Description
భగవద్గీత మూలం
కర్మయోగం
తేనెపట్టు లోపలకు వెళుతూ, బయటకు వస్తూ ఎగురుతూ ఆనందంగా ఉన్న తేనెటీగలు, ఒకదాని వెంట ఒకటి బారులు తీరి వెళుతున్న చీమల వరసలు… ఈ దృశ్యాలను చూస్తే మనకు స్ఫురించేది ఒకటే. ఎప్పుడూ పనిలో ఉండాలి. ఖాళీగా అసలు ఉండకూడదు! పనిలో విశ్రాంతి పొందడం అలవాటుపడ్డాక ఖాళీ అన్న మాటకు నిఘంటువులో అర్థం దొరకదు.
ప్రకృతి మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. అందులో అత్యంత కీలకమైనది ‘కర్మ’. అంటే, పని. ఎవరి పని వాళ్లు శ్రద్ధగా సోమరితనం లేకుండా కర్తవ్యంగా భావించి చెయ్యాలని. దీనినే లోతుగా విశ్లేషించింది భగవద్గీత. కర్మయోగం అని పేరుపెట్టి చాలా రహస్యాలు విడమరచింది.
ఈ జ్ఞానం చీమలకు అక్కరలేదు. తేనెను అందించే తేనెటీగలకు అక్కరలేదు. మొక్కనుంచి వృక్షం వరకు స్థిరంగా నిలుచుని పచ్చదనం అందించే పర్యావరణ సారథైన చెట్టుకు అక్కరలేదు. చెట్టు ఏం పని చేస్తుంది? చెట్టుకు కర్మకు ఏమిటి సంబంధం అని అనుకోనవసరం లేదు. చెట్టులోనే కర్మ ఉంది. చెట్టే ఒక యోగం. అది మనిషి ప్రాణాన్ని నిలిపే యోగం.
జ్ఞానం ఎందుకు, మన పని మనం చేసుకుని వెళ్లిపోదాం అనుకునేవాళ్లు ఒక రకం. తోటలో ఆకులు లెక్కపెడుతూ కూర్చొని మధురమైన ఫలాలు తినకుండా విడిచిపెట్టేవాళ్లు మరోరకం. జ్ఞానం ఉన్నవాళ్లు, లేనివాళ్లు నిరంతరం కర్మ చెయ్యాలి. కర్మలో ఆనందం పొందాలి. పని చెయ్యకుండా ఉండటం ప్రకృతి విరుద్ధం.
ఎవరి అన్నం వాళ్లు తినడానికి పని చెయ్యాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకున్నవాళ్లు అందరి అన్నం కోసం పని చెయ్యాలి. పనిలో ఆనందరహస్యం తెలుసుకున్నవాళ్లు పనికి అంకితమైపోతారు. ఇంతటి అద్భుతమైన ప్రపంచాన్ని దృశ్యమానంగా అనుభవంలోకి తెచ్చేది వారే.
శ్రీకృష్ణుడు చెబితేనేగాని కర్మను యోగమార్గంలో చెయ్యాలని తెలియలేదు. ఆయనే పరమ ప్రమాణం. మహానుభావులు, అవతారమూర్తులు ఏది ఆచరిస్తారో అది అందరికీ శిరోధార్యం అవుతుంది. దాన్ని సామాన్యులు ఆచరిస్తారు.
యోగమార్గంలో కర్మ అంటే మనకు తెలియదు. ప్రకృతికి తెలుసా? తెలియదు. దానితో సంబంధం లేకుండా దాని పని అది చేసుకుపోతుంది. మనిషి తప్ప అన్ని జీవులూ వాటి పనులు అవి చేసుకుపోతున్నాయి. మనిషిని మాత్రం ఒక సందేహం ప్రతి నిత్యం పీడిస్తోంది. ఈ పని నాదా కాదా అని. ఇక్కడే పుట్టింది కర్మయోగం. దీనికి కురుక్షేత్రంలో వివరణ ఇచ్చి విశ్వరూపం చూపించి- ‘నీ పని నువ్వు చెయ్యి. నా పని నేను చేస్తాను’ అని గీత గీసేశారు గీతాచార్యుల వారు. అర్జునుడికి మతిపోయింది. తెలివి వచ్చింది. వివేకం కలిగింది.
ప్రకృతిలో ఏ జీవికీ లేని ‘నేను’ నన్నెందుకు పట్టుకుంది అని ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చి యుద్ధం చేశాడు పార్థుడు. విజయం సాధించాడు. అది అర్జునుడొక్కడి విజయం కాదు. అది మానవాళి విజయం. మనిషి అహంకారం, అజ్ఞానం మీద శ్రీకృష్ణుడు ప్రయోగించిన తిరుగులేని బాణం. మనిషికి ఈ జ్ఞానమే కావాలి. ఈ జ్ఞానమే అతడి జీవిత నౌక. ఈ జ్ఞానమే దిక్సూచి. ఈ జ్ఞానమే మనిషి అంతస్సీమలకు వెలుగు. ఈ జ్ఞానం కావాలి. ఇదే కర్మయోగ రహస్యాలను విడగొట్టిన దివ్యజ్ఞానం. దీన్ని మానవుడు ఒంటపట్టించుకోవాలి. విశ్వరూప సందర్శనం కలిగేదాకా ప్రతి మానవుడి తపస్సే ఈ జ్ఞానం. ఇదే భగవద్గీత.
కర్మయోగుల్లా పనిచేసే చీమలకు భగవద్గీత అక్కరలేదు. వాటికి ‘నేను’ లేదు. తేనెటీగలకు, సీతాకోకచిలుకలకు, పాములకు, పురుగులకు, పక్షులకు, చెట్లకు, నదులకు, సముద్రాలకు- ప్రత్యేకించి భగవద్గీత అక్కరలేదు. అవి కర్మయోగంలోనే ఉన్నాయి. ప్రకృతి మనకు గురువు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు- కాంతి సముద్రాలు. వాటి ప్రకాశమే జ్ఞానం. అక్కడ మనిషి పని చేసుకోవాలి. ఆ వెలుగులో ‘నేను’ మరిచిపోయి జీవనయాత్ర సాగించాలి.
ఆడుతూ పాడుతూ తనను మరిచి పనిచేస్తుంటే మనిషిని చూసి చీమలు, తేనెటీగలనేముంది- మొత్తం ప్రకృతి పరవశించిపోతుంది. ఖాళీ సమయాలు లేవు, పనిలోనే నాకు విశ్రాంతి అని మనిషి ప్రకటించిన రోజున- దైవం ఉద్దేశం నెరవేరుతుంది. విశ్వప్రణాళిక బలపడుతుంది!
– ఆనందసాయి స్వామి