Valmiki Ramayanam (3 Parts) – Srinivasa Siromani

వాల్మీకి రామాయణం (3 Parts)
వచనానువాదం – శ్రీనివాస శిరోమణి

1,440.00

Share Now

Description

వాల్మీకి రామాయణం (3 Parts)
వచనానువాదం – శ్రీనివాస శిరోమణి

శ్రీమద్రామాయణమును సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. శ్రీ శ్రీనివాస శిరోమణి గారు సరళమైన తెలుగులోకి అనువదించారు. 9 సంపుటాలుగా ఉన్న రామాయణాన్ని మూడు సంపుటాలుగా మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అంటే ప్రతి కాండ ఒక సంపుటంగా కాకుండా, రెండు మూడు కాండలు కలిపి ఒక సంపుటంగా ప్రచురించడం జరిగింది.మొదటి సంపుటిలో బాల, అయోధ్య కాండలు, రెండవ సంపుటిలో అరణ్య, కిష్కింధ, సుందర కాండలు, మూడవ సంపుటి నందు యుద్ద, ఉత్తర కాండలు ఉన్నాయి.

ఇప్పటికి 11 సార్లు ప్రచురించబడి, అశేష అంధ్ర ప్రజానీకం మన్ననలు పొందిన శ్రీ శ్రీనివాస శిరోమణి గారి రామాయణం మీ కోసం.

రామాయణం… ఎందుకు చదవాలి? 

రాముడి అయనం (నడచిన మార్గం) రామాయణం. వ్యక్తే కాదు, కుటుంబం, సమాజం దేశం… ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే రామాయణం నిత్యపారాయణమైంది.

భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు… రామాయణ, భారత, భాగవత గ్రంథాలు. రామాయణం ఆదర్శవంతమైన జీవితానికీ, భారతం మనం నిత్యం చూస్తున్న, అనుభవిస్తున్న నిజజీవితానికీ, భాగవతం దివ్యమైన జీవితం గడపడానికీ మార్గదర్శకాలుగా పెద్దలు పరిగణిస్తారు. ఈ మూడింటిలో రామాయణం ద్వారా జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, అలాంటి సందర్భాల్లో రాముడు ఎలా నడిచాడో తెలుసుకొని, వాటిని అనుసరిస్తూ ఆ సమస్యలను అధిగమించవచ్చు.

రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అలవాటు చేస్తుంది. సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. వ్యక్తితో మొదలైన సంస్కారం కుటుంబంలో, సమాజంలో వికసించాలి. దానివల్ల దేశం, ప్రపంచం చక్కబడతాయి. ఈనాడు మనం చూస్తున్న కులాలూ, మతాలూ, ప్రాంతాలు అనే అసహజ భావనలు వాటంతట అవే సమసిపోతాయి. ‘వసుధైక కుటుంబం’ అనే వేదవాక్కుకు సార్థకత ఏర్పడుతుంది. మనల్ని మనమే కాదు, సమాజాన్నీ, తద్వారా మానవులందరినీ రక్షించుకోవడానికి తోడ్పడుతుంది. ఇది జరగాలంటే ప్రతి వ్యక్తీ రామాయణంలో ఉటంకించిన భావాలను అర్థం చేసుకోవాలి. అందుకోసం రామాయణం చదవాలి. వర్తమాన పరిస్థితులకు అన్వయించుకోదగిన ఘట్టాలు ఎన్నో రామాయణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని:

దాంపత్య ధర్మం తెలుసుకోవడానికి…

వైదిక సంస్కృతిలో దాంపత్య ధర్మం అతి పవిత్రమైనది. ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా వాల్మీకి ప్రస్తావించాడు. సీతారాముల మధ్య నెలకొన్న ప్రేమానుబంధం అపురూపమైనది, ఆదర్శవంతమైనది. వారి మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమను బాలకాండలో (77-26, 27) వాల్మీకి ఇలా ఆవిష్కరించాడు-

‘‘ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి

గుణై రూప గుణై శ్చైవ భూయ ఏవాభ్య వర్ధత

తస్యాశ్చ భర్తా ద్విగుణాం హృదయే పరివర్తతే’’

