Description
అష్టలక్ష్ములు ఆమె రూపంలో…
దీపావళి పండగనాడు ప్రధానంగా చేసేది లక్ష్మీ పూజ. ఇంతకు ఎవరీ లక్ష్మీదేవి అంటే… సర్వలోకాలకు శక్తిని, ఆనందాన్ని పంచే ఓ దివ్యమూర్తి. వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువుకు ఇల్లాలు.
విష్ణుమూర్తికి ఇల్లాలైన లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు అని అడిగితే…సంపద కోసం మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి…ఆయా పేర్లతో అష్టలక్ష్ములు అన్ని విషయాల్లోనూ తోడుంటారు. వైకుంఠవాసుడి ఇల్లాలైన లక్ష్మీదేవిని స్తుతించడంతోనే సరిపోదు. లక్ష్మీదేవికి ప్రతిరూపమైన స్త్రీని గౌరవించి పూజించడమూ అవసరమే. అదే అసలైన లక్ష్మీపూజ. ఇల్లాలిగా, తల్లిగా, బిడ్డగా, సోదరిగా… ఇలా ఎన్నెన్నో బంధాలు, అనుబంధాల రూపంలో ఆమె ఇంటి దీపం అవుతుంది. అందుకే దీపావళినాడు చేసే లక్ష్మీపూజ… స్త్రీమూర్తిని గౌరవించే ఉత్తమ లక్షణానికి స్ఫూర్తినివ్వాలి. లక్ష్మీదేవి స్వయంగా తాను ఉండే ప్రదేశాలను చెబుతూ… స్త్రీలలోనూ కొలువై ఉంటానని చెప్పింది. అందుకే మహిళలంతా లక్ష్మీస్వరూపాలే అనే విషయం మరిచిపోవద్ధు
అమ్మగా ఆదిలక్ష్మి… సృష్టికి మూలమైన మాతృమూర్తి ఆ ఇంటికి ఆదిలక్ష్మి. అందుకే ఆమె స్థానం ఎప్పటికీ అపురూపం. ఆ కుటుంబానికి అన్నీ తానై… బాధ్యతల్ని చక్కబెట్టే ఆమెకు గౌరవం ఇవ్వాల్సిందే. అప్పుడే ఆ ఇల్లు కళకళలాడుతుంది. ఆదిపరాశక్తిగా ఆదిలక్ష్మిని చెబుతారు. ఆమె పద్మంతో కూడిన అభయముద్ర, వరద ముద్రలతో కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న అమ్మ కూడా బిడ్డలకు అభయమిస్తూ కావలసినవన్నీ సమకూరుస్తుంది. అచ్చం అభయవరద ముద్రలతో ఉన్న ఆదిలక్ష్మివలే కనిపిస్తుంది.
చదువునిచ్చే విద్యాలక్ష్మి… ప్రతి ఒక్కరికీ మొదటి గురువు అమ్మే. ఆమె నేర్పే పాఠాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకపోవచ్ఛు క్రమశిక్షణ, నైతికవిలువలు అన్నీ ఉగ్గుపాలతోనే నేర్పించడం మొదలుపెడుతుంది. ఇంటిల్లిపాదికి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆమె పిల్లలకు ఏ విషయం చెబుతున్నా విద్యాలక్ష్మిగానే దర్శనమిస్తుంది.
ధనలక్ష్మి… ఇల్లాలిగా, ఉద్యోగినిగా… ఇంటి నిర్వహణలో ఆమే కీలకం. భర్త తెచ్చిన ప్రతిరూపాయినీ క్రమశిక్షణతో ఖర్చు చేస్తుంది. ఆధునిక మహిళ భర్త బాధ్యతల్ని పంచుకుంటూ సంపాదనలో తోడవుతోంది. అనుగ్రహించే ధనలక్ష్మికి ప్రతిరూపమే నేటి స్త్రీ.
ధాన్యలక్ష్మి… సృష్టిలో సమస్త జీవరాశులకు ఆధారం ఆహారం. అలాంటి భుక్తిని ప్రసాదించే తల్లి ధాన్యలక్ష్మి. ఆమెలానే ఇంటి ఇల్లాలు…కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాలు, ఆకలి వంటివి గమనించుకుని…అడగకుండానే అన్నం పెడుతుంది.
ధైర్యలక్ష్మి… ఏ పని చేయాలన్నా ధైర్యం అవసరం. కొండంత బలమున్నా కొద్దిగా ధైర్యం లేకపోతే ఎలాంటి వారైనా కుంగిపోతారు. ధైర్యలక్ష్మి మనిషికి కష్టాల్లో ధైర్యంగా నిలబడే శక్తినిస్తుంది. బాధల్లో ఉన్న భర్త, పిల్లల బాధలు భయాలకు మనోనిబ్బరాన్ని అందిస్తుంది. చక్కటి మార్గదర్శనం చేస్తుంది. ఆ సమయంలో ఆమె ధైర్యలక్ష్మితో సమానమే.
గజలక్ష్మి… తామరపువ్వులో కూర్చొని అటూఇటూ ఉన్న ఏనుగులు అభిషేకం చేస్తూ ఉండగా వరాలనిచ్చే తల్లిగా, కరుణామయిగా కనిపిస్తుంది గజలక్ష్మి. కుటుంబసభ్యుల మన్ననలు అందుకుంటూ చక్కగా ప్రశాంతంగా ఉంటూ ఇంటికి వచ్చిపోయే అతిథులను ఆదరించే ఇల్లాలికి ప్రతిరూపమే గజలక్ష్మి.
విజయలక్ష్మి… ఎవరేది కావాలనుకుంటే దాన్ని ప్రసాదించి పెట్టే తల్లి విజయలక్ష్మి. లక్ష్యాన్ని అందుకోవాలంటే సంకల్పం కావాలి. అందుకు తగిన వాతావరణం తోడుగా నిలబడాలి. ఈ విషయంలో ఇంటిల్లిపాది తమ లక్ష్యాలను చేరుకుని విజయకేతనం ఎగరవేసేందుకు ఆమె సాయపడుతుంది. విజయలక్ష్మిగా వారి ప్రతి అడుగులోనూ తను ఉంటుంది.
సంతానలక్ష్మి… ఒడిలో బిడ్డతో అభయ ముద్రలు, కత్తి, డాలు, రెండు కలశాలతో సాక్షాత్కరిస్తుంది సంతానలక్ష్మి. ఈ అమ్మ రూపాన్ని చూస్తే ఇంట్లో ఉండే మన మాతృమూర్తే గుర్తొస్తుంది. బిడ్డలను లాలిస్తూ…వచ్చే కష్టసుఖాల్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుంది. ఆమె సంతాన లక్ష్మిగా ప్రేమానురాగాలు పంచుతుంది.
– యల్లాప్రగడ మల్లికార్జునరావు