Kedareswara Vratam

కేదారేశ్వర వ్రతం

20.00

Share Now

Description

కేదారేశ్వర వ్రతం

వెన్నెల పూలతో
పున్నమి పూజలు
ఈనెల 12 కార్తిక పౌర్ణమి

న కార్తికం సమోమాసః
నదేవ కేశవాత్పరమ్‌
నచవేద సమంశాస్త్రం
న తీర్థం గంగాయాస్యమమ్‌!
కార్తికానికి సమమైన మాసం, శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవు

– స్కాందపురాణం

కార్తిక మాసం ముఫ్పై రోజులు చేసే పూజలతో జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని నమ్ముతారు. ఇందులో అత్యంత పవిత్రమైన, దివ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. అనేక సంప్రదాయాలతో నిర్వహించుకుంటారు.

త్రిపుర పౌర్ణమి: ఈ పర్వదినం వెనక ఓ ఆసక్తికరమైన కథను వివరిస్తారు. త్రిపురాసురులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మతి సంహార బాధ్యతను పరమేశ్వరుడు తీసుకుంటాడు. భూమి రథంగా మారితే… సూర్యచంద్రులు దానికి చక్రాలుగా, నాలుగు వేదాలు గుర్రాలుగా, శాస్త్రాలు కళ్లెపు తాళ్లుగా మారాయి. దాన్ని అధిరోహించిన నీలకంఠుడు మందర పర్వతాన్ని ధనుస్సుగా ధరించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బాణంగా రూపుదాల్చాడు. పరమేశ్వరుడు ఒకే ఒక్క బాణంతో త్రిపురాలను ధ్వంసం చేసి అందులోని అసురులను అంతం చేశాడు. త్రిపురాసుర సంహారం జరిగిన రోజే త్రిపుర పౌర్ణమిగా మారిందని పురాణగాథ. ఆ రోజు శివుణ్ణి అభిషేకించడంతో పాటు, మారేడు, జిల్లేడు పూలతో పూజిస్తారు.
దీపోత్సవం: ఈ మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మాసమంతా ఇరు సంధ్యల్లో ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా దీపాలను వెలిగిస్తారు. అన్ని రోజుల్లో ఇలా చేయనివారు కనీసం పౌర్ణమినాడు దీపాలు వెలిగించాలని శాస్త్రవచనం. ఉసిరి కాయలపై, ఆవు నేతితో తడిపిన వత్తులను ఉంచి దీపాలను వెలిగించడం మంచిదని చెబుతారు. అరటి దొప్పల్లోగానీ, ఆకుపై గానీ దీపం ఉంచి నదుల్లో వదులుతారు. ‘ఏకస్సర్వదానాని దీపదానం తథైకతః’… అన్ని దానాలు ఒక ఎత్తైతే దీప దానం మరో ఎత్తని చెబుతారు. దీపదానం చేసేవారు పైడి పత్తితో స్వయంగా వత్తులు చేసుకుని, గోధుమ పిండితో ప్రమిదను చేసుకుని, అందులో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి పండితుడికి దానం చేస్తారు.
జ్వాలా తోరణోత్సవం: కార్తిక పౌర్ణమినాడు శివాలయంలో జ్వాలా తోరణోత్సవం దర్శించాలని చెబుతారు. రెండు ఎత్తైన కర్రలను నాటి, వాటిని కలుపుతూ మరో కర్రను అడ్డంగా కట్టి, దానికి నెయ్యితో తడిపిన గుడ్డనుగానీ, ఎండు గడ్డినిగానీ చుట్టి నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలా ఉంటుంది కాబట్టి దీనికి జ్వాలాతోరణం అని పేరు. శివపార్వతులను పల్లకిలో ఉంచి దీని కింద తిప్పుతారు. హాలాహలం గరళంలో దాచుకున్న సమయంలో శివుడికి ఏం కాకుంటే చిచ్చుల తోరణం కింద నుంచి మూడుసార్లు వస్తానని పార్వతీదేవి మొక్కుకుందని, అప్పటి నుంచి ఇది ఆచారంగా మారినట్లు చెబుతారు.

