Poojalu Enduku Cheyyali ?

పూజలు ఎందుకు చేయాలి ? 

36.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

పూజలు ఎందుకు చేయాలి ? 

పూజ ఎందుకు చేయాలి?
(Purpose of Prayer)

 

ప్రార్థన

ఉదయం నిద్రలేవగానే ఆ దైవాన్ని ఉద్దేశించి ‘భగవంతుడా, నాకు ఈరోజు అంతా శుభం జరగాలి. మమ్మల్ని చల్లగా చూడు’ అని ప్రార్థిస్తాం. మానవుడు వైజ్ఞానికంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాడు. అదంతా కేవలం తన తెలివితేటల ఫలితమే అనుకుంటాడు. కాని, దైవం అనుకూలించకపోతే అపజయం తప్పదు. మనకు ఏదన్నా ఆపదగాని, అపజయంగాని వాటిల్లే పరిస్థితి ఎదురైనప్పుడు అసంకల్పితంగా ‘దేవుడా, మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించు’ అనో, ‘మేం తలపెట్టిన కార్యంలో విజయం ప్రాప్తించేలా అనుగ్రహించు’ అనో వేడుకుంటాం. అదే ప్రార్థన.

అమృతత్వాన్ని కోరుకునే వ్యక్తి భగవంతుడితో అనుబంధాన్ని పెంచుకోవాలి. ప్రార్థన అంటే కేవలం మొక్కుబడిగా ఏదో శ్లోకాలు, స్తోత్రాలు వల్లించడం కాదు. నమ్మకంతో ప్రార్థించాలి. ‘మనకన్నా ఏదో ఒక ఉన్నతమైన శక్తిని నమ్మి, మన బాధ్యతను దానిమీద వదిలిపెట్టడమే ప్రార్థన’ అన్నారు. అలాగని మన ప్రయత్నం మానకూడదు.

ఇస్లాం మతంలో రోజుకు అయిదుసార్లు ప్రార్థన చేయాలంటారు. ఆదిమానవులు ప్రకృతిని దైవంగా భావించి చెట్టుకు, సృష్టికి, నదీమతల్లికి పూజలు చేసి తమను చల్లగా చూడమని ప్రార్థించేవారు. మునులు, రుషులు, మహాత్ములు వంటివారు స్వప్రయోజనం కోసం కాక సమాజ శ్రేయస్సు, లోక కల్యాణం కోసం ప్రార్థనలు చేసేవారు. ‘నాకు, మాకు’ అనే భావన వదిలిపెట్టి ‘అందరి కోసం’ ప్రార్థించడం ఉత్తమం. అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. ఏసుక్రీస్తు ‘ఓ తండ్రీ! వారిని క్షమించు. వారేం చేస్తున్నారో వారికి తెలియదు’ అని ప్రజలనుద్దేశించి చేసిన ప్రార్థన విశ్వవిఖ్యాతమైనది. ఇలాంటి ప్రార్థన మనిషిలో నిస్వార్థ బుద్ధిని పెంపుచేసి అంతర్గతంగాను, బాహ్యంగాను ప్రవర్తనలో సమన్వయం కలిగించి అహంకారాన్ని పటాపంచలు చేస్తుంది.
యజుర్వేదంలో ఒక చక్కని ప్రార్థన కనిపిస్తుంది.

‘మమ్మల్ని అసత్యం నుంచి సత్యానికి నడిపించు. చీకటి నుంచి వెలుతురులోకి నడిపించు. తమస్సులో నుంచి మమ్మల్ని జ్ఞానంలోకి నడిపించు. మృత్యువు నుంచి అమృతత్వంవైపు నడిపించు. ముల్లోకాలకు శాంతి కలుగుగాక!’
జ్ఞానాన్ని కోరి చేసే ప్రార్థన వేదాల్లో ఉంది. అదే అద్భుతమైన గాయత్రీ మంత్రం- ‘అన్నింటి వెలుగునిచ్చేవాణ్ని, ప్రకాశమానుల్లో అగ్రగణ్యుణ్ని మనం ధ్యానిద్దాం. ఆయన మన బుద్ధికి దారి చూపించుగాక!’

మొదట వ్యక్తిగతంగా స్వార్థంతో మనిషి తనకు అది కావాలి, ఇది కావాలి అని ప్రార్థిస్తాడు. రెండోస్థాయిలో తన కుటుంబంకోసం ప్రార్థిస్తాడు. ఆ తరవాత స్థాయిలో ఇంకా విశాల దృక్పథంతో తన బంధువులు, తెలిసిన వారందరి శ్రేయస్సుకోసం ప్రార్థిస్తాడు. ఇక నాలుగో స్థాయికి చెందినవారు కేవలం పరులకోసం ప్రార్థిస్తారు. వారే రుషులు, మునులు, మహాత్ములు.

ప్రార్థన మన నైతిక బాధ్యతను తెలియజేస్తుంది. చిన్నతనంనుంచే పిల్లలకు ప్రార్థనను అలవాటుచేయాలి. పెద్దవారు దేవుడికి నమస్కరించి పిల్లలచేత నమస్కారం చేయించడం చాలా ప్రాంతాల్లో చూస్తుంటాం. నారదుడు హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భంలోని ప్రహ్లాదుడి మనసులో భక్తిబీజాలు నాటడానికి హరిభక్తిని బోధించాడు. ఎవరికైనా చేసే ప్రార్థన మీద విశ్వాసం ఉన్నప్పుడే అది సఫలీకృతమవుతుంది. ఏదో చేశాం అన్నట్లు కాకుండా మనసారా ప్రార్థన చేయాలి. అది మనిషి వ్యక్తిత్వంలో మార్పు తేవాలి. మన నడవడిలో, సంబంధ బాంధవ్యాల్లో మార్పు రావాలి.

