Description
Nadiche Devudu
ఈ పుస్తకం విశేష మేమిటి?
నడిచే దేవుడు
ఏ నా పురాకృత పుణ్యఫలమో, మూడు దశాబ్దాలకు పైగా పరతత్వ స్వరూపులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిశ్రీచరణుల సేవాభాగ్యం నాకు లభ్యమైంది. శ్రీ వారి చరణసన్నిధిలో సంప్రాప్తమైన నా అనుభవాలకూ, స్వామిని సందర్శించి, స్వామితో మాటలాడే అవకాశ మబ్బినప్పుడు నా హృదయంలో పదిలపరచుకున్న మధుర స్మృతులకు ఈ పుస్తకం ద్వారా అక్షరరూపం కల్పించడానికి యత్నించాను. ఆ విధంగా ఋషిరుణం తీర్చుకోగలనని భావిస్తున్నాను.
నావలెనే స్వామిభక్తులైన మరికొందరు పెద్దల, మిత్రుల అనుభూతులను కూడా సేకరించి, వాటిని ఈ పుస్తకంలో చేర్చాను.
ఇది గాక, స్వామి గురించి నాకు తెలిసినంతలో, తెలుగులో మరెక్కడా వెలుగు చూడని నూతనవిషయాలు కొన్ని ఈ పుస్తకంలో చోటుచేసుకున్నవి.
ఉదాహరణకు, 1947లో భారతరాజ్యాంగరచన జరిగిన సందర్భంలో, హిందూ మతానికి మన రాజ్యాంగంలో రక్షణ కల్పించే సంకల్పంతో శ్రీ చంద్రశేఖరేంద్ర సంయమీంద్రులు సల్పిన చరిత్రాత్మక కృషిని గురించి దేశంలో తెలిసిన వారెందరో లేరు. ఈ విషయమై ప్రఖ్యాతవేదపండితుడు శ్రీ అగ్నిహోత్రం రామానుజ తాతాచారిగారి లేఖని నుండి వెలువడిన ఇందలి వ్యాసం విజ్ఞప్రపంచానికి కనువిప్పు.
పూర్వం ఒకప్పుడు యావత్ప్రపంచంలో వేదమతమే వ్యాపించి ఉండేది అనడానికి అపూర్వమైన అనేక ఆధారాలు నెలకొల్పుతూ 1931లో స్వామి వారు చేసిన మహోపన్యాసం స్వామి పరిశోధనాపారీణతకు నిదర్శనం.
వీటన్నిటిని మించి, రమారమి 60 సంవత్సరాలకు పూర్వం 1927లో మహాత్మగాంధి, కామకోటిశంకరాచార్యుల మధ్య జరిగిన రహస్య సంభాషణ వివరాలూ, స్వామిని గురించి గాంధిజీ తన ఆశ్రమవాసులకు తెలియజేసిన అభిప్రాయాలూ, ప్రప్రధమంగా ఈ పుస్తకంద్వారానే లోకానికి వెల్లడి కావడం ఒక విశేషం.
స్వామిని గురించి :
ఇక, ఇంచుమించు ఈ పుస్తకం పుట లన్నిటిలో సర్వధర్మస్వరూపులుగా, ఆర్తరక్షకులుగా, విజ్ఞానభాస్కరులుగా మనకు సాక్షాత్కరించే స్వామిని గురించి, వారి లోక సంగ్రహచర్యలను గురించి నాలుగు మాటలు.
ఆదిశంకరభగవత్పాదులు నెలకొల్పిన కామకోటిపీఠపరంపరలో 68వ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధి గాంచిన శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి శ్రీచరణులు విద్యార్ధి దశలోనే సన్యసించి, అచిరకాలంలో వేద శాస్త్ర పురాణాదులను పుక్కిటబట్టారు. దేశ విదేశాలకు చెందిన పదిహేడు భాషలనభ్యసించారు. ప్రాచీన విద్యలు, నవీన కళలు పెక్కింటిలో సర్వంకష ప్రతిభను సాధించారు.
