Description
వసిష్ఠ రామ సంవాదము – యోగవాసిష్టం
Author : Swami Nirvikalpananda,
Swami Vidyaprakashananda Giri
Pages : 3024
శ్రీవాల్మీకి మహర్షి ప్రణీత యోగవాసిష్ఠము
‘గురువుగారూ! జాగ్రత్తల సంగతి ఎలా ఉన్నా, కరోనా వచ్చిపడ్డాక జనాల్లో చాదస్తాలు మాత్రం బాగా పెరిగిపోయాయనిపిస్తోంది. ప్రపంచ మానవాళిని కరోనా బారి నుంచి రక్షించాలని శాస్త్రజ్ఞులు ఒకవైపు పరిశోధనల్లో తలమునకలు అవుతున్నారు… త్వరితంగా ఈ రోగానికి మందు కనిపెట్టాలని నిపుణులు నిద్రాహారాలు మానేసి శ్రమిస్తున్నారు. మన పండితుల వైఖరి చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. వారు ఏవేవో మంత్ర పారాయణలతో కాలక్షేపం చేస్తున్నారు. మన టీటీడీనే తీసుకోండి… యోగవాసిష్ఠం లోనిదట- రెండు నెలల పాటు కర్కటి ఉపాఖ్యానంలోని మంత్ర పారాయణ చేపట్టింది. దరిమిలా సుందరకాండ, విరాటపర్వం… అంటూ ఏవో ఆధ్యాత్మిక పరిష్కారాలు అన్వేషిస్తోంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? చెప్పండి!’
‘నాయనా! చింతకాయలు రాల్చడానికి మంత్రాల దాకా ఎందుకు? పొడవాటి కర్రొకటి ఉంటే చాలు. ఏ విషయంలోనైనా సత్యాన్వేషణకు సహనం ఎంతో అవసరం. ఒక పనిని విమర్శించే ముందు దాని గురించి పూర్తిగా అవగాహన ఏర్పడాలి. ప్రస్తుతం యోగవాసిష్ఠంతోపాటు ధన్వంతరి, వైద్యనాథాది మంత్ర పారాయణలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. పాతదనే కారణంగా ప్రతిదాన్నీ తిరస్కరించే బుద్ధి సైతం చాదస్తంలోకే వస్తుంది సుమా!
యోగ వాసిష్ఠంలో ‘ఉత్పత్తి ప్రకరణం’ అనే అద్భుతమైన ఒక అధ్యాయం ఉంది. దానిలో ‘కర్కటి’ అనే అంటువ్యాధి రాక్షసి ప్రస్తావన 68వ సర్గ నుంచి ఆరంభం అయింది. ఆ కర్కటికే- విషూచిక, అన్యాయ బాధిక అనే మరో రెండు పేర్లున్నాయి. అది హిమాలయాలకు ఉత్తరంగా నివసిస్తుందని యోగవాసిష్ఠం స్పష్టంగా చెప్పింది. ఆ రాక్షసి తీవ్రమైన ఆకలిని తాళలేక మానవ జాతిని ఉన్నపళంగా కబళించాలని భావించింది. వారు, వీరు అనే తేడా లేకుండా అందర్నీ ఒకే తడవ భక్షించగల శక్తి కోరి, బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేసింది. జనాన్ని అమాంతం కబళించగల శక్తిని ఇమ్మని కోరింది.
బ్రహ్మదేవుడు అంగీకరించాడు. ‘సూక్ష్మ శరీరంతో మాయారూపం ధరించి, ప్రజల నాసికా రంధ్రాల నుంచి ప్రవేశించి, ఊపిరితిత్తులను ఆక్రమించి, శరీర అవయవాలను పీడించి క్రమంగా వారిని కబళించు’ అని అనుమతిని ప్రసాదించాడు. ఈ వివరాలన్నీ యోగవాసిష్ఠం విపులంగా చర్చించింది. కర్కటి పేరే కాదు… హిమాలయాలకు ఉత్తర దిశ, అపరిశుభ్రమైన జీవన విధానం, ముక్కు రంధ్రం ద్వారా ప్రవేశం, ఊపిరితిత్తుల్లో స్థిరనివాసం, క్రమంగా దేహంలోని అవయవాలను కబళించడం… వంటి ఎన్నో సామ్యాల దృష్ట్యా- నేటి వైరస్‌ను మన పండితులు విషూచికగా భావిస్తున్నారు.
