Description
బాలల మహాభారతం – 5 parts
బాలల మహాభారతం అయిదు సంపుటాలు కలిసిన ఈబుక్ ఇది. ఆంగ్లంలో స్వామి రాఘవేశానంద రచించగా, స్వామి జ్ఞానదానంద తెలుగులోకి అనువదించారు.
బాలల మహాభారతం మొదటి సంపుటంలో దాయాదులైన కౌరవ పాండవుల మధ్య వైరం ప్రారంభమైన కథనం చదువుతారు. రాజ్యం మీద విస్తృత విఘాతాలను తీసుకొచ్చిన కుటుంబ కలహం ఇది.
రెండవ సంపుటంలో ఈ మహా యుద్ధానికి నాంది పలికిన పూర్వాపరాలను తెలుసుకుంటాం. వీరులు, ఉత్తములు అయిన పాండవులు ఎలా దురాత్ములైన తమ కౌరవ దాయాదులచేత వంచించబడి పన్నెండేళ్ళు వనవాసానికి పంపబడడం చూస్తాం. వనవాసానంతరం వారు ఒక సంవత్సరంపాటు అజ్ఞాతవాసంలో ఉండాలి. మూడవ భాగంలో ఆ సంవత్సర కాలంలో జరిగిన అద్భుత సంఘటనలను మనం చూస్తాం. చిట్టచివరకు పాండవులు తమ అజ్ఞాతవాసం పూర్తిగావించి, తమ రాజ్యభాగాన్ని కోరగా, కౌరవులు ఒక్క అంగుళం నేలను కూడ ఇవ్వటానికి నిరాకరించారు. శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారిగా వెళ్లినా, ఫలితం శూన్యమే అయింది. కుంతి కూడా దుర్యోధనుడికి అండగావున్న తన ప్రథమ సంతానమైన కర్ణుణ్ణి తమ పక్షానికి త్రిప్పుకోవాలని ప్రయత్నించినా, ఫలించలేదు. ఒక ఘోరసంగ్రామం అనివార్యమైంది. మూడవ భాగం మనలను ఆ ఘోర విషాందాంతం చూపే అంచులకు తీసుకెళుతుంది.
పురాతనకాలంలో జరిగిన కుతూహలజనితమైన మహాయుద్ధ వృత్తాంతాన్ని నాలుగవ సంపుటం తెలుపుతోంది. ఈ సంపుటంలోని రెండు విభాగాలు, భీష్మపర్వం, ద్రోణపర్వంగా పేర్కొనబడ్డయి. యుద్ధారంభానికి కొద్దిసేపు ముందు, శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాత భగవద్గీతను అర్జునునికి బోధించటం జరిగింది. సనాతన ధర్మం, శాశ్వతసత్యాల మీది మహోన్నత వ్యాఖ్యాన వివరణే ఈ భగవద్గీత.
ఐదవ భాగంతో మహాభారత వీరగాథ సమాప్తమవుతుంది. అంపశయ్య మీద పరుండివున్న భీష్ముడు ధర్మసూక్ష్మాలను యుధిష్టరునికి ఉపదేశించడం ఈ భాగంలోనే చోటుచేసుకుంది. అయిష్టంగానే యుధిష్టరుడు పట్టాభిషిక్తువడం, కురుక్షేత్ర సంగ్రామ పరిహారార్థం అశ్వమేధయాగం నిర్వర్తించడం కూడా ఇందులోనే చోటుచేసుకొన్నాయి. చిత్ర విచిత్రంగా మలుపులతో, మెలికలతో సాగిన ఈ ఇతిహాసం చివరికి ధర్మమే జయిస్తుందని ఋజువు చేస్తుంది.