Sri Varalakshmi Vratam

శ్రీ వరలక్ష్మి వ్రతం (Set of 10 Books)

20.00

Share Now

Description

Sri Varalakshmi Vratam

శ్రీ వరలక్ష్మి వ్రతం

లక్షణ శక్తి
సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది. సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల, నీటిలో రసత్వం…వంటివి. వీటితో పాటు కంటి చూపు, చెవి వినికిడి- ఇలా ఉన్న లక్షణాలే ఆయా అంశాలకు శక్తులు. ఈ లక్షణాల్ని ఏ ఒక్కరూ కృత్రిమంగా సృష్టించలేరు. ఇవన్నీ ప్రాకృతిక శక్తులు!
పరమేశ్వరుడి నుంచి వ్యక్తమయ్యే శక్తి విశేషాలే ఇవి- అని భక్తులు విశ్వసిస్తారు. నిజానికి ఈ లక్షణ శక్తులే అసలైన ఐశ్వర్యాలు. ఈ ఐశ్వర్య రూపాలైన లక్షణ శక్తుల సమాహార స్వరూపమే ‘లక్ష్మీదేవి’.
సనాతన ధర్మంలోని ఈ లక్ష్మీభావన- ప్రకృతి రూపంలో గోచరించే పరమాత్మ విభూతిగా ఆరాధన అందుకుంటోంది. విజ్ఞులు మరో కోణంలో- శాస్త్రపరంగా గల అర్థాన్ని వివరించారు. జగతిలో అణువు మొదలు బ్రహ్మాండం వరకు గల అన్నింటినీ లక్షిస్తూ (గమనిస్తూ), ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఇవ్వాలో నిర్ణయించి అనుగ్రహించే శక్తినే వారు ‘లక్ష్మి’గా నిర్వచించారు.
ఈ శక్తికే ‘శ్రీ’ (సిరి) అని మరొక పేరుంది. ఇదే నామాన్ని శాస్త్రాలు ఒక మహామంత్రంగా భావిస్తున్నాయి. సృష్టి స్థితి లయలను నిర్వహించే పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తినే ‘శ్రీ’ అంటారు. ఈ ఆశ్రయం అత్యంత ప్రత్యేకం. ఇది సూర్యుణ్ని ఆశ్రయించిన కాంతి, చంద్రుణ్ని ఆశ్రయించిన చంద్రిక వంటిది. భగవంతుణ్ని ఎన్నడూ ఎడబాయని ఆయన చిచ్ఛక్తి(చిత్‌, శక్తి)నే ‘శ్రీ’గా పరిగణిస్తారు. ఆ శక్తే మానవాళి పాలిట ఆశ్రయం!
మానవాళికి ఆధారమయ్యే శక్తి, పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తి… ‘శ్రీ’. ‘లక్షణశక్తి’యే ఈ ‘శ్రీ’! ఈ శబ్దానికి నిఘంటుపరంగా శోభ, కాంతి, కళ, జ్ఞానం, విద్య అని అర్థాలున్నాయి. ఈ అర్థాలన్నింటి ఏకరూపమే శ్రీలక్ష్మి. ప్రతివారూ భక్తిపూర్వకంగా కోరుకొనేది ఈ లక్ష్మినే! ‘వరం’ అనే మాటకు ‘కోరుకొనేది’ అని అర్థం. అందుకే ఈ తల్లిని ‘వరలక్ష్మి’గా పిలుస్తారు.
