Sundarakanda Vachanam

పురాణపండ సుందరకాండ వచనం

Pages : 264

180.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

పురాణపండ సుందరకాండ వచనం

Pages : 264

ధర్మార్థ కామ్య మోక్ష ఫలము సుందరకాండము

రామాయణమంతటికీ సుందరకాండము తలమానికం. అందరికీ ధర్మార్థ కామ్య మోక్ష ఫలాదులనందించేది. సకల కార్యజయాలకూ మూలం. ఇది హనుమంతుని సుగుణ, పరాక్రమాలను వర్ణించిన సుందరకావ్యం. సుందరమైన కాండం కనుక సుందరకాండం అని పేరు వచ్చింది.
రామాయణం సుందరం, సీతాదేవి చరిత్ర సుందరం. శ్రీరాముడతి సుందరుడు. కథ, కవిత్వం, వర్ణనములు అతి సుందరములు. హనుమంతుని చేష్టలు రాక్షసులకు అతి భయంకర సదృశములైనప్పటికీ పఠితులకవి అత్యంత సుందరములు. కావున ఇది సుందరకాండమైనది. సుందరకాండ శ్రవణ, పారాయణ ఫలము సకల కార్యసిద్ధికి, ఆధ్యాత్మికతా సిద్ధికి మార్గంగా ఉపకరిస్తుంది.
‘‘వాయుసూనంచ ప్రణమామి పునః పునః’’ అంటూ నమస్కరించి త్రికరణశుద్ధిగా అర్చిస్తే హనుమంతుని దివ్యాంతర్గత శక్తి మనకు లభించడమే కాకుండా నిరంతరం మనల్ని కాపాడుతాడా స్వామి. వ్యాధి, భూత, జ్వరాది రోగ విముక్తికి సర్వ పాపఫల నిష్కృతికి హనుమత్సేవకులకిది నిత్యపారాయణ గ్రంథం. మహిమాన్వితం- ముక్తిప్రదమీ సుందరకాండం.

‘శ్రద్ధేషు దేవకార్యేషు పఠేత్సుందరకాండకమ్‌’ అని బృహద్ధర్మ పురాణంలో చెప్పబడినది. పితృకార్యాదులందు కూడా సుందరకాండ పారాయణ చేయదగినది. సుందరకాండమంతయూ మహా మంత్ర సాధకమని మంత్ర తత్వ కోవిదులు చెబుతారు.
రామాయణానికే రత్నం వంటివాడు వాయునందనుడు. దైవాసుర గుణ సంపదలు, జీవితాలు-తారతమ్యాలు, సీతారావణ సంవాద రూపమున ఈ కాండలో స్పష్టం చేయడమైనది. ఈ కాండమున శ్రీరామదూత అయిన హనుమంతుడు రావణునికి శ్రీరామ సందేశంతోపాటు రాముని గుణగణాలను, బలాన్ని, ఆపద్ధర్మ పరాయణాన్ని, శరణాగతులను సంరక్షించే విధానాన్ని, సత్యపరాక్రమతత్వాన్ని సర్వలోకేశ్వరతత్వాన్ని స్పష్టంగా వివరించాడు.

కార్యాన్ని జయించడం, సాధించడం హనుమంతుని లక్షణం. భక్తి, వినమ్రతలకు మూల పురుషుడు. రామతారక మంత్రవ్యాఖ్యానరూపం- ఈ సుందరకాండ పారాయణం. సుందరకాండలో కథానాయకుడు హనుమంతుడే. ‘సుతరామాద్రియతే ఇతి సుందరః’- ఈ వాక్యాన్ని బట్టి ద్వైతాద్వైత విశిష్టాద్వైతులందరికినీ మారుతి ఆదరణీయుడు. శివుడంతటివాడు హనుమంతుని గురించి పార్వతికి తెలుపుతూ- ‘మహాభోగో, మహాబలపరాక్రమో, స్సుభగస్సుందర శ్రీమాన్‌’’ అని చెప్పాడు. సంజీవినితో లక్షణుని, రామదూతగా సీతను, సీతావార్తను రామునికి తెల్పి ప్రాణరక్షకుడైనాడు. ఒక్క సుందరకాండ పారాయణం రామయణాన్నంతటినీ చదివిన ఫలితాన్నిస్తుంది. అందరూ సుందరకాండ పారాయణ చేసి సకలారిష్ట నివారణను, కార్యసిద్ధినిపొందగలరు. -పరాంకుశం శ్రీనివాసమూర్తి,