Description
నారాయణీయం సంపూర్ణ పారాయణతో
ఆయురారోగ్య సౌఖ్యం
శ్రీ సామవేదం షణ్ముఖశర్మమాటల్లో…
‘నారాయణీయ’ మహాగ్రంథాన్ని తెలుగులో సమగ్రంగా అందిస్తున్న సత్కృతి ఇది. శ్రీయుతులు కవిపండితులు తాడేపల్లి పతంజలిగారు చక్కని ఉపోద్ఘాతంతో, ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో చక్కని వ్యాఖ్యా గ్రంథంగా దీనిని తీర్చిదిద్దారు.
లోకకల్యాణాకాంక్షతో, భగవదర్పణ బుద్ధితో శ్రీగుడిపాటి శ్రీ రామకృష్ణశర్మగారు దీనిని ప్రచురింపజేశారు. గతంలో నమక – చమకాలపై చక్కని గ్రంథాన్ని వెలువరింపజేసి ఇప్పుడు ఆధివ్యాధిహరమైన ఈ మంచిపుస్తకాన్ని అందించి లోకహితాన్నీ, ఈశ్వరకైంకర్యాన్నీ సాధించారు.
గ్రంథవ్యాఖ్యానంలో ఎన్నో శాస్త్రాంశాలను ఉట్టంకిస్తూ, ఛందోవిశేషాలను తెలియజేస్తూ ‘శాస్త్ర-కావ్యం’గా దీనిని మలచిన శ్రీపతాంజలిగారి ప్రతిభ, ఔచిత్యం అభినన్దనీయాలు. వేయికి పై చిలుకు శ్లోకాలలో ప్రతిఒక్క దానినీ సంపూర్ణ సమన్వయంతో, జ్ఞానరసపుష్టితో రచించారు. పఠితకు మూలగ్రంథ హృదయం తెలియడంతో పాటు, నారాయణ తాదాత్మ్యానుభూతి కలిగేలా వివరించిన వ్యాఖ్యాతకు, ప్రచురణకర్తకు అభివన్దనాలతో..
– బుధజనవిధేయుడు
సామవేదం షణ్ముఖశర్మ
________________
కేరళ రాష్ట్రంలోని గురువాయురు దేవాలయంలో విగ్రహరూపంలో కొలువై ఉన్న ఆ శ్రీకృష్ణుడు శ్రీ మేపత్తూరు నారాయణ భట్టాత్రి అనే మహాకవిచే ఈ మహిమాన్వితమైన శ్రీమన్నారాయణీయము అనే గ్రంథరాజాన్ని రచింపజేశాడు. 1036 శ్లోకాలతో శ్రీమద్భాగవతానికి సారసంగ్రహంగా ఈ నారాయణీయము నేటికీ గురువాయూరు దేవాలయంలో పారాయణచేయబడుతున్నది. భక్తిప్రపత్తులతో ఈ నారాయణీయాన్ని పఠించే వారికి ఎటువంటి రుగ్మతయైనా నయమయి తీరుతుందనడానికి ప్రజల నిదర్శనాలు అనేకం ఉన్నాయి.
నారాయణునికి సంబంధించిన కథ నారాయణీయం. ఈ గ్రంథంలో నూరు అధ్యాయాలున్నాయి. నారాయణ భట్టు వాటిని దశకాలని పేర్కొన్నాడు. పది శ్లోకాలు కలది దశకం. కాని నారాయణీయ దశకాలలో కొన్నింట్లో 9, మరి కొన్నింట్లో 10 నుంచి 15 శ్లోకాల వరకు చోటుచేసుకొన్నాయి. ప్రతి దశకంలోనూ చివర కవి ‘నా రుగ్మతలను తొలగించు’, ‘నాకు భక్తిని అనుగ్రహించు’,’నాకు మోక్షం ప్రసాదించు’ అంటూ ప్రార్థనా పూర్వకంగా విన్నవించుకోవడం చూడవచ్చు. ఈ విన్నపాలకు సంబంధించిన పెద్దలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
క్రీ.శ. 1560లో జన్మించిన నారాయణ భట్టాత్రి తన 16వ ఏటనే సమస్త విద్యలనూ అలవోకగా అభ్యసించాడు. శ్రీ పిషరడి అనే విఖ్యాత పండితుణ్ణి తన గురువుగా స్వీకరించాడు. గురువుగారి వాతరోగాన్ని తను స్వీకరించి, గురుదక్షిణగా తన పరిపూర్ణ ఆరోగ్యాన్ని అయనకు సమర్పించాడు. కోరి తెచ్చుకొన్న వాతరోగం ప్రకోపించిన స్థితిలో, ఆ బాధను తొలగించుకోనే నిమిత్తం భాగవత రచన ప్రారంభించి దానికి నారాయణీయము అని పేరు పెట్టాడు.
గురువాయూర్ దేవాలయంలో నూరు రోజులపాటు భట్టాత్రి తన రచనను సాగించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రంథ రచన పూర్తిచేసి శ్రీకృష్ణ దర్శనం పొందే నాటికి ఆయన వయస్సు కేవలం 27 ఏళ్ళు మాత్రమే.
– డా. తాడేపల్లి పతంజలి
___________