Description
Abhijnana Shakuntalam
Mahakavi Kalidas
కథా సంగ్రహం
ఒక రోజు హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు వేటకు వెళతాడు. ఒక జింకను అనుసరిస్తూ కణ్వ మహర్షి ఆశ్రమం సమీపానికి వస్తాడు. కణ్వ మహర్షి దత్తత తీసుకుని పెంచుతున్న మేనకా, విశ్వామిర్తుల పుత్రికయైన, అత్యంత సౌందర్యరాశి యైన శకుంతల అతని కంటపడటం జరుగుతుంది. ఆమె ఆ సమయంలో కొన్ని తుమ్మెదల బారిన పడి ఉంటుంది. రాజు అక్కడికి వచ్చిన సంగతి గమనించని ఆమె పరిచారిక ఒకరు పరిహాసంగా దుష్యంతుడు ఈ భూభాగాన్ని పరిపాలిస్తుండగా నీలాంటి అందకత్తెను తేనెటీగలు భాధించడమేమిటి? అని అంటుంది.
దాన్ని విన్న దుష్యంతుడు ఆమెను తానే స్వయంగా రక్షించడానికి పూనుకుంటాడు. కణ్వుడు ఆ సమయానికి ఆశ్రమంలో లేనందున శకుంతల రాజును ఆదరిస్తుంది. అలసట తీరేంతవరకూ రాజు అక్కడే బస బస చేస్తూ, తుమ్మెదలను అటువైపు రానీయకుండా, రాక్షస మూకలు అల్లరి చేయకుండా సంరక్షిస్తుంటాడు. ఆ పరిణామంలో శకుంతలా దుష్యంతులిరువురూ ప్రేమలో పడి, ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్ళి చేసుకుంటారు.
కొద్ది కాలమైన తరువాత రాజు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుని తన విలువైన వజ్రపుటుంగరాన్ని ఆమెకు ఇచ్చి బయలుదేరుతాడు. కణ్వుడు లేని సమయంలో ఆమెను తీసుకుని వెళ్ళడం సబబు కాదని రాజు అభిప్రాయం. రాజు వెళ్ళిపోయిన కొన్ని దినముల తర్వాత ఒకరోజు శకుంతల భర్త గురించి ఆలోచనలో మునిగి ఉండగా స్వతహాగా కోపిష్టియైన దుర్వాస మహాముని ఆమె ఆశ్రమానికి వస్తాడు. ఆమె భర్త గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండగా ఆయన పిలుపులు సరిగా ఆలకించలేదని, ఆమె ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నదో వారు, ఆమె గురించి పూర్తిగా మరిచిపోతారని శపిస్తాడు. శకుంతల ఆ శాపం కూడా వినే స్థితిలో ఉండదు. ఆమె స్నేహితుల్లో ఒకరు ఆ శాపాన్ని ఆమెకు తెలియబరుస్తారు. శకుంతల శాపాన్ని వెనక్కు తీసుకోమని దుర్వాసుని ప్రార్థిస్తుంది. దాంతో శాంతించిన దుర్వాసుడు, ఆ శాప ప్రభావం కేవలం ఒకరోజు మాత్రమే ఉండి తరువాత తొలగిపోతుందని ఆమెను ఊరడిస్తాడు.
ఆశ్రమానికి తిరిగి వచ్చిన కణ్వుడు, తన కుమార్తె దుష్యంతుని తన భర్తగా ఎన్నుకున్నందుకు సంతోషిస్తాడు. ఆమె తల్లి కాబోతుందని తెలిసి భర్త దగ్గరకు పంపించే ఏర్పాట్లు చేస్తాడు. మార్గ మధ్యంలో నదిలో అలా నీళ్ళలో చేతులాడిస్తుండగా తనకు భర్త ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది శకుంతల. దుర్వాసును శాపం ప్రకారం ఆమెను గుర్తించలేకపోతాడు దుష్యంతుడు. దిక్కు తోచని శకుంతలను ఆమె తల్లియైన మేనక అడవిలోకి చేరుస్తుంది. ఆమె అక్కడే మగ శిశువుకు జన్మనిస్తుంది. ఇతడే భరతుడు. ఈయన పేరు మీదుగానే భారతదేశానికి భరతవర్షం అని పేరు వచ్చిందని ఒక వాదన.
ఇలా ఉండగా ఒకరోజు శకుంతల నదిలో పోగొట్టుకున్న ఉంగరం, ఒక చేప పొట్టలో చేరి చివరికి ఒక జాలరి చేతికి చిక్కుతుంది. సైనికులు ఆ జాలరిని రాజు దగ్గర హాజరుపరుస్తారు. ఆ ఉంగరాన్ని చూడగానే శాపవిమోచనమై ఆయనకు భార్య శకుంతల గుర్తుకువచ్చి ఆమెకు జరిగిన అన్యాయానికి చింతిస్తూ, ఆమె ఎక్కడుందో తెలియక కాలం గడుపుతుంటాడు. ఒక రోజు దుష్యంతుడు కశ్యపమహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సింహపు కూనలతో ఆడుకుంటున్న ఒక చిన్న బాలుడిని చూస్తాడు. ఆ బాలుడు స్వయానా తన పుత్రుడే అని తెలిసుకుంటాడు. బాలుడి ద్వారా భార్యను కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.