అంటే రాముడికి సీత అంటే మిక్కుటమైన ప్రేమ. అందుకు కారణం తన తండ్రి దగ్గరుండి వివాహం జరిపించడం. పైగా సీతలో సహజంగా ఉన్న సౌందర్యం, సద్గుణాలు రాముడి హృదయాన్ని ఆకట్టుకోవడంతో ఆ ప్రేమ మరింతగా పెరిగింది. ఇక సీతకు రాముడి మీద ప్రేమ ద్విగుణీకృతంగా ఉంది. శివ ధనుర్భంగం చేసి, సీత హస్తాన్ని ఆయన అందుకున్నాడు మరి! అయితే తండ్రి వివాహం జరిపించడం ఏమిటి? దీనికి సమాధానం అరణ్యకాండలో సీత తన వివాహ వృత్తాంతాన్ని చెప్పినప్పుడు తెలుస్తుంది. శ్రీరాముడు శివ ధనుర్భంగం చేసిన తరువాత ‘‘ఇదిగో నా కుమార్తెను ఇస్తున్నాను, స్వీకరించు’’ అని జనకుడు అంటే, తన తండ్రి అంగీకరిస్తేనే కాని పాణిగ్రహణం చేయనని రాముడు అన్నాడనీ, దశరథుని అనుమతి లభించిన తరువాతే తనను పరిణయమాడాడనీ సీత చెబుతుంది.

దాంపత్యానికి ఉన్న పవిత్రత రామాయణంలో పలుచోట్ల ప్రస్తావితం అయింది. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వనవాసానికి పంపిన భర్తపై కౌసల్య కోపించకుండా, భార్యగా తన విధులను దుఃఖంలో కూడా నిర్వర్తించడం రామాయణంలో కనిపిస్తుంది. మానవుల్లోనే కాదు, రాక్షసుల్లో సైతం దాంపత్యానికి ఉన్న పవిత్రతను మండోదరి ద్వారా మనకు వాల్మీకి తెలియజేశాడు. కుటుంబానికి ధర్మబద్ధమైన దాంపత్య జీవితం మూలకందం. దాంపత్య ధర్మం గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి.

ఆదర్శాలు నేర్చుకోవడానికి…

గురుభక్తి, భాతృప్రేమ, సౌహార్దం తదితర గుణాలు కుటుంబంలోని పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమించాలి. పెద్దలు పరంపరానుగతంగా వస్తున్న సంస్కారాలను అలవరచుకొని పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. పిల్లలు తమ కర్తవ్యాన్ని విస్మరించకుండా వారికి శిక్షణ ఇవ్వాలి. ‘తరాల భేదం లేకుండా ఎలా ఉంటుంది?’ అని సాకులు చెబితే తమ సంతానానికే కాదు, సమాజానికి కూడా చెడు చేసినవారు అవుతారు. రామాయణంలో రాముడు ప్రదర్శించిన సుగుణాలను అనుసరించాలి. దానికోసం రామాయణం తప్పకుండా చదవాలి.

నిస్వార్థ ప్రవృత్తి కోసం…

‘అర్థం అన్ని అనర్థాలకూ మూలం’ అనేది నానుడి. సుఖమయ జీవితానికి అర్థం (సంపద) అవసరమే కావచ్చు. అదే పరమార్థం అనుకుంటే అంతకన్నా అనర్థం లేదు. ‘రాముడు వనవాసానికి వెళ్తాడో, లేదో?’ అని కైకేయి శంకిస్తుంది. అది రాజాజ్ఞ అని గుర్తు చేస్తుంది. అప్పుడు రాముడు కైకేయితో-

‘‘నాహ మర్థపరో దేవి! లోకమావస్తుముత్సహే

విద్ధి మామృషిభిస్తుల్యం విమలం ధర్మమాస్థితమ్‌’’ (అయోధ్య కాండ)

‘‘ఓ దేవీ! నేను అర్థప్రధానుణ్ణి కాను. నేను మంచి మార్గంలో నడుస్తూ, జగత్తును సక్రమమైన దారిలో నడిపించాలన్నదే నా కోరిక. నేను ప్రాధాన్యమిచ్చేది ధర్మానికే. నేను ఋషితుల్యుణ్ణి అనే విషయాన్ని గుర్తుంచుకో. తండ్రి ఆజ్ఞానుసారం వనవాసానికి ఇప్పుడే వెళ్తున్నాను’’ అంటాడు. అర్థకామాల కన్నా ధర్మమే శ్రేష్ఠమని రాముని మనసులోని మాట. వాటిని  పరమ ధ్యేయంగా భావించిన రావణాదుల వంటి వారు ఎలా పతనమయ్యారో రామాయణం చెబుతుంది. వర్తమానంలో సంపద కోసం, అధికారం కోసం వెంపర్లాడుతున్న వారికీ, అందుకోసం ఏది చెయ్యడానికైనా వెరవని వారు… రామభరతాదుల నిస్వార్థ ధార్మిక ప్రవృత్తిని కొంతైనా అవగాహన చేసుకుంటే, వారి వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకు రామాయణమే శిరోధార్యం.

వ్యక్తిత్వ వికాసానికి..ఓర్పు కలిగి ఉండడం అవశ్యమని రామాయణం ప్రవచిస్తుంది. ఎంత చిన్న కష్టమైనా సహించలేక ఆత్మహత్యలకు పాల్పడడం, తమ కష్టాలకు కారకులైన వారిని హత్య చెయ్యడం ఈనాటి కొందరి ప్రవృత్తి. కష్టాలను ధైర్య సాహసాలతో ఎదుర్కోవడమే జీవితానికి ఉత్తమ ఆదర్శం. ఉదాహరణకు హనుమంతుణ్ణీ, సీతనూ పేర్కొనవచ్చు. ఒకానొక సమయంలో, సీత జాడ తెలుసుకోలేక హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఒక్క క్షణం ఆలోచించి, ఆత్మహత్య ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో అర్థం చేసుకొని-

‘‘అనిర్వేదః శ్రియో మూలం

అనిర్వేదః పరం సుఖం’’

‘‘దిగులు చెందకుండా ఉండడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. అదే సమస్త సుఖాలకూ మూలం’’ అంటాడు. అంతే కాకుండా-

‘‘వినాశే బహవే దోషా జీవన్‌ ప్రాప్నోతి భద్రకమ్‌’’‘

‘‘మరణిస్తే ఏముంది? అన్నీ దోషాలే. జీవించి ఉంటే ఎప్పటికైనా విజయం ప్రాప్తిస్తుంది’’ అని అంటాడు. సుందరకాండలో హనుమ, సీతల మనస్సులను చదివితే దైవబలం ఎంతటి ధైర్యాన్నిస్తుందో అర్థమవుతుంది. ఇది తెలుసుకోవాలంటే

రామాయణమే దారి చూపిస్తుంది.

ఆదర్శవంతమైన జీవితానికి రామాయణం ఆటపట్టు. ఆదర్శ జీవితం గడుపుతూ, పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన శ్రీరాముడు రామరాజ్యాన్ని వ్యవస్థీకరించాడు. ఈనాటి ప్రభుత్వాలకూ, అధికారులకూ అనుసరణీయమైన ఎన్నో విషయాలను రామాయణం తెలియజేస్తుంది. అయోధ్య కాండలో- రామభరతుల సంవాదంలో పరిపాలనా సూత్రాలెన్నిటినో భరతుడికి రాముడు వివరించాడు.

కథగా చెప్పుకుంటే- రాముడిలో ధైర్య స్థైర్యాలు నింపడానికి సిద్ధాంతపరంగా వశిష్ఠుడు కృషి చేస్తే, దాన్ని ఎలా ఆచరణలో పెట్టి విజయం చేకూర్చుకోవచ్చు అనేది విశ్వామిత్రుడు వివరించాడు. రామాయణం చదివితే సంభాషణా నైపుణ్యం తెలుస్తుంది. వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. అన్నిటికన్నా మానసిక చైతన్యం, ధైర్య స్థైర్యాలు, ముఖ్యంగా నీతి, నిజాయతీలు, కార్యసాధనా నైపుణ్యం లాంటివి కరతలామలకం అవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ రామాయణాన్ని తప్పనిసరిగా చదవాలి.

ధర్మం తప్పని మానవరూపుడు

మహాకవి వాల్మీకి రామాయణాన్ని ఆద్యంతం ఎంతో రమణీయంగా, మనం అందరం అనుసరించే విధంగా… భగవదవతారుడైన శ్రీరాముణ్ణి మానవమాత్రుడిగా మాత్రమే చూపిస్తూ, ఆదర్శవంతమైన, ధర్మయుతమైన మార్గాన్ని మన ముందు ఉంచాడు. రామాయణంలోని బాలకాండ మొదలు యుద్ధకాండ వరకూ రాముడు మానవునిగానే ప్రవర్తించిన తీరును వాల్మీకి అత్యద్భుతంగా చూపాడు. బ్రహ్మాది దేవతలూ, ఋషులూ ఆయా సందర్భాల్లో రాముడు విష్ణ్వావతారం అని చెప్పినా, చివరివరకూ తాను దశరథ నందనుడినేనని రాముడు చెప్పుకొచ్చాడు. జీవితాంతం ధర్మమార్గాన్ని విడిచిపెట్టలేదు. తన ఆదర్శాలకు కళంకం రానివ్వలేదు. శ్రీరాముడి జీవితంలో ఇటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి.

 ఎ. సీతారామారావు

Author
Srinivasa Siromani
Highlights
  • Author: Srinivasa Siromani
  • 1544 Pages
  • Language: Telugu