దేశ మంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఆలయ మంటపాల నెన్నిటినో నిర్మించారు. ధర్మ సంవర్థనమే లక్ష్యంగా, ఇరవై సంవత్సరాలు పాదచారం చేస్తూ యావద్భారతం పర్యటించారు. హిందూమతసంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషి చేశారు. ఎల్లెడల ధర్మ సంస్థలనూ, సేవాసంఘాలను వెలయింపజేశారు.
వీటన్నిటితో పాటు, మఠం పరిపాలన చేపట్టింది మొదలు నేటివరకు జాతి, కుల, మత వివక్షత లేకుండా అనవరతం ఎందరి కష్టసుఖాలను విచారిస్తున్నారో, ఎందరు భక్తులను అనుగ్రహిస్తున్నారో, ఉపదేశాలు ఎందరికి చేస్తున్నారో, ఎందరికి జ్ఞానభిక్ష పెడుతున్నారో వారి సంఖ్య అంచనా కట్టలేము.
స్వామి జీవిత చరిత్ర తెలిసిన వారికి, రెండువేల సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో జన్మించి, అవైదిక మతాలను ఖండించి, అనేక దివ్యశక్తులను ప్రదర్శించిన ఆదిశంకరులే తిరిగి నేడు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతులుగా అవతరించారని పండిట్ మదనమోహనమాలవ్యా వంటి ప్రముఖు లనేకులు చేసిన ప్రశంసలు అతిశయోక్తులు కావని రూఢికాగలదు.
ఒక విమర్శ:
పోతే, స్వామిని సందర్శించే భక్తుల విషయమై విద్యాధికులనబడు వారిలో కొందరు చేసే విమర్శ ఒక టున్నది. ”నిత్యం స్వామిని సందర్శించే ప్రజలు ఇహసంబంధమైన కోరికలతో, సంసారబాధలతో స్వామిని ఆశ్రయిస్తారేగాని, పారమార్థిక చింతతో ఆయనను సందర్శించే వా రెందరని” వారి శంక.
నిర్థాక్షిణ్యమైన ఈ విమర్శ వెలిబుచ్చే బుద్ధిమంతులు భగవద్గీతలో కృష్ణభగవానుడు ”ఆర్తో, జిజ్ఞాసు, రర్థార్థీ జ్ఞానీచ” అంటూ, ఆర్తులూ జిజ్ఞాసువులూ, అర్థార్థులూ, జ్ఞానులూ, ఈ నాలుగు తరగతులకు చెందిన వారంతా నా భక్తులేనని చెప్పిన మాటలు విస్మరిస్తున్నారు.
ఇహజీవితంలో వాటిల్లేకష్టాలను ఎదుర్కొన లేక, ఈశ్వర విభూతి స్వామిలో సంపన్నమై ఉన్నదనీ, స్వామికి నివేదించుకుంటే తమ కష్టాలు గట్టెక్కుతాయనే విశ్వాసంతో, ఆయనను దర్శించడం దోషమా?. స్వామిని ఆశ్రయించడం వల్ల వారి బాధలు నివారణ అయితే, అంత కంటె కోరదగిన దేమున్నది?
ఇంకో విశేషం. ఐహికవాంఛలతో స్వామిని ఆశ్రయించి, స్వామి అనుగ్రహ మనే ఆధ్యాత్మికవ్యూహంలో ఒక్కసారి చిక్కుకున్న వ్యక్తి, పవిత్రతానిదానమైన స్వామి తపః ప్రభావం నుంచి సులభంగా తప్పంచుకోలేడు. ఆతని గురుభక్తి దైవభక్తిగా పరిణమిస్తుంది. ఆతని హృదయం భగవద్వాసనా వాసిత మవుతుంది. అటుపిమ్మట భక్తుడు వదలినా, భగవంతుడు అతనిని వదలడు – ”భక్తు డెందుజనిన బరతెంతు వెనువెంట…”
స్వామిచే ప్రభావితులైన ఎందరో నాస్తికులు ఆస్తికులైనారు. భ్రష్టాచారులు శిష్టాచారులుగా, ధనికులు దానశీలురుగా, విద్యావంతులు వినయసం
పన్నులుగా లుబ్ధులు గుణలుబ్ధులుగా, భక్తులు పరమభక్తులుగా మారిన వా రున్నారు. అట్టి భక్తుల చరిత్రలను దిజ్మాత్రంగా ఈ పుస్తకంలో చూడవచ్చు. స్వామి ఆర్తత్రాణపరాయణమూ, అకారణ కారుణికత్వమూ ప్రసాదించే మహత్తర ఫలితమిది.