ప్రార్థన రెండు రకాలు. మానసికం, వాచికం. మనసు చేసేది మానసికం. నోటితో పలికేది వాచికం. నిత్యజీవితంలో ప్రార్థన తప్పనిసరై ప్రధానపాత్ర వహించాలి. అది మంచిని పెంచుతుంది. మనిషిని నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తిగా మలుస్తుంది. మనసును పవిత్రీకరిస్తుంది.

– వి.ఎస్‌.ఆర్‌.మౌళి .

————————————————————————————————————————————–

మన హిందువులకు ఉన్నంతమంది దేవుళ్ళు మరే మతం వాళ్ళకీ లేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గణపతి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు – ఇలా ఎందరో దేవుళ్ళు ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, వాయుదేవుడు, వరుణదేవుడు – ఇలా సృష్టి, స్థితి, లయలలో మనకు మేలు చేస్తున్న శక్తులు అన్నిటినీ అర్చిస్తున్నాం.

అంతెందుకు, ఇల్లు ఊడ్చే చీపురుకట్టను కూడా పరమ పవిత్రంగా భావిస్తాం. చీపురుకట్టను తొక్కితే పాపం వస్తుంది అని చెంపలు వేసుకోవడం మీరు గమనించే ఉంటారు. ఈ ఆచారం ఈనాటిది కాదు, వేదాల్లోనే ఉంది. ఈ లెక్కన మనకు వందమందో, వెయ్యిమందో కాదు, ఏకంగా ముక్కోటి దేవతలున్నారు.

ఇంతమంది దేవుళ్ళలో ఎవర్ని పూజించాలి, ఏ విధంగా పూజించాలి అంటే, ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన రూపాన్ని, నచ్చిన రీతిలో పూజిస్తారు. ఇంతకీ అసలు దేవుళ్ళకు రూపాలు ఉన్నాయా? తలమీద కొప్పు, మెడలో సర్పం ఉంటేనే శివుడా? విల్లు, బాణం ధరిస్తేనే రాముడా? – తరహాలో కొందరు ప్రశ్నలు సంధిస్తారు. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించమని తర్కించేవాళ్ళు కూడా ఉన్నారు.

ఇలాంటి వాదాలకు సమాధానం చెప్పడం కుదరదు. మనం ఆలోచిస్తాం. ఊహలు చేస్తాం. కలలు కంటాం. వాటన్నిటికీ ఆధారాలు చూపమంటే కుదురుతుందా? మనసులో ఉండే ఆనందం లేదా ఆందోళన గురించి మాటల్లో చెప్పగలం కానీ పట్టి చూపమంటే వీలవుతుందా? కనుక దేవుడూ అంతే. ఉన్నాడని నమ్మినవాళ్ళకి నిదర్శనాలు కనిపిస్తాయి. నమ్మకం లేనివారిని బలవంతంగా ఒప్పించాల్సిన పని లేదు.

దేవుణ్ణి నమ్మేవాళ్ళలో కూడా రెండు రకాలు ఉన్నారు. దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, ఆయనకు రూపం ఇవ్వడమేంటి అనేవారు కొందరు. దేవుడికి ఆకారమిచ్చి, పూజలు చేసేవారు కొందరు.

రూపం ఏదయితేనేం దేవుడి విగ్రహం ముందు కూర్చుంటే సుఖశాంతులు అనుభూతికి వస్తాయి. కాసేపు దేవాలయానికి వెళ్తే, మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. కష్టాలు, కలతలు మర్చిపోతాం. మనకు తెలీని ఒక అతీతమైన శక్తి కాపాడబోతున్నట్లు, అండగా ఉన్నట్లు అనిపించి ధైర్యంగా ఉంటుంది. కొండంత ఉపశమనం కలుగుతుంది.

ఈ అనంత విశ్వంలో అణువణువునా ఉన్న భగవంతునికి రూపం ఎందుకు అంటే, అది స్థిరత్వం కోసం. మనసును నిమగ్నం చేయడం కోసం. కొందరికి గణపతి ఆరాధ్యదైవం అయితే, మరికొందరికి హనుమంతుడు ఇష్టదైవం. ఎవరి నమ్మకం వారిది, ఎవరి పద్ధతి వారిది. ఏ ఆకృతీ లేకుండా, సృష్టిని నడిపిస్తున్న ఒక అతీత శక్తి ఉందని నమ్మి ప్రార్ధించేవారు చాలా తక్కువ. మనసులో ఏదో ఒక రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధించేవారే అధికశాతం.

రాముడు, కృష్ణుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి – ఈ దేవుళ్ళ రూపాలు మన పూజామందిరంలోనే కాదు, గుండె గుడిలోనూ ప్రతిష్టించుకున్నాం. ఆ రూపాన్ని అర్చిస్తున్నప్పుడు మనసు అక్కడ నిమగ్నమౌతుంది. ఆ కాసేపూ ఇతర ఆలోచనలు లేకుండా దేవునిమీద కేంద్రీకృతం అవుతుంది. అందుకే దేవుని సాకారంగా పూజిస్తాం.

#Hindu Gods and prayer, #Purpose of Prayer, #Peace with prayer, #great and graceful god, #prayer is equal to meditation