సామర్థ్యం ఉన్నప్పుడే ఇలాంటి నామకోశాలను తయారు చేయడం సాధ్యమవుతుంది. వీటన్నింటినీ మేలవించి శ్రీమాన్ ఆచార్యుల వారు తయారు చేసిన గ్రంథము భాగవత నామకోశము. తెలుగులో శ్రీమద్భాగవతంపై వెలువడిన నామకోశాలలో ఇది మొదటిది. పురాణాలను చదివి అంతటితో వదలకుండా దానికి నామకోశాన్ని తయారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంకలనకర్త ఆలోచన అభినందనీయం. భాగవతగ్రంథాలెన్నో ముద్రించి తెలుగునాట భాగవతసుధలను పంచిన గౌడీయమఠం వారు ఈ పుస్తకాన్ని ముద్రించడం ఆనందించదగిన విషయం. “భాగవత నామకోశము” భాగవత ప్రియులందరి దగ్గరా ఉండవలసిన గ్రంథము. ఈపుస్తకంపై నేను చేసిన పుస్తక సమీక్ష వీడియో రూపంలో https://youtu.be/vJNeSOAIpBI సమీక్షకులు : అప్పాల శ్యాంప్రణీత్ శర్మ అవధాని