భక్తుల ననుగ్రహించడంలో స్వామి అవలంబించే మార్గాలు పలు విధాలు. అవి ఆయా వ్యక్తుల తరతమ భేదం పైనా, వారి సంస్కారబలంపైనా ఆధారపడి ఉంటాయి. కొందరికి అనుష్ఠానం, కొందరికి మంత్రోపదేశం, కొందరికి సాక్షాద్దర్శనం, మరికొందరికి దర్శనంతో సైతం పని లేకుండా స్వప్నంలోనే అనుగ్రహం.
విభూతులు, సిద్ధులు:
తనదివ్యవిభూతుల ద్వారా స్వామి ఆశ్రితుల భక్తినీ, విశ్వాసాన్ని బలపరుస్తారు. వారు మరింత భగవదున్ముఖులౌతారు. ఈ మహిమలూ, ఈ విభూతులూ స్వార్థానికి కావు, స్వాతిశయ ప్రకటనకు కావు. లోకసంగ్రహమే వాటి ముఖ్యోద్దేశం.
ఈ అతీంద్రియ, అప్రాకృతిక శక్తులను గురించి ప్రజలలో కొన్ని అపోహలున్నవి. మతం పేరుతో ప్రజలను మోసగించి, క్షుద్రశక్తులను కొన్నిటిని ప్రదర్శించి అమాయక ప్రజను మభ్యపెట్టే వేషధారులు సంఘంలో కొందరుండడమే అందుకు ముఖ్యహేతువు. అయితే, అట్టి వంచకులూ, వేషధారులూ ఏరంగంలో లేరు? వైద్యమా, వాణిజ్యమా, రాజకీయమా, ప్రభుత్వ రంగమా? కలుషితం కానిదేది?
దురదృష్టవశాత్తు, ఆధ్యాత్మికరంగంలో కూడా నేడు సద్వర్తనమూ, అసద్వర్తనమూ రెంటికీ తా వున్నది. విభూతి పెట్టుకున్న వారంతా వేదవిదులు కానట్టే, గురువు లందరూ గుణవంతులు కారు. గురువు లనబడే వారిలో ‘శిష్య చిత్తాపహారులు’ కొందరైతే ‘శిష్య విత్తాపహారులు’ మరి కొంద రుండవచ్చు. అంతమాత్రాన మతాన్ని వెలివెయ్యగలమా? ఆధ్యాత్మిక విద్యలనూ, అణిమాది సిద్ధులనూ గర్హించ దగునా?
ఆధునిక నాగరకతా, పాశ్చత్యవిద్యా ప్రభావంచేత నేటి యువతరం హృదయంలో అవిశ్వాస మొక్కటే రాజ్య మేలుతున్నది. ప్రాచీనమూ, భారతీయమూ వారికి పరిత్యాజ్యం. విజాతీయమూ, వైజ్ఞానికమూ పరమప్రమాణం. విజ్ఞానశాస్త్ర పరిశోధనలు ఆధునికమానవసుఖజీవనానికి తోడ్పడిన మాట కాదనలేము. అయినా, అదే జీవిత పరమావధి కాదుకదా?
విజ్ఞాన శాస్త్రం:
విజ్ఞాన శాస్త్రమే జీవితసర్వస్వమనుకునే యువజనుల పంచేంద్రియాల పరిమిత శక్తిని గుర్తించరు. విజ్ఞానశాస్త్రంలో విప్లవకరమైన మార్పు లనేకం వచ్చాయనీ, విజ్ఞానశాస్త్రానికి అందని, అంతుబట్టని క్షేత్రాలు ఎన్నో వున్నాయనీ, న్యూటన్ నుంచి నేటి వరకూ ఎన్నో వైజ్ఞానికసిద్ధాంతాలు తలకిందులైనాయనీ వీరు గమనించలేరు.
”భారతదేశపు అమూల్య వారసత్వం” (India’s priceless heritage) అనే ఆంగ్ల వ్యాసమాలలో సుప్రసిద్ధ న్యాయశాస్త్రపారంగతుడు శ్రీ యన్.ఏ. ఫాల్కివాలా వ్రాసిన మాటలు చూడండి. ” జీవిత మంతా ఒక పరిశోధనా లయంలో చేసిన కృషికంటే, యావజ్జీవితం ఒక గ్రంథాలయంలో చేసిన పఠనంకంటే, ఒక్క యోగివర్యుని అనుభవం ఎక్కువ ఫలితం ఇస్తుంది.”
”ఈ విశ్వరహస్యాన్ని ఇంతవరకు వైజ్ఞానికు లెవ్వరూ కనిపెట్టలేదు. బహుశా ఇకముందు కూడా కనుగొనబోరు” అన్నది, వైజ్ఞానిక ప్రపంచం ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యం.
ప్రగతిపూర్వకంగా ఇంతవరకు సాధించిన విజ్ఞానం యావత్తూ ఐన్‌స్టిన్ మాటలలో ”ఒక దుర్గ్రాహ్యపరిస్థితి నుంచి వేరొక దుర్గ్రాహ్యపరిస్థితికి పయనించడమే”. ఇందుకు విజ్ఞాన లోకం దిగ్భ్రమ చెందింది. హతాశుడైన ఎడిసన్ మహాశయుడు ”దేనిని గురించి గానీ, నూటికి ఒక్కవంతు కాదు, కోటికి ఒక్క వంతుకూడా మనకు తెలియదు బాబో” అని ఆక్రోశించాడు.
క్వాంటం ఫిజిక్సులో మహావిజ్ఞాని వెర్నర్ హీసన్‌బర్గ్ తన స్వీయచరిత్రలో ఇలా అంటాడు. ”అణుక్షేత్రంలో మనం అడుగు పెట్టినప్పుడు దేశకాలావధులకు లోనైన ప్రపంచం అక్కడ శూన్యం”
”చూడగా, చూడగా, ఈ విశ్వమంతా ఒక మహోన్నత ‘భావన’గా తోస్తుందే గాని, బ్రహ్మాండ మైన ‘యంత్రం’గా గోచరించదు.” అని విస్తుపోతాడు సర్ జేమ్స్ జీన్సు.
”బ్రహ్మ సత్యం, జగన్మిథ్య” అనే సూత్రానికి దగ్గరగా వస్తున్నారా వైజ్ఞానికులు!
”వైజ్ఞానిక విద్యల నభ్యసించి, తమకు మతంతో పని లేదని మతాన్ని తృణప్రాయంగా పరిగణించే భారతయువకులు పాశ్చాత్యదేశాలనుంచి గుణపాఠం నేర్చుకోవాలి. పాశ్చాత్యులు ఇది వరకే ఇట్టి అనుభవాలకు లోనై, ఇప్పుడు వాటి నుంచి తిరోగమిస్తున్నారు.”
పై వాక్యాలు వ్రాసింది ఏ భారతీయుడో కాదు. పాల్ బ్రంటన్ అనే ప్రసిద్ధ ఆంగ్ల పత్రికా రచయిత. తత్వాన్వేషి. ‘శంఖున పోసిననేగాని తీర్థం కాదన్న’ట్టు పాశ్చత్యు లెవరైనా చెప్పిన గాని మన వారి దృష్టి నాకర్షించదు!
ఆధ్యాత్మిక శక్తులపైనా, అణిమాది సిద్ధులపైనా విశ్వాసంలేని భౌతిక వాదులకు కనువిప్పు కావచ్చుననే నమ్మకంతో అతీంద్రియశక్తులకు సంబంధించిన కొన్ని సంఘటనలను ఈ పుస్తకంలో ఉదహరించాను. ఇవి ప్రాజ్ఞులైన వారు ప్రత్యక్షంగా కళ్లతో చూచినవిగాని, కట్టుకథలు కావు.