విష్ణుపురాణ కథనం ప్రకారం- జగత్కారకుడైన పరమాత్మే శ్రీమహావిష్ణువు. భృగు ప్రజాపతి తపస్సు ఫలితంగా సంతానంగా పొందిన పరాశక్తి లక్ష్మి. ఆమె విష్ణువును వివాహమాడింది. ఈ తల్లి నిత్య, అనంత, ఆదిలక్ష్మి. నారాయణుడి వద్ద స్వాభావిక శక్తిగా గల ఈ మహాలక్ష్మిని- ఆయా లోకాల జీవుల యోగ్యతను అనుసరించి ‘విష్ణు కృపామూర్తి’గా వివిధ రూపాల్లో వ్యవహరిస్తారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, ధనలక్ష్మి, గృహలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి- ఇలా పలు అభివ్యక్తులతో అలరారుతుంది అమ్మ. ధనధాన్యాదులే జీవులు కోరే వరమైన అవసరాలు. ఈ సమస్త లక్ష్ముల ఏక స్వరూపమే ‘వర’లక్ష్మి!
భృగు ప్రజాపతి ప్రాధాన్యం కలిగిన ‘భృగు’(శుక్ర)వారంనాడు, ప్రతి మాసంలోనూ లక్ష్మి ఆరాధనను శాస్త్రం నిర్దేశించింది. మాసాల్లో ‘ఆర్ద్రత’కు ప్రధానమైన వర్షరుతువు మొదటి మాసమే శ్రావణం. అందులో వృద్ధిచెందే చంద్రకళకు నెలవైన శుక్లపక్షం, శుక్రవారం అత్యంత ప్రధానమైనవని ధార్మిక గ్రంథాలు ప్రస్తావించాయి. ‘ఆర్ద్రాం పుష్కరిణీం…’ అని శ్రీసూక్తం వర్ణించిన ‘ఆర్ద్ర’శక్తి- శాంతికి, పంటకు, ఐశ్వర్యానికి సంకేతం. శ్రావణం లక్ష్మీదేవికి ప్రధానమైంది.
స్త్రీలో లక్ష్మీకళ ఉందని ‘దేవీ భాగవతం’ వంటి పురాణ వాంగ్మయం చెబుతుంది. అందుకే ‘స్త్రీలను గౌరవించడం భారతీయుల ధర్మం’ అని రుషులు అనుశాసించారు. స్త్రీమూర్తులు లక్ష్మీకళతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని ఆరాధించే పర్వమే- శ్రావణ శుద్ధ శుక్రవారం.
సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ, సంపదల సాకారమే మహాలక్ష్మి. దేవిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావనా కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ప్రకాశించాలని విజ్ఞులు ప్రబోధించారు.
వరలక్ష్మి వ్రతకథలో- సిద్ధి పొందిన కథానాయిక చారుమతి. మంచి మతి (బుద్ధి) మాత్రమే దేవీకృపకు పాత్రమవుతుంది అని మానవాళికి ఆ పాత్ర సంకేతమిస్తుంది. సంపదల్ని అడిగే ముందు ‘చారు’ (చక్కని) మతి కలిగి ఉండాలన్నదే దాని అంతరార్థం. ఆ సందేశం అర్థమైతే- వ్యక్తికి, సమాజానికి సౌభాగ్యప్రదం!       – సామవేదం షణ్ముఖశర్మ