ధాత్రీ పూజ: ధాత్రి అంటే ఉసిరిక. కార్తీకమాసంలో ఉసిరి కాయలపై దీపాలను వెలిగించడంతో పాటు ఉసిరిక వృక్షాన్ని పూజించాలని చెబుతారు. ఉసిరిక చెట్టు మొదలు దగ్గర శుభ్రం చేసి అలంకరించి దీపాలను వెలిగిస్తారు.
తులసి పూజ: కార్తికమాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంటబెట్టుకుని బృందావనానికి వచ్చాడని చెబుతారు. బృందావనం అంటే తులసికోట. అందుకే క్షీరాబ్ధిద్వాదశినాడు తులసిపూజ చేయాలని శాస్త్రవచనం. అలా చేయలేనివారు పౌర్ణమి రోజు తులసి పూజ చేయాలని చెబుతారు.
భక్తేశ్వర వ్రతం: కార్తిక పౌర్ణమినాడు భక్తేశ్వర వ్రతం చేయడం ఆచారం. శివుడిని భక్తేశ్వరుడు అనే పేరుతో ఆరాధిస్తూ చేసే వ్రతమిది. పున్నమినాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసి, నివేదించిన అనంతరం ఉపవాసం విరమిస్తారు. దీని వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. పున్నమినాడు పరమేశ్వరుడిని తామరపూలతో పూజించి, మార్కండేయ పురాణం పుస్తకాన్ని దానం చేసే సంప్రదాయం

 

ప్రతి రోజూ పుణ్యప్రదమే!

