Description
ఈనెల 14 శ్రీరామనవమి
బంధం కలిస్తే బంధుత్వం…పెనవేసుకున్న అనుబంధం అంతులేని సంతోషానికి కారణమవుతుంది.మనుషుల మధ్య ఈ అనురాగ ముడులను వేసే ఓ ప్రక్రియ పెళ్లి…వివాహం ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. అంతుకుమునుపు పరిచయం లేని మనుషుల మధ్య ఆత్మీయతకు కారణమవుతుంది. ఎప్పుడో త్రేతా యుగంలో జరిగినట్లు భావించే సీతారామకల్యాణమూ అంతే… భార్యభర్తల బాధ్యతలు, అత్తమామల దీవెనలు,
వియ్యంకుల మర్యాదలు..అప్పగింతలు, పలకరింపులు…ఇలా ఎన్నో ఆత్మీయానురాగాలు అందులో అందంగా ప్రతిబింబిస్తాయి…అందుకే ఆ కల్యాణం లోకానికి ఓ సంప్రదాయమైంది…మార్గదర్శనమైంది..వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టాలు ఎప్పటికీ అపురూపాలే…
ఆ శుభ తరుణంలో…
పెళ్లి తర్వాత ప్రేమ…
నిజానికి శివధనుస్సును రామయ్య కావాలనో, సీతమ్మను వివాహం చేసుకోవాలనో ఎక్కుపెట్టలేదు. తన గురువైన విశ్వామిత్రుని ఆదేశం మేరకే శివధనుస్సుని ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత కూడా నేరుగా సీతమ్మను స్వీకరించలేదు. తన తండ్రి దశరథుడు వచ్చి, జనకమహారాజుతో మాట్లాడి, ఇద్దరూ అంగీకరించిన తర్వాతనే సీతమ్మను వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాగని, బలవంతపు వివాహం కూడా కాదు. సీతారాములిద్దరికీ ఒకరంటే ఒకరికి వర్ణించలేనంత ప్రేమ.
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభివర్థత ।। (వాల్మీకి రామాయణం)
మరి కల్యాణం ఆ రోజెందుకు?
నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమ శాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో భక్తులు కల్యాణం చేయాలని శాస్త్ర నియమం. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరాముడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా ఘనంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు. ఇలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా శివపార్వతులకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు.
మిథిలా నగరం…
ఎప్పుడూ ధీరగంభీరంగా ఉండే జనకమహారాజు భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది…
శివధనుస్సును శ్రీరాముడు విరిచేశాడంట.
మన జనక మహారాజు గారాల పట్టి సీతను ఆయనే చేపట్టబోతున్నాడు…
మా జానకేమో చందనపు తునక… మరి రాముడో…
ఆయనేమీ తక్కువ కాదు… నీలమేఘశ్యాముడంట, దశరథ మహారాజు చాలా గారాబంగా పెంచాడంట… అందంలో చంద్రుడితో పోటీ అంట…
అంతఃపురమంతా ఇదే ముచ్చట… ఎప్పుడెప్పుడు కన్నులకు పండువ అవుతుందా అని ఎదురుచూపులు…
మహాత్మా! నేను దశరథనందనుడి యశస్సు, వీరత్వాన్ని కళ్లారా తిలకించాను. నాకుమార్తె సీత, దశరథా¯త్మజుడైన శ్రీరాముణ్ణి వివాహమాడి మా జనక వంశానికి కీర్తి తెస్తుంది. మీరు అనుమతిస్తే నా మంత్రులు రథాలపై వాయువేగంతో అయోధ్యానగరానికి వెళతారు. ఇక్కడ జరిగింది దశరథ మహారాజుకు వివరించి, వారిని సకుటుంబ సపరివార సమేతంగా మిథిలకు తీసుకొస్తారు. అని విశ్వామిత్రుడికి విన్నవించాడు జనకుడు. విశ్వామిత్రుడు అనుమతించాడు.
నిన్నటి దాకా మన చేతుల్లో ఆడుతున్నట్లే ఉన్నాడు ముద్దుల రాముడు… మన మురిపాల కొండ…
అప్పుడే పెళ్లికొడుకవుతున్నాడు. దశరథుడు తన పరివారంతో పాటు వశిస్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు వంటి మహనీయులతో, చతురంగ బలాలలో విదేహ దేశం చేరుకున్నాడు.
జరిగిన విషయమంతా చెప్పి, తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని దశరథుడిని కోరతాడు.
యథా వక్ష్యసి ధర్మజఞ తత్ కరిష్యామహే వయం ।।
కల్యాణవేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో కల్యాణమంటపం ముస్తాబైంది. మిథిలా నగరమంతా మహా సందడిగా మారింది. శ్రీరాముడికి సీతతో పాటు లక్ష్మణుడికి సీత సోదరి ఊర్మిళను, భరతుడికి జనకుడి సోదరుడైన కుశధ్వజుని పెద్దకూతురు మాండవి, శతృఘ్నుడికి కుశధ్వజుని మరోకుమార్తె శ్రుతికీర్తిని ఇచ్చి వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నలుగురు పెళ్లికుమారులు, నలుగురు పెళ్లికుమార్తెలు సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో, సీతారాములు శోభిల్లుతున్నారు.