 

వరలక్ష్మి వత్రానికి కావల్సిన సామాగ్రి
శ్రావణమాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం. కాబట్టి ఆయన సతి లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం. అందుకే…. కోరిన వరాలు అందించే అ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ.. ఆ రోజు కుదరకపోతే, శ్రావణమాసంలోని ఇతర శుక్రవారాలనాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావల్సిన పూజాసామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందామా!
పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి….
– వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఆకుచపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటూఇటూ ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం.
– రాగి లేదా వెండి కలశం. కలశపూజ కోసం.
– రెండు కొబ్బరికాయలు. ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు.
– రెండు జాకెటు ముక్కలు. ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయినంగా ఇచ్చేందుకు. ముత్తయిదువులకు కూడా జాకెట్టు ముక్కలని వాయినంగా ఇవ్వాలనుకునేవారు, తమ శక్తికొలది జాకెట్లు ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి.
– రెండు పీటలు. ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు. రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు.
– అరకిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి… దాని మీద కలశాన్ని నిలపాలి.
– అరకిలో శనగలు. అమ్మవారికీ, ముత్తయిదువులకూ పంచేందుకు. వీటిని ముందురోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి.
– యాలుకలు, మిరియాలు. అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి యాలుకలు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది.
– పెసరపప్పు. అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే! ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా… ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు.
– విడిపూలు. అమ్మవారిని అయిదురకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు.. ఐదురకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి.
– రెండు పూలమాలలు. అమ్మవారి కలశానికీ, చిత్రపటానికీ వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపురంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది.
– ముగ్గువేయడానికి కాస్త బియ్యపు పిండి.
– అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు… అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపుకుంకుమలు.
– రెండు డజన్ల గాజులు. అమ్మవారికి, ముత్తయిదువులకు వాయినం ఇవ్వడానికి.
– చీర. అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు!
– గంధము. అమ్మవారి పటానికి, ముత్తయిదువులకు పూసేందుకు.
– మూడు డజన్ల తమలపాకులు. అమ్మవారికీ, కలశానికీ, ముత్తయిదువులకూ మూడేసి తమలపాకుల చొప్పున దక్షిణ అందించేందుకు.
– రెండు డజన్ల చొప్పున అరటిపళ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు. ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావల్సినవి.
– మామిడి ఆకులు. ఇంటికి తోరణాలుగా కట్టేందుకు. పూజాగదిని అలంకరించేందుకు. కలశంలో ఉంచేందుకు కావల్సినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి.
– పంచామృతం చేయడం కోసం…. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార.
– అమ్మవారికి నివేదించేందుకు మన శక్తికొలదీ పిండివంటలు.
– తోరపూజ సమయంలో అమ్మవారికీ, మనకి, కనీసం ముగ్గురు ముత్తయిదువులకు కట్టేందుకు ఐదు దారపు పోగులు.
ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి…
– అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు.
– దీపారాధన చేయడానికి వత్తులు. అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి వత్తులతో పాటుగా తామర వత్తులని కూడా కలిపి వెలిగిస్తే మంచిది.
– ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరణి. చిన్న పళ్లెం.
– హారతి ఇవ్వడానికి హారతిపళ్లెం, ముద్దకర్పూరం.
– నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట.
ఇక వీటితో పాటుగా అక్షతలు, అగరవొత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ఎలాగూ తప్పనిసరిగా మనవద్దనే ఉంటాయి కదా

#వరలక్ష్మి_వ్రతం-#Varalakshmi_Vratam

PDF Link
https://archive.org/details/SriVaralakshmiVratam

వీటిని పూజిస్తే 
లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది
వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోమం లేకపోవచ్చు. విలాసంగా జీవించాలన్న ఆశ లేకపోవచ్చు. కానీ ఈ లోకంలో జీవించాలంటే… పొద్దున లేచిన దగ్గర నుంచీ డబ్బుతోనే పని. మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే! అందుకోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారు పెద్దలు. మీరూ ప్రయత్నించి చూడండి…
శ్రీఫలం
పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి… ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా! ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారు.
శ్రీసూక్తం
అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడూ మోగుతుండేలా చూసినా శుభప్రదమే!
శ్రీచక్రం
తంత్రవిద్యలో శ్రీచక్రం/ శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకూ చిహ్నమని చెబుతారు. అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒకో మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే ‘మేరు ప్రస్తారం’ అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీయంత్రాన్ని కానీ పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం.
తామరపూలు
లక్ష్మీదేవి సముద్రమధనంలో ఆవిర్భవించిందని కదా పురాణాలు చెబుతున్నాయి! అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామరగింజలతో పూజిస్తే మంచిదని అంటారు. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ, లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందన్నది పండితుల మాట. తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసినా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించినా శుభప్రదమే!
నేతిదీపాలు
చీకటిని అజ్ఞానానికీ, దారిద్ర్యానికీ, నిరాశకీ చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం. ఇక నేతితో చేసిన దీపం పాడిపంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెన్నను చిలికినట్లుగా, జీవితమనే మధనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి.


