Description
– పరాశక్తి అవతారమే కామధేనువుసాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మతో పూజలందుకున్న పరమపవిత్ర కామధేనువుకు ప్రత్యక్షరూపం గోమాత. ఒకనాటి ఋషులకు అందరికీ అదొక హోమధేనువు. సురభి, శబల, నందిని, కపిల పేర్లతో భారతీయ ధర్మశాస్ర్తాలు ఆ గోమాతకు పరమోన్నత స్థానాన్నిచ్చాయి. ‘ఏది కోరితే అది, లేదనకుండా, కాదనకుండా ప్రసాదించే’ ఆ అద్భుత ధేనువుకు ప్రతిరూపాలే నేటి కోట్లాది గోవులు. ఈ సాధుమహాతల్లి విలు వను తెలియజేసే ఒక ప్రస్తావన చదువండి.అమ్మ-ఆవు-అమృతం. పేరేదైనా అఖండమైన జీవామృతానికి ఇవి మూడూ నిలువెత్తు రూపాలు. ముఖ్యంగా ఈ మూడింటికీ నిలువెల్లా, అణువణువునా ప్రాణశక్తి ఉంటుంది. అందుకే, మన పెద్దలు అమ్మ వంటిదే ఆవు అన్నారు. కన్నతల్లి తర్వాత దానికి మాత్రమే అంతటి విశిష్ఠ స్థానాన్నిచ్చారు. అమ్మప్రేమంటే అమృతమే కదా. ఏటా వచ్చే అపురూపమైన తిథులలో ‘గోవత్స ద్వాదశి’ ఒకటి. ఆశ్వీయుజ బహుళ అమావాస్యకు, మరీ ముఖ్యం గా మహోన్నత పర్వదినమైన దీపావళికి ముందు, తెల్లవారితే ధనత్రయోదశి (లక్ష్మీదేవి పుట్టిన రోజు) అనగా వచ్చే ద్వాదశి రోజు ఇది. దీపావళి ఎంత విశిష్ఠ పర్వదినం కాకపోతే, క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించిన లక్ష్మీ, కామధేనువుల ఆరాధనలు ఇలా ఒక్కసారే, వరుసగా వస్తాయి!
భారతీయ ధర్మశాస్ర్తాలు, ఆధ్యాత్మికతకు అద్వైతమే ఆత్మ అనడానికి సమస్త ప్రకృతి ఆరాధనను మించిన సాక్ష్యం మరొకటి అక్కర్లేదు. కనిపించని దేవుని కనిపించే జీవుల్లో ఇంకా, సృష్టిలోని అణువణువులోనూ దర్శించడాన్ని మించిన గొప్ప తాత్వికత మరేముంటుంది? అసలు హైందవ పౌరాణిక విజ్ఞానాన్నంతా కట్టుకథలుగా కొట్టివేసే వారంతా ఒక్కసారి మనసు పెట్టి వాటిని చదివితే అందులో మూలమూలలో, మలుపు మలుపులో, అక్షరమక్షరంలోనూ ధార్మిక జీవనసారమే కనిపిస్తుంది. కొండమీది చెట్టు, పుట్టలోని పాము, గట్టుమీది ముత్యం, మట్టిలోని శక్తి.. ఏదీ పూజకు అనర్హం కాదు. ఒక్కో ప్రాణికి, ఒక్కో విలక్షణమైన, మహోన్నత ప్రాధాన్యాన్నిచ్చిన తీరు చూస్తే ఆనాటి భారతీయుల దృష్టి సాకారతకు సలామ్ కొట్టవలసిందే. వీటన్నింటిలో ఒకటే మన ఈ గోపూజ.
ఎక్కడ నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం ఉంటాయో అక్కడ, ఆ జీవికి నిలువెల్లా గాయాలు ఉంటాయన్నదీ నిజం. మన చిన్నప్పటి ‘ఆవు-పులి’ కథ ఒక్కటి చాలదా, గోమాత నిజాయితీని చాటడానికి! ఆఖరకు అది నడిచే దారిలోంచి లేచే ధూళికి సైతం కవులు పట్టం కట్టారు. ఆవును, దాని బిడ్డతో కలిపి ఎందుకు ఆరాధించాలో తెలుసుకొంటే మన దేహం కంపిస్తుంది. హృదయం ఉప్పొంగుతుంది. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత వంటి మహద్గ్రంథాల నుంచి పురాణాది కావ్యాల వరకూ సమస్త భారతీయ పౌరాణిక సాహిత్యంలో ఎక్కడ చూసినా ‘గోవు’ విశిష్ఠత సాక్షాత్కరిస్తుంది. అసలు ఒక సాధారణ ఆవుకు ఇంతటి గొప్ప స్థానం ఇవ్వడం వెనుక వున్న మూలకారణాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ మహోన్నత సాధుజీవిని కండ్లలో పెట్టుకొని కాపాడుకొంటాం. గుండెలో దాచుకొంటాం. క్షీరసాగర మథనంలో కామధేనువు ఆవిర్భవించడం నుంచి, శ్రీకృష్ణపరమాత్మకు, దత్తాత్రేయస్వామికి వెన్నుదన్నుగా నిలబడడం నుంచి, వశిష్ఠ, కశ్యప, జమదగ్ని ఋషిపుంగవులకు ప్రాణప్రదంగా నిలువడం నుంచి, కార్తవీర్యార్జునుడు, విశ్వామిత్రుడు వంటి రారాజులు దానికోసం ఆరాటపడడం వరకు పౌరాణిక గాథలన్నీ చదివితే ఆ గోమాత విశ్వరూపం చూస్తాం.