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణి గృహ్ణీష్వ పాణినా ।
పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా ।।
పుట్టింటి నుంచి ఓ తండ్రి కుమార్తెగా అత్తింట అడుగుపెట్టే స్త్రీ, తన భర్తకు సహధర్మచారిణిగా ఉండాలి. అత్తింటివారికి అన్ని శుభాలు కలిగేలా ప్రవర్తించాలి. పతివ్రతగా ఉండాలి. భర్తను నీడలా అనుసరించాలి. ఇలాంటి మహోన్నతమైన జాగ్రత్తలు, సూచనలు చెబుతూ బిడ్డను అత్తవారింటికి సాగనంపాడు.
– కావూరి రాజేశ్ పటేల్, కె.రామకృష్ణ
ఆయన ఆకాశం… ఆమె పుడమి!
రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా భూమి నుంచి జన్మించింది. భూమి పంచభూతాల్లో ఒకటి. ఇలా, పంచభూతాల్లో మొదటిదైన భూమికి సీతమ్మ, చివరిదైన ఆకాశానికి రామయ్య సంకేతాలుగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని (పంటను) అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, వారికి శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడైతే రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో అప్పుడు లోకానికి శక్తి వస్తుంది. ఈవిధంగా సీతారామకల్యాణం లోకకల్యాణానికి కారకంగా, ప్రకృతి పులకరింతకు ప్రతీకగా నిలుస్తుంది.
ఇద్దరి పుట్టుక ఒకేలా…
సీతారాములిద్దరి జన్మవృత్తాంతం విచిత్రమైందే. వీరిలో ఏ ఒక్కరూ నేరుగా తల్లి కడుపునుంచి జన్మించలేదు. సంతానం కోసం దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్ఠి ఫలితంగా లభించిన యజ్ఞపాయస ప్రసాద ఫలితంగా రాముడు కౌసల్య గర్భాన జన్మించాడు. యజ్ఞం చెయ్యటం కోసం భూమిని దున్నే ప్రయత్నంలో నాగలి చాలుకు తగిలి, భూమిని నుంచి తనకు తానుగా అయోనిజగా ఆవిర్భవించింది సీతమ్మ. ఇద్దరూ యజ్ఞప్రసాదాలే. అందుకే వారిద్దరి కల్యాణం కూడా లోక కల్యాణయజ్ఞానికి పునాదిగా నిలిచింది.
పెళ్లి బాజాలు అలా మోగాయి…
సీతారామకల్యాణ ఘట్టాన్ని జానపదులు రాములోరి పెళ్లిగా పిలుచుకుంటారు. కేవలం పిలుపే కాదు… వారితో చుట్టరికం కలుపుకుంటారు. ‘సీతమ్మ మాయమ్మ.. .శ్రీరాముడు మా తండ్రి’ వంటి గీతాలు ఇందుకు ఉదాహరణ. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనల్లో అనేకసార్లు సీతారామ కల్యాణఘట్టాన్ని మనసారా కీర్తించారు. ‘రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం… సుర సార్వభౌమం భజే’; ‘అట్టె హరువిల్లు విరిచిన రాఘవా.. సిరులతో జనకుని ఇంటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా’; ‘రాముడు రాఘవుడు రవికులుడితడు… భూమిజకు పతియైన పురుష నిధానము’ వంటి కీర్తనలెన్నో అన్నమయ్య కలం నుంచి జాలువారి సీతారామకల్యాణ వైభోగాన్ని నేటికీ మనకు వీనులవిందుగా అందిస్తున్నాయి.
రాముణ్ణి ఎలా పూజించాలి?
శ్రీరామచంద్రుణ్ణి అనేక రకాలుగా పూజించవచ్చు.
* శ్రీరాముడు విష్ణుస్వరూపుడని భావించి విష్ణుసహస్రనామం, శ్రీరామ అష్టోత్తరశతనామాలతో పారాయణం, పూజ చేయొచ్చు.
* ‘శ్రీరామాయ నమః’ అనే మంత్ర జపం చేయడం. అయితే ఈ మంత్రం జపించాలంటే ఉపదేశం
* శ్రీరామరామరామ అనే నామాన్ని సాధ్యమైనన్ని పర్యాయాలు ఉదయం, సాయంత్రం సంకీర్తన చేయటం ఒక విధానం.
* సుందరకాండ పారాయణం చేయడం కూడా ఆరాధనే. రోజూ కొంతభాగం చొప్పున పారాయణం చేసి భగవంతుడికి అర్చన నిర్వహించొచ్చు.
* నిత్యదేవతార్చనలో భాగంగా షోడశోపచార పూజ కూడా చేయవచ్చు.
* రామకోటి రాయడం, రామనామం భజన చేయడం కూడా అర్చనలో భాగంగానే భావించవచ్చు.
– మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
#Rama Navami, #Bhadradri, #Festival, #Devotional, #Seetharama Kalyanam, #Makarandham Special page