Description
Megha sandesam
మేఘ సందేశం లేదా మేఘదూతం (Meghasandesam or Meghadiootam) సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన ఒక కావ్యము. కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి. (మిగిలిన రెండు రఘు వంశము, కుమార సంభవము)
కావ్య ప్రశస్తి
కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.
1813లో ఈ కావ్యం ‘హోరేస్ హేమాన్ విల్సన్’ (Horace Hayman Wilson) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది.
మేఘ సందేశంలో శ్లోకాల సంఖ్యపై కొంత అనిశ్చితి ఉంది. మూల కావ్యంలో 110 లేదా 111 శ్లోకములని అంటారు. పూర్వ మేఘంలో 63, ఉత్తర మేఘంలో 48 శ్లోకాలున్నాయని సుశీలకుమార దేవుడు చెప్పాడు. వావిళ్ళవారి ప్రతిలో 124 శ్లోకాలు, మరి కొన్ని ప్రతులలో 129 శ్లోకాలు చెప్పబడ్డాయి.
మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి. సంక్షిప్తంగా కావ్యంలో ఉన్న విషయం ఇది.