ఆవును ఒక్కదానిని కాకుండా దూడ (బిడ్డ)తో కలిపి పూజించాలని పండితులు చెప్తారు. అత్యంతాసక్తికరమైన, ఇంకా ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గ విషయం ఏమిటంటే, ఆవు ప్రాణవాయువు (ఆక్సీజన్)నే పీల్చుకొని ప్రాణవాయువునే విడుదల చేస్తుంది. ఇది పూర్తిగా శాకాహారి. ఎంత సాధుజీవి అంటే అంబా అని అరవడం తప్ప ఎద్దు (నంది)లా కొమ్ములతో పొడవడం తెలియదు. బుద్ధిగా యజమానికి మేలు చేస్తూ పడుండడమే. మనిషికి, మానవ జీవన వికాసానికి ఆవు అణువణువూ జీవామృతం కావడం వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్న విషయం ఇదివరకే వెల్లడైంది. ఒక్క ‘గోవత్స ద్వాదశి’నాడు మాత్రమే కాదు, సర్వకాల సర్వావస్థలలోనూ ఆవు పూజింపదగిందే అనడానికీ అనేక ప్రామాణిక ఆధారాలు వున్నా యి. ఆవుపాలు, నెయ్యినుంచి మూత్రం, పేడవరకూ అన్నీ మనుషుల జీవశక్తిని పెంపొందించే పోషకాలే. ఇంత గొప్పనైన ఆవును ఆరాధిస్తూ అక్కున చేర్చుకొంటే, ఆ ఫలితం ఊరికే పోదు.
భూమ్మీది ఆవులన్నీ కామధేనువు బిడ్డలేనని పురాణాలు చెబుతున్నాయి. గోవు దేహంలోని అవయవాలన్నింటా సమస్త దేవతలూ కొలువై ఉన్నారని, ఒక్క ఆవుపూజతో ఏకంగా గోపాలుని (శ్రీకృష్ణపరమాత్మ) సేవ చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు..’ అన్న పద్యం ఆవుపాలలోని అమృతత్వాన్ని తెలిపింది. గోమాత దివ్యశక్తి అనంతం. గోమాత అనుగ్రహంతో సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయనే ప్రగాడ విశ్వాసం హైందవులలో ఉంది. సాక్షాత్ పార్వతిదేవి (పరాశక్తి) స్వరూపంగానూ కామధేనువును భావిస్తారు. ఆవు నాలుగు కాళ్లు నాలుగు వేదాలకు నెలవు అయితే, గోమూత్రం గంగాజలం వంటిదని, ఆవుపేడలో అయితే ఏకంగా లక్ష్మీదేవియే నివాసముంటుందని వేద పండితులు చెప్తారు.
Chintana1
గోమాత అవతారాలు!
పాలకడలి మథనంలోంచి కామధేనువు (సురభి) ఉద్భవించగా, దీనివ
ల్ల అనేక వేల కపిలవర్ణ (బంగారు) ఆవులు పుట్టాయని మహాభారతం (అనుశాసన పర్వం) వెల్లడించింది. లోకంలోని అన్ని ఆవులకు సురభినే తల్లి అని రామాయణం (కశ్యప వృత్తాంతం) తెలిపింది. సురభిని, దాని దూడ ‘మనోరథ’ను శ్రీకృష్ణుడే స్వయంగా సృష్టించాడని, ఆ గోమాత చర్మరంధ్రాల్లోంచి వేలగోవులు ఉత్పన్నమై గొల్లవారికి ఉపాధిగా మారాయని దేవీభాగవతం పేర్కొన్నది. ప్రత్యేకించి దీపావళి నాటి బలిప్రతిపద రోజు శ్రీకృష్ణపరమాత్మ సురభిని దూడతోపాటు పూజించినట్లు కథనం. పురాణకథల్లోని నందిని సృష్టికర్త కూడా కామధేనువేనని అంటారు. ఆవులలో కామధేనువును తానేనని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు.
– దోర్బల బాలశేఖరశర్మ