శ్రీ మహాగణాధిపతయే నమః
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

పూజ ప్రారంభం
దీపం వెలిగించి ఈ క్రింది కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి.
ఓం కేశవాయస్వహా
ఓం నారాయణస్వాహా
ఓం మాధవాయస్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హౄషికేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమికారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే !!
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయాలి.
ప్రాణాయామమ్యః ::- ఓంభూః – ఓం భువః – ఓం సువః – ఓం మహః – ఓం జనః – ఓం తపః
ఓగ్ ఒ సత్యం – ఓం తత్ నవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధీయోయోనః ప్రచోదయాత్ -ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం॥ అని సంకల్పము చెప్పుకోవాలి.
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శుభే శోభనముహుర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో ర్దక్షణదిగ్భాంగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృఇష్ణా గోదావరి మధ్యప్రదేశే,శోభనగౄహే(అద్దె ఇల్లు అయినచో ,వసతి గ్రుహే అనియు,సొంత ఇల్లైనచో స్వగౄహే అనియు చెప్పుకొనవలెను ) సమస్తదేవతాభ్రాహ్మణ హరిహర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్ర మానేన……సంవత్సరే,(ఇక్కడ తెలుగు సంవత్సరము అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలిను), దక్షిణాయనే, వర్షఋతుః,(వసంత,గీస్మ,వర్ష మొదలగు ఋతువులలో పూజసమయంలో జరుగుచున్న ఋతువుపేరు.) శ్రావణమాసే, …పక్షే,(నెలకురెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్లపక్షము, అమవాస్యకుముందు కృష్ణపక్షములు,వీటిలో పూజ జరుగుతున్న సమయమున గల పక్షము పేరు) ….తిథౌ,(ఆ రోజు తిథి) …వాసరే,(ఆరోజు ఏవారమైనదీ చెప్పుకొని) శుభ నక్షత్రే, శుభయోగే, శుభ కరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమౌపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య,శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమతి, గోత్రవతి, నామధేయవతి, శ్రీమత్యాః, గోత్రవత్యాః, నామధేయవత్యాః, (అని పూజ చేయువారి గోత్రము,నామము చెప్పి) మమ సహకుటుంబస్య,క్షేమ,స్థైర్య , వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివౄధ్యార్థం, పుత్రపౌత్రాభివౄధ్యార్థం, మమధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ ఫలపురుషార్థం, సర్వ్వాభీష్ట సిధ్యర్థం శ్రీవరలక్ష్మీ దేవతా ముద్దస్య వరలక్ష్మీ దేవతా ప్రీతార్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడోపచార పూజాం కరిష్యే .తద్ధంగ కలశపూజాం కరిష్యే.
కలశ పూజ
వెండి,రాగి,లేక కంచు గ్లాసులు లేదా పంచపాత్ర,రెండింటిలో శుద్ధ జలము తీసుకొని ఒక దానియందు ఉద్దారిణి,రెండవదానియందు అక్షంతలు, తమలపాకు, పువ్వు ఉంచుకోవాలి. రెండవ పాత్రకు బయట 3 వైపులా ఉంగరపు వేలుతో గంధం పూసి కుంకుమను పెట్టవలెను. తర్వాత ఆ కలశాన్ని కుడిచేతితో మూసివుంచి,ఇలా అనుకోవాలి.
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
గ్లాసులో నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద చల్లండి
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగ తో పివా
యస్స్మరేత్పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరశ్శుచిః
అని కొద్దిగ అక్షంతలు,కుంకుమ,పసుపు వరలక్ష్మీదేవిపైవేసి,ఆమెను తాకి నమస్కరించాలి.
ధ్యానమ్
పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే
నారాయణప్రియే దేవి సుప్రితాభవసర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరాభవమేగేహే సురాసుర నమస్కౄతే
… అని ఆదేవిని మనస్పూర్తిగా ధ్యానించాలి.
ఆవాహనం
సర్వమంగళ మాంగల్యే విష్ణువక్షఃస్థలాలయే
ఆవాహయామిదేవి త్వాం సుప్రీతాభవసర్వదా
శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆవాహయామి
(అని దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించి నమస్కరించాలి.)
ఆసనం
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభుషితే
సింహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే
శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆసనం సమర్పయామి