బ్రహ్మదేవుడు కర్కటికి వరమిస్తూనే- అపక్వ, అకాల, నిషిద్ధ పదార్థాలను అతిగా భక్షించేవారి జోలికి మాత్రమే వెళ్ళాలని స్పష్టం చేశాడు. దరిమిలా గాలిలో వ్యాప్తి చెంది విఘాచికా వ్యాధివై అందరినీ ఆవరించు అనీ చెప్పాడట. ఇప్పుడు జరుగుతున్నదదే! అదే సందర్భంలో గుణవంతులకు రోగం సోకకుండా ఉండేందుకై అవసరమైన రహస్య మంత్రోపదేశం కూడా చేశాడని వసిష్ఠ మహర్షి రాముడికి బోధించాడు. యోగ వాసిష్ఠంలోని ఆ విరుగుడు మంత్రాలనే పండితులు ప్రస్తుతం విస్తృతంగా పారాయణ చేస్తున్నారు.
విషూచిక ధూళిలో, గాలిలో వ్యాపించి, మనిషి చేతి వేళ్లలో దాగి…. వింటున్నావా! మనిషి చేతి వేళ్ల ద్వారా నాడుల్లోకి ప్రవేశిస్తుందని, అదే అధ్యాయంలో 38వ శ్లోకం విస్పష్టంగా ప్రకటించింది. అంతే కాదు, జనం ఎక్కువగా గుమిగూడే చోట రోగ వ్యాప్తికి అవకాశం బాగా దొరుకుతుందని చెప్పింది. నీలాంటి బుద్ధిమంతులకు ఇంతకన్నా వివరాలు కావాలా? ఎలుకలను, గబ్బిలాలను, పందికొక్కులను భక్షించడమంటే- ముట్టరానివాటిని ఎగబడి తినడమేనని వేరే చెప్పాలా? దుర్భోజనం అంటే అదే కదా!
మరో ముఖ్యమైన విషయం. లోహసూచిక, జీవ సూచిక అనే రెండు రూపాల్లో విషూచిక, అప్పటికే అస్వస్థత ఉన్నవారి దేహాల్లోను, వారి ద్వారా ఆరోగ్యవంతుల శరీరాల్లోనూ తిష్ఠ వేస్తుందని యోగవాసిష్ఠం చెప్పింది.
సుందరకాండ పారాయణ దేనికంటే, మనిషి మనసును కల్లోలపరచే ఏ భయానికైనా విరుగుడు హనుమ జపమే. రాక్షస సంహారం అంటే గుర్తొచ్చే మొదటి పేరు ఆయనదే. కర్కటి బ్రహ్మరాక్షసి. అది గాలి ద్వారా వ్యాపిస్తోంది. ఊపిరితిత్తుల్లో స్థిరపడుతోంది. హనుమ చూస్తే వాయునందనుడు. వాయు రూప రోగ నివారణకు వాయునందనుణ్ని ప్రార్థించడంలో ఆశ్చర్యం ఏముంది? నమ్మేవారికి విశ్వాసమే బలం! ఇక విరాటపర్వమంటావా… కరవు కాటకాలు ఏర్పడినప్పుడు వర్షాలు పడాలంటే విరాటపర్వం చెప్పించుకునే ఆనవాయితీ నీకు తెలిసిందేగా! అలాగే ఎక్కడ విరాటపర్వం పఠిస్తారో అక్కడ పంటలు బాగా పండుతాయి. ఆ సంగతి అలా ఉంచు- ఎంతటి వీరులు పాండవులు? కాలం కలిసి రానప్పుడు ఎంత తగ్గిపోయారు! ఎంతటి వినయ విధేయతలు, ఓపిక, ఒద్దిక చూపించారు. కర్కటి కరాళ నృత్యం చేస్తున్న రోజులివి. ఒక్కరోజు సైంధవుడిది అన్నట్లు కాలం దాని చేతిలో అస్త్రం అయినప్పుడు, నారాయణాస్త్రానికి తలవంచిన పాండవుల్లా… ఈ విశ్వంలోని మానవులంతా కొన్నాళ్లపాటు తగ్గి తల వంచవలసిందే. ఈ పాఠం గుర్తు చేయడానికే విరాటపర్వాన్ని పారాయణ చేస్తున్నారు పండితులు. కరోనా విషయంలో దారులు వేరైనా అందరి లక్ష్యం ఒకటే. మన పండితులు తమకు తెలిసిన మార్గంలో ప్రయాణిస్తున్నారంతే. రుషులు మనకు అందించినదాన్ని వివేకంతో గ్రహించాలి… సరేనా!’
‘అర్థమైంది గురువుగారూ! ఈసారి విమర్శించే ముందు యోచిస్తాను. ఖండించే ముందు అధ్యయనం చేస్తాను!’
‘మంచిది!’
Source: ఈనాడు దినపత్రిక ఈరోజు సంపాదకీయం నుండి!
#Sri Ramakrishna Math, YOGAVASISHTAM