Description
రామరావణ యుద్ధం జరుగుతోంది. గొప్ప తపశ్శక్తితో పరమశివుడి అనుగ్రహం పొందిన రావణుడు ధైర్యంగా శ్రీరాముణ్ని ఎదుర్కొంటున్నాడు. రావణుణ్ని ఎలా సంహరించడమా అని శ్రీరాముడు తీవ్రంగా యోచిస్తున్నాడు. ఈ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు మొదలైనవారంతా తిలకిస్తున్నారు. వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు. రావణుడి యుద్ధ తీవ్రత చూసి దిగులుతో ఉన్న శ్రీరాముడి సమీపానికి అగస్త్యుడు వచ్చి అతడి దైవత్వాన్ని గుర్తుచేసి ఆదిత్య హృదయ మంత్రం బోధిస్తాడు.
సూర్యుడికి గల విశేష నామాలు ఆదిత్య హృదయంలో ప్రస్తావితమయ్యాయి. ప్రాణికోటిని పూజించేవాడు గనుక ‘పూష’. కిరణాలతో శోభిల్లేవాడు గనుక ‘గభస్తిమంతుడు’. గర్భంలో పుష్కలంగా హిరణ్యం దాచుకున్న హిరణ్యగర్భుడు. ఇట్లా ఎన్నో పేర్లతో సార్థక నామధేయుడు సూర్యుడు.
బ్రహ్మ సృష్టికి మూలం. సమస్త జీవజాలానికి ఉదయ గుణం ఇచ్చేవాడు బ్రహ్మ. ఉదయం వివేకోదయానికి చిహ్నం. జ్ఞాన వివేచనలకు ఉదయకాలం బ్రహ్మ జ్ఞానంతో సమానమంటారు విజ్ఞులు. సకల లోకాలకు శుభాలు కూర్చేవాడు శంకరుడు మధ్యాహ్నకాలానికి ప్రతీక. జీవనదులకు, పంట పొలాలకు, మానవాళికి శక్తి ప్రదాత మార్తాండుడు. సాయంకాలం విష్ణురూపం. విష్ణువు సర్వ వ్యాపకుడు. సాయంకాలం విష్ణువులా జగత్తుకు తేజస్సును ఇచ్చే లోకబాంధవుడిగా సూర్యుణ్ని కొలుస్తాం. వేదాల్లో సూర్యదేవతాసూక్తం ఉంది. సూర్యుడు త్రిమూర్త్యాత్మకుడు.
వాల్మీకి రామాయణంలోని ‘ఆదిత్య హృదయం’ నిత్య పారాయణ యోగ్యం. యుద్ధకాండలో 107వ సర్గలో 31 శ్లోకాల్లో ఉంది. ఇది కేవలం స్తోత్రం కాదు. సకల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని తనలో మిళితం చేసుకొని తనను ఆరాధించేవారిని తగిన రీతిలో తరింపజేసే స్తోత్రరాజం ఆదిత్య హృదయం. ఆదిత్యులు పన్నెండు మంది. వీరిలో విష్ణువు కూడా ఒకడు. ఆదిత్యుల్లో ప్రధానస్థానం వహించిన విష్ణువును ఉద్దేశించి చెప్పిన స్తోత్రం ఇది. శాంతిని, కాంతిని, స్థిరత్వాన్ని, స్థాయిని ప్రసాదించే సామర్థ్యం ఆదిత్య హృదయంలో ఉంది. రామచంద్రుడికి రణరంగంలో సహకరించినట్లుగానే ఆదిత్య హృదయం ప్రాణికోటికి జీవితంలో ఉపకరిస్తుంది. కృష్ణార్జునుల మధ్య గీతామృతం ప్రవహించినట్లుగానే అగస్త్య రామచంద్రులు ఆలంబనంగా ఆదిత్య హృదయం ఆవిర్భవించింది. రెండూ రణరంగంలోనే వెలువడటం విశేషం.
ఆదిత్య హృదయంలోని మొదటి తొమ్మిది శ్లోకాలు స్తోత్రానికి పూర్వ రంగాన్ని సమకూరుస్తాయి. చివరి తొమ్మిదీ స్తోత్ర ప్రాశస్త్యాన్ని, ఫలశ్రుతిని అందిస్తాయి. మధ్య పన్నెండు శ్లోకాలు ద్వాదశాదిత్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది. స్తుతి మధ్య భాగంలో ‘ద్వాదశాత్మన్నమోస్తుతే’ అనే నమోవాకం ఉంది.
అగస్త్యుడు శ్రీరాముని ‘రామరామ మహాబాహో’ అని సంబోధిస్తాడు. ఆదిత్య హృదయం పరమ పవిత్రమని, సర్వశత్రు వినాశనమని నిత్యం, అక్షయం, పరమ కల్యాణదాయకమైన స్తోత్రమని వివరిస్తాడు. భాస్కరుడిలో సకల దేవతలు మూర్తీభవించి ఉన్నారని అగస్త్యుడు వివరిస్తాడు. ఇంద్రుడు, కుబేరుడు, యముడు, సోముడు, వరుణుడు, పితృ దేవతలు, అష్ట వసువులు, అశ్వినీ దేవతలు, మరుద్గణాలు- అందరూ భాస్కరుడి ప్రతిరూపాలే. గాలి, అగ్ని, ఊపిరి, రుతువులు- వీటన్నింటికీ ఆధారం సూర్యుడు. సమస్త ప్రాణులందు అంతర్యామి రూపంలో ఉంటూ వారు నిద్రపోయినా తాను మేల్కొంటాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ మనకు తోడునీడగా మనలో వెలుగుతున్న ఆదిత్య రూపం సర్వదా ఆరాధ్యం. ఆదిత్య స్తోత్రాన్ని మూడుసార్లు పఠిస్తే యుద్ధంలో విజయం లభిస్తుందని అగస్త్యుడు బోధిస్తాడు. ఆ తరవాత శ్రీరాముడు ఆనందంతో, నిష్ఠతో ఆదిత్య హృదయం జపించి రావణ సంహారం గావిస్తాడు