Description
సుందరకాండ(పాకెట్)
వాల్మీకి రామాయణానికి ముందు సామాన్యులకోసం వాంగ్మయాలేవీ లేవు. వేద సారస్వతం తప్ప మరే సాహిత్యం లేని కాలమది. అందుకే వాల్మీకిని ఆదికవి అన్నారు. తాను రాసిన కావ్యానికి వాల్మీకి మూడు పేర్లు ప్రతిపాదించాడు. కథానాయకుడి గురించిన రచన కనుక రామాయణం అన్నాడు. కథానాయిక సీతమ్మ చరిత కనుక ఆ పేరుతో ఈ కథను జనసమ్మతం చేయాలనుకున్నాడు. ప్రతినాయకుడి వధను రచించిన తీరుననుసరించి పౌలస్త్య వధం అనే పేరుతో సైతం ఈ వాంగ్మయాన్ని రంజింపజేయాలనుకొన్నాడు. రావణవధను అంత అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి. చివరికి శ్రీరాముడి గొప్పదనం కారణంగా ఆ రచన శ్రీమద్రామాయణంగా విశ్వవ్యాప్తమైంది.
ఇరవై నాలుగువేల శ్లోకాలున్న రామాయణాన్ని వాల్మీకి ఆరు కాండలుగా విభజించాడు. బాలకాండలో శ్రీరాముడు, అతడి ముగ్గురి సోదరుల బాల్యం… అయోధ్య కాండలో ఆ నగరంలో నలుగురు అన్నదమ్ముల పెంపకం, సీతారామ కల్యాణం గురించి మనోహరమైన రీతిలో ఆసక్తిదాయకంగా వాల్మీకి రచన సాగుతుంది. సీత, లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్ల పాటు శ్రీరాముడి వనవాసం, సీతాపహరణ గురించిన వర్ణనే అరణ్యకాండ. కిష్కింధ కాండలో రామలక్ష్మణులు హనుమను, సుగ్రీవుణ్ని కలుస్తారు. హనుమ చేసిన సీతాన్వేషణే సుందరకాండ.
సుందరకాండ రామాయణంలో అయిదో కాండ. హనుమంతుడు లంక చేరడానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. ఇక్కడితో వాల్మీకి రామాయణం పదకొండు వేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం (పన్నెండు వేలో శ్లోకం)తో ప్రారంభం అవుతుంది. సుందరకాండలో అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయి. ఈ కాండలో హనుమ సీతను అశోక వనంలో చూసిన తరవాత ఆమెకు కనిపించి తన వృత్తాంతాన్ని, రాముడి దుఃఖాన్ని వివరించి ఆయన ఇచ్చిన ఉంగరాన్ని అందిస్తాడు. సీత అందరి క్షేమసమాచారాలను తెలుసుకుని ఆపై రాముడి గురించి అడుగుతుంది. సుందరకాండలో హనుమ శ్రీరాముడి సౌందర్యాన్ని వర్ణించిన తీరు అద్భుతం.
ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణాలు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముడి గురించి విని సీత ఊరడిల్లింది.
మిగతా అయిదు కాండల్లో శ్రీరాముడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. కానీ సుందరకాండలో ఆయన నేరుగా కనిపించడు. బ్రహ్మాండ పురాణంలో ఈ కాండ గురించి అద్భుత వివరణ ఉంది. ఇది రామాయణానికి బీజకాండం. అసమానమైన మంత్రం. దీని పారాయణం వల్ల లభించని సిద్ధి మరో విధంగా సైతం లభించదన్నది బ్రహ్మ శాసనమని ఆ పురాణం ప్రశంసించింది.
సుందరకాండలో వాల్మీకి కవనం అందంగా ఉంటుంది. ఈ కాండలో శబ్ద సౌందర్యం సైతం రసజ్ఞాన సంబంధమై ఉంటుంది. నవ రసాలు ఇందులో పాఠకులను పారవశ్యానికి గురిచేస్తాయి.
హనుమ అన్వేషకుడు మాత్రమే కాదు. దూత, గూఢచారి, యోధుడు. రాముడికి తగిన బంటు. సుందరకాండ స్వారస్యం ఇంతా అంతా అని వివరించలేనిది. యుద్ధకాండలో హనుమ సమర నీతి గమనించగలం. విభీషణుడు రాముడి వద్దకు శరణార్థిగా రావడంలో హనుమ కీలక పాత్ర వహించాడు. విభీషణుడు శ్రీరామ శిబిరంలోకి రావడంవల్ల రావణుడి వధ మరింత సులువైంది. సుందరకాండ మహాద్భుత రచన. సుందరకాండ మంత్రయుక్తమని పౌరాణికులు అంటారు. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరతాయని, తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని ఎందరో విశ్వసిస్తారు. ‘సుందర’కాండ అనే పేరే సచ్చిదానంద సౌందర్యమూర్తిని సూచిస్తుంది. శ్రీమద్రామాయణంలో ఈ భాగం మానవాళికి వాల్మీకి అందించిన మహాద్భుత వరమే!
– అప్పరుసు రమాకాంతరావు