(కుర్చోమన్నట్లు ఆసనం చూపి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు దేవిపై చల్లవలెను)
పాద్యం
సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం,
పాద్యం గృహాణదేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీవరలక్ష్మీదేవతాం పాద్యం సమర్పయామి
(అని కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లు భావించి ఉద్దరిణితో పంచపాత్రలోని జలమును వరలక్మీదేవిపై చల్లి,రెండు చుక్కల జలము వేరొక పాత్రలోనికి వదలవలెను)
అర్ఘ్యం
శుద్ధోదకంచ పాత్ర స్థంగంధ పుష్పాది మిశ్రితం,
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే
శ్రీవరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి
(అని చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లు భావిస్తూ పంచపాత్ర లోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి,అర్ఘ్యంపాత్రలో రెండుచుక్కలు వదలవలెను)
ఆచమనీయం
సువర్ణ కలశానీతం చందనాగరు సమ్యుతం,
గృహాణచమనందేవిమయాదత్తం శుభప్రదే
వరలక్ష్నీదేవతాం ఆచమనీయం సమర్పయామి
(అని ముఖము శుభ్రము చేసుకొనుటకు నీరు ఇచ్చునట్లు భావిస్తూ జలమును వేరొక పాత్రలోనికి వదలవలెను.)
పంచామృత స్నానం
పయోదధీఘృతోపేతం శర్కరా మధుసంయుతం,
పంచామృతస్నాన మిదం గృహాణ కమలాలయే
శ్రీవరలక్ష్మీదేవతాం పంచామృతస్నానం సమర్పయామి
(అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చినట్లు భావించి, ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్దరిణితో చల్లవలెను.)
శుద్ధోదకస్నానం
గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం,
శుద్దోదకమిదంస్నానం గృహాణవిధుసోదరీ
శ్రీ వరలక్ష్మీదేవతాం శుద్ధోదకస్నానం సమర్పయామి
(అని పంచపాత్రలోని శుద్ధమైన నీటినిపువ్వుతో దేవిపై చల్లవలెను.)
వస్త్ర యుగ్మం
సురార్చితాం ఘ్రియుగళే దుకూలవసనప్రియే,
వస్త్ర్యుగ్మం ప్రదాస్యామి గృహాణ హరి వల్లభే
శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి
(పట్టులేదాశక్తికి తగిన వస్త్రమును దేవికీస్తున్నట్లుగాతలచి పత్తితో చేసుకొన్న వస్త్రయుగ్మమును (ప్రత్తిని గుండ్రని బిళ్ళగాచేసి తడిచేత్తో పసుపు,కుంకుమ,తీసుకొనిరెండువైపులాద్ది రెండు తయారుచేసుకోవాలి.)శ్రీవరలక్ష్మీదేవికి కలశంపై ఎడమవైపువేయవలెను.
ఆభరణము
కేయూరకంకణా దేవీ హారనూపుర మేఖలాః
విభూషణా న్య మూల్యాని గృహాణ ఋషిపూజితే
(శ్రీవరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి.బంగారముకాని,వెండికాని, మీ శక్తానుసారం దేవికి ఆభరణం సమర్పించుకోవాలి లేదా అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి.)
ఉపవీతం
తప్త హేమకృతం దేవీ మాంగల్యం మంగళప్రదం,
మయాసమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే
శ్రీవరలక్ష్మీదేవతాం ఉపవీతం సమర్పయామి
(అని పత్తిని 3లేదా 4 అంగుళములు పొడవుగా మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన యగ్నోపవీతమును దేవికి సమర్పించుకోవాలి)
గంధం
అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్,
హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతా మబ్ది పుత్రికే
శ్రీవరలక్ష్మీదేవతాం అక్షతాన్ సమర్పయామి.
(అని అక్షతలు దేవిపై చల్లవలెను.)
పుష్పపూజ
మల్లికాజాజికుసుమైశ్చంపకైర్వకుళైస్తధా,
నీలోత్పలైఃశ్చలళారైఃపూజయామి హరిప్రియే
శ్రీవరలక్ష్మీదేవతాం పుష్పైః పూజయామి
(అని అన్నిరకములపూవులతో దేవిని పూజించవలెను.)
ఈ శోడశోపచార పూర్తి అయినతరువాత అధాంగ పూజ చేయవలెను.
అధాంగపూజ – కుడిచేతిలోనికి అక్షంతలు తీసుకొనిక్రిందనామములను చదువుతూ అక్షతలను దేవిపైచల్లవలెను.
పసుపు,లేదా కుంకుమతోనైనను పూజించవచ్చును.
చంచలాయై నమః — పాదౌ పూజయామి
చపలాయై నమః — జానునీ పూజయామి
పీతాంబరాయై నమః — ఊరూం పూజయామి
కమలవాసిన్యైనమః — కటిం పూజయామి
పద్మాలయాయైనమః — నాభిం పూజయామి
మదనమాత్రే నమః — స్తనౌ పూజయామి
కంబుకంఠ్యై నమః — కంఠం పూజయామి
సుముఖాయై నమః — ముఖం పూజయామి
లలితాయైనమః — భుజద్వయం పూజయామి
శ్రియైనమః —ఓస్ఠౌ పూజయామి
సునాసికాయైనమః — నాసికాః పూజయామి
సునేత్రాయై నమః — నేత్రౌ పూజయామి
రమాయైనమః — కర్ణౌ పూజయామి
కమలాయైనమః — శిరః పూజయామి
శ్రీవరలక్ష్మై నమః — సర్వాణ్యంగాని పూజయామి

శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
ప్రతినామమునకు ముందు ఓం అని,చివరకు నమః అని చేర్చుకొని చెప్పవలెను
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)
ఓం వరలక్ష్మీ దేవతాయైనమః అష్టోత్తర శతనామపూజాం సమర్పయామి
(అని పూలు అమ్మవారి పాదాలముందు వుంచి నమస్కారంచేసుకోవాలి)
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం
ధూపం దాస్యామి దేవేశే గృహాణ కమలప్రియే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి
(అని రెండు అగరువత్తులను తీసుకొని వెలిగించి ధూపమును దేవికి చూపించవలెను)
దీపం
ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితా భవ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి
(అని వెలుగుతున్న దీపమును దేవికి చూపవలెను.)
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
… అంటూ ఆచమనం చేయాలి.
నైవేద్యం
నైవేద్యం షడ్రషోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
(అని దేవికి ప్రత్యేకంగా చేసిన రకరకాల పిండివంటలు,పాయసం,పానకం, వడపప్పు, మరియు మహా నైవేద్యం కొరకు చేసిన అన్నం,పప్పు,నెయ్యి,కూరలు,మొదలైనవి అమ్మవద్దపెట్టి నైవేద్యం చేయాలి.)
నైవేద్యం పై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమచేత్తో,గంటవాయిస్తూ…
‘ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓం స్రీవరలక్ష్మీదేవతాయైనమః నైవేద్యం సమర్పయామీ
…అంటూ ఆరుమార్లు ఉద్దరిణితో దేవికి నివేదనం చూపించాలి.
నైవేద్యానంతరం…
హస్తౌ ప్రక్షాళయామీ (అని ఉద్దరిణెతో అర్ఘ్యం వదలాలి), పాదౌ పేక్షాళయామీ (అని మరో సారి నీరు అర్ఘ్యం పాత్రలో ఉద్దరిణెతో నీరు వదలాలి), పునః శుద్దాచమనీయం సమర్పయామి (అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి)
పానీయం
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి
(అని భోజనానంతరం నీళ్ళు ఇచ్చినట్లు భావించి కుడిచేత్తో నీటిని చూపుతూ ఎడమచేత్తో గంటవాయించవలెను.)
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి
(అని తమలపాకు,వక్క,సున్నం సుగంధాలతో తాంబూలం ఇవ్వాలి)
ఆ తరువాత….
శుధ ఆచమనీయం సమర్పయామి
(అంటూ ఉద్దరిణితో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి)
నీరాజనం
నీరాజనం సమానీతం కర్పూరెణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నీరాజనం సమర్పయామి
(అంటూ కర్పూరము వెలిగించి దేవికి హారతి ఇవ్వవలెను. తరువాత కర్పూర హారతి ఒక పక్కన పెట్టి ఒక చుక్క పంచపాత్రలోని నీరు హారతి పల్లెంలో వేయవలెను.)
మంత్రపుష్పం
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి
(అని కొన్ని పూలు, అక్షతలు తీసుకొని లేచి నిలబడి నమస్కరించి ఈ పూవులు, అక్షంతలు దేవిపై వేసి కూర్చోవలెను.)
ప్రదక్షణ
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణంమమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి.
(అని చదువుతూ ఆత్మప్రదక్షిణ చేసుకోవాలి)
నమస్కారం
