Description
యాజ్ఞవల్క్య స్మృతి
యాజ్ఞవల్క్య స్మృతి హిందూమతం లోని అనేక ధర్మ గ్రంథాలలో ఒకటి. ఇది 3వ నుండి 5వ శతాబ్దానికి మధ్య నాటిది. ధర్మశాస్త్ర సంప్రదాయానికి చెందినది. ఈ సంస్కృత గ్రంథాన్ని మనుస్మృతి తర్వాత రచించారు. కానీ దాని లాగా, నారదస్మృతి లాగా, దీన్ని కూడా ఛందోబద్ధ శ్లోక శైలిలో కూర్చారు. యాజ్ఞవల్క్య స్మృతిలోని చట్టపరమైన సిద్ధాంతాలు ఆచార -కాండ (ఆచారాలు), వ్యవహార -కాండ (న్యాయ ప్రక్రియ), ప్రాయశ్చిత్త -కాండ (నేరం-శిక్ష, తపస్సు) అనే మూడు పుస్తకాలలో అందించబడ్డాయి.
న్యాయ ప్రక్రియ సిద్ధాంతాలపై పెద్ద విభాగాలతో ఈ శైలిలో “అత్యుత్తమంగా రచించిన” కృతి. ఇది మధ్యయుగ భారతదేశ న్యాయవ్యవస్థ అమలులో మనుస్మృతి కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపింది. 1849లో జర్మన్ భాషలో ప్రచురితమైన మొదటి అనువాదంతో ఇది, పురాతన మధ్యయుగ భారతదేశంలోని చట్టపరమైన ప్రక్రియల అధ్యయనాలలోను, బ్రిటిష్ ఇండియాలోనూ ప్రభావవంతంగా మారింది. చట్టపరమైన సిద్ధాంతాలలో మరింత ఉదారవాదం, మానవత్వం, చట్టపరమైన పత్రాల సాక్ష్యం, న్యాయబద్ధతపై విస్తృతమైన చర్చలు మొదలైన వాటిలో మనుస్మృతికీ దీనికీ ఉన్న తేడాల కారణంగా ఇది ప్రసిద్ధి చెందింది.