కార్తిక మాసంలో అడుగుపెట్టాం! వేకువ స్నానం, శివాభిషేకం, దీపారాధనం, ఉపవాసం… ఈ మాసంలో చేయాల్సినవెన్నో! అన్నీ పుణ్యప్రదమే! ఏమిటీ మాసంలోని ఆ విశేషం?
భారతీయ సంస్కృతిలో నక్షత్రాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. చాంద్రమానాన్ని అనుసరించి, కృత్తికా నక్షత్రంతో కూడిన పున్నమి నాడు చంద్రోదయం అయ్యే మాసం కనుక ఇది కార్తిక మాసం. ఇది ఆధ్యాత్మికతను అనుసరించేవారికి అమృతత్త్వాన్ని అందిస్తుంది. దేవతలకు కూడా అమృతతుల్యమైన ఈ మాసం హరిహరులకూ, శక్తికీ ప్రియమైనది. వారి ఆరాధనకు అనువైనది. కార్తిక మాస మహాత్మ్యాన్ని తొలుత జనక మహారాజుకు వశిష్టుడు వివరించాడనీ, అది విన్న సూతుడు సత్రయాగంలో శౌనకాది మహర్షులకు వివరించాడనీ పురాణ కథనం.
కార్తిక మాసంలో శివునికి అభిషేకాలూ, హరిహరులిద్దరికీ అర్చనలూ, శక్తి పూజలూ నిర్వర్తించడం వైదిక సంస్కృతిలోని ప్రధానాంశం. సూర్యోదయానికి ముందే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, చన్నీటి స్నానాలు చేసి, హరిహరాదులను అర్చించడం ఎంతో విశిష్టమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకంగా ఆలయాల్లో దీపారాధన, దీపదానం ఎంతో పుణ్యప్రదమని చెబుతున్నాయి. ఆయా తిథులు, వారాలలో ఆచరించవలసిన పూజా విధానాలనూ, వ్రతాలనూ పూర్వ ఋషులు సవివరంగా తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం.
కైవల్య ప్రదాయిని… కార్తీకం!
కార్తిక మాసం ఎన్నో పర్వాల సమాహారం. ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. ఈ రోజుల్లో చేయాల్సిన విధి విధానాలను తెలుసుకొని ఆచరిస్తే, ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. ప్రతి పర్వానికీ సంబంధించిన కథలు ఇతిహాసాల్లో, పురాణాల్లో ఉన్నాయి. వాటి ప్రకారం:
వేకువ స్నానంలో విశేషం
కార్తిక మాసంలో వేకువనే నదీ, తటాక, కూపాల్లో ఏది లభ్యమైతే అందులో స్నానం చేయాలి. ఒక పాత్రతో జలాన్ని తీసుకొని, అందుబాటులో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకించడం, విష్ణ్వాలయంలో కేశవుని ‘దామోదర ప్రీత్యర్థం’ అని సంకల్పం చెప్పుకొని పూజించడం, తరువాత భగవధ్ధ్యానం, స్తోత్ర పఠనం, జపం చేస్తూ గడపాలి. సమీపంలో శివ, కేశవ ఆలయాలు లేకపోతే మరే ఇతర దేవాలయానికైనా వెళ్ళవచ్చు. భగవంతుడిని హృదయంలో నిలుపుకొని- రావి చెట్టు దగ్గర కానీ, ఇంట్లో తులసికోట దగ్గర కానీ ధ్యానించవచ్చు.
కార్తికమాసం స్నానాలకూ, దీపారాధనకూ ప్రత్యేకమని తత్త్వనిష్ఠోపాఖ్యానంలో వశిష్టుడు చెప్పినట్టు కార్తిక పురాణం పేర్కొంటోంది. చేయకూడని పనుల ప్రస్తావన కూడా ఇదే ఉపాఖ్యానంలో ఉంది. కార్తికమాసంలో చేసే స్నానాల వల్ల- తెలియక చేసిన పనులు, గతంలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారని చెబుతోంది.
దీపారాధన ఎందుకంటే…
రెండవది దీపారాధన. కృత్తికా నక్షత్రం అగ్నిదేవతకు ప్రతీక. అగ్నిష్ఠోమాత్మకం. అంటే చంద్రునితో కూడి ఉండడం వల్ల కార్తిక మాసం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యతేజం మందగించి, చలి పెరుగుతుంది. వాతావరణం ఉష్ణానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఉష్ణం కోసం చలి మంటలు వేయడం కనిపిస్తుంది. అంటే అగ్న్యారాధనగా భావన చేయవచ్చు. అగ్న్యారాధనను దీపం రూపంలో చేయాలని పురాణాలు వచిస్తున్నాయి. ఈ విధంగా దీపారాధన విశేష ప్రాచుర్యం పొందింది.
అంధకారం అలుముకున్నప్పుడు కళ్ళకు వస్తువులు కనబడేటట్టు చేసేది దీపం. ఒకసారి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు ప్రపంచం అంతా చీకటిమయం అయితే దిక్కేది? అనే సంశయం కలిగిందట. అప్పుడు నేనున్నానని దీపం అభయం ఇచ్చిందట. రవీంద్రుడు స్వయంగా చెప్పిన మాటలివి. దీపం బాహ్యాభ్యంతరాలలోని చీకటిని పోగొట్టే శక్తి కలిగినది. మనలోని అజ్జ్ఞానాంధకారాన్ని తొలగించి, వెలుగులోకి నడిపించేది. సాధారణ దీపాలు పరప్రకాశాలు. పరమేశ్వరుడు, పరాశక్తి, సూర్యచంద్రులు- వీరు స్వయంప్రకాశం కలిగినవారు. మనం కోరుకోవలసింది స్వయంప్రకాశాన్ని. ‘మన శరీరంలోని చైతన్యమే దీపం!’ అని శ్రీదక్షిణామూర్తి స్తోత్రం చెబుతోంది. ఆ చైతన్యమే ఇంద్రియాల ద్వారా ప్రకటితం అవుతుంది. వివేకాన్నీ, విచక్షణనూ కలిగిస్తుంది. పాపాలకు పరిహారం చేసే శక్తి దీపానికి ఉంది. అది మమత్వాన్ని హరిస్తుంది. అవిద్యనూ, అజ్ఞానాన్నీ తొలగిస్తుంది. అందుకని కార్తిక మాసంలోనే కాకుండా ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేయాలని శాస్త్రాలు అంటున్నాయి.