నమస్తే లోక్యజననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నమస్కారాన్ సమర్పయామి
(అని మనస్పూర్తిగా దేవికి నమస్కరించవలెను.పిమ్మట చేసిఉంచుకొన్న తోరములను ఒక పళ్ళెములో పెట్టి పసుపు,కుంకుమ,అక్షతలతో పూజించవలెను. 9 వరసలు 9 ముడులు కలిగిన తోరమును 9 నామములతో పూజిస్తారు.
తోరపూజ:
తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింద విధముగా పూజించవలెను.
ఓం కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి
ఓం రమాయైనమః ద్వితీయగ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి
ఓం విశ్వజనన్యైనమః చతుర్థగ్రంథిం పూజయామి
ఓం మహాలక్ష్మీనమః పంచమగ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్ధితనయాయైనమః షష్టమగ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్షిణ్యైనమః సప్తమగ్రంథిం పూజయామి
ఓం చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి
ఓం శ్రీవరలక్ష్మీయైనమః నవమగ్రంథిం పూజయామి
… ఈ క్రింది శ్లోకములు చదువుతూ తోరము కట్టుకొనవలెను.
బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
(అన్న శ్లోకాన్ని చదువుతూ తోరం కట్టుకోవాలి)
వాయనం
వాయనమిచ్చునపుడు, ఈ క్రింది శ్లోకమును చదువుచు ఇవ్వవలెను.
ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదహాపూపం వాయనం హిద్విజాతయే
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ
ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమోనమః
శ్రీవరలక్ష్మీదేవతాయైనమః వాయనదానం సమర్పయామి.
(అని అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్టు, చీర, గాజులు, శనగలు, పూర్ణంబూరె/ కుడుములు ఉన్న వాయనం ఇవ్వాలి)
శ్రీ వరలక్ష్మీ వ్రత కధ
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను. శ్రద్ధగావినవలసిందన్నాడు.
పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు, నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటుకు తగిన వ్రతమునొకదానిని ఆనతీయవలసినదని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవీ! నీవు కోరిన విదముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది, అది వరలక్ష్మీ వ్రతం, దాని విధివిధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందువచ్చు శుక్రవారంనాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి దేవా! ఈ వరలక్ష్మీవ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని పార్వతి అడిగినది.
కాత్యాయనీ! ఈ వరలక్ష్మీవ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణమొకటుండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మీవ్రతానికి ఆది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి! నీ యందు అనుగ్రహము కలిగినదానను, ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదనని చెప్పి అంతర్ధానమయ్యెను.
చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగినవారు ధన్యులు, