Description
వివేకచూడామణి
Author : Swami Madhavananda
Pages : 288
శ్రీ శంకరాచార్యుల గ్రంథాలన్నింటిలోను వివేకచూడామణి ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది. ఆత్మజ్ఞాన విషయం సులభరీతిలో ప్రతిపాదించబడిన గ్రంథం ‘వివేక చూడామణ’ 550 శ్లోకాలలో ఒప్పారే ఈ గ్రంథం వేదాంత విజ్ఞాన వినీలాకాశంలో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న ధ్రువతార.
భక్తి ద్వారా జ్ఞానం.. మోక్షం
జ్ఞానవాదిగా అనిపించే భగవత్పాదులే భక్తి ప్రధానమైన స్తోత్ర గ్రంథాలు వ్రాసి ఉంటారా? అన్న ప్రశ్నకు వారే తమ ‘వివేక చూడామణి’లో ‘‘భక్తి ద్వారా జ్ఞానమును సంపాదించి మోక్షమును పొందవచ్చు’’ అని బోధించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యం ఈ మూడింటినీ ప్రస్థానత్రయం అంటాం. వీటిపై శంకరుల వ్యాఖ్యానం, సంపూర్ణం, సాధికారం, ప్రామాణికం, సనాతనం కానీ నిత్యనూతనం. అభిమానం, పక్షపాతం ఉన్నట్లయితే శ్రుతుల అర్థాన్ని ఒక జన్మ గడిచినా సాధకుడు గ్రహించలేడు. ఎవరి యందునూ నిరాదరణ కానీ, నిరాకరణ కానీ చూపక, శ్రుతులను అర్థం చేసుకోవాలంటారు శంకరులు. దీనికి సమత్వ, ఏకత్వ దృష్టి ఉండాలి.
శాస్త్రమంటే జ్ఞాపకమే. ఇంతకు ముందే వస్తువుండి, కాలగమనంలో రూపాంతరం చెందింది. ఈ విషయాన్ని పరిశోధన ద్వారా గుర్తించి, మళ్లీ మనకు తెలియజేస్తున్నాడు శాస్త్రవేత్త. ఇదే విజ్ఞాన పరిధి! అది పరిమిత పరిధి. ప్రశ్నిస్తూ, జిజ్ఞాసను రేకెత్తిస్తూ, శోధిస్తూ, సాధిస్తూ పదార్థాన్ని పరిచయం చేస్తున్నది విజ్ఞాన శాస్త్రం. ఇదే విషయాన్ని ప్రమాణం ద్వారా అనుభవ రససిద్ధం చేసి పదార్థమూ బ్రహ్మమేనంటున్నాడు, జ్ఞాని! ఇక విభేదానికి ఆస్కారం లేదు కదా! బొమ్మ-బొరుసుల వంటి స్థితే జ్ఞానిది, విజ్ఞానిది.
కర్మనిష్ఠ, జ్ఞాన నిష్ఠ రెండు ముఖాలు. హేతువును ప్రశ్నిస్తూ సమాధానపడిన హేతువాదికి, ప్రమాణాన్ని అనుసరించి అంగీకరించినవాడికీ భేదమెక్కడని ప్రశ్నిస్తారు శంకరులు. హేతువాదానికి నిరూపణే బలం. తర్కానికి బుద్ధే బలం. యదార్థమును అనుభవించడానికి హృదయం ప్రధానం. కనబడుతున్న దానిని లేదనుకోమనలేదు శంకరులు. ‘‘నిప్పు మంచువలె ఉన్నది, అగ్నికి ప్రకాశం లేదు’’ అని ఎవరన్నా అంటే ఖండించమన్నారు. వస్తు స్థితీ సత్యమే అయినా, దానికంటే వస్తుమూలమే నిత్యసత్యం అన్నారు. బ్రహ్మానుభవం కలిగే వరకూ ఈ ప్రపంచ భావన సత్యమే కదా!
రాగద్వేషాలను వదుల్చుకుని, నిశ్చల,
నిర్మల మనసుతో విషయాన్ని విశ్లేషించుకోవాలి.
‘నేను చేస్తున్నాను’ అంటే కర్తృత్వ భావం.
‘నేనే చేస్తున్నాను’ అంటే అహంభావం.
‘నేను మాత్రమే చేయగలను’ అంటే అహంకారం.
ఎవరో చేయిస్తున్నారు. నేను చూస్తున్నాను, ఆ చూస్తున్న నేను కంటే, చేయిస్తున్న నేనే అసలు నేను’ అనుకుంటే అది అహం స్ఫురణ. అధ్యాత్మ విద్య, యోగశాస్త్రం, విజ్ఞాన దృక్పథం ఉంటే ఈ ప్రపంచం ఆనందధామమౌతుంది. విజ్ఞానం ఒక క్రియాశక్తి. జ్ఞానం అనుభూతిమయం. ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించుకోవాలి. సంఘర్షణకు తావులేని విధంగా సాధన సాగాలి. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష వంటివన్నీ బ్రహ్మభావనలే. వీటిని జీవితంతో అనుసంధానం చేసి, అనుష్ఠానం చేయాలి. అనుభూతిని పొందాలి.
అందరం సమానం అనుకుంటూనే, ఆ భావాన్ని జీవితంలో ఆచరణపూర్వకంగా అనుభవించమంటుంది అద్వైతం. అద్వైతం స్థిరవాదం కాదు. స్థిమిత వాదం. సమతావాదం, నిత్య నవతా వాదం. నిజానికి, ఇదే శంకర హృదయం.
ఈ నేపథ్యంలో సౌందర్యలహరిని, శివానంద లహరిని అర్థం చేసుకోవాలి. భాష, భావం, శిల్పం, శైలి, అలంకారం, శాస్త్రం, మంత్రం, తంత్రం, యంత్రం, భక్తి, రక్తి, ముక్తి, వైరాగ్యం, సాధన, అన్వేషణ, సాఫల్యం అనే పదహారు కళల దివ్య ఆవిష్కరణే ఈ స్వాధ్యాయం.
అనితర సాధ్యమైన శంకర మేధను గౌరవిస్తూ, శంకర హృదయంతో మన హృదయాన్ని అనుసంధానం చేసి, లహరులపై మన ప్రస్థానం సాగాలి. సౌందర్య లహరిని స్పృశించవలెనంటే ఇంతటి నేపథ్యం కావాలి. శివానంద లహరిని అనుభవించాలంటే పూర్ణ హృదయం కావాలి.
-వీఎ్‌సఆర్ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
#Sri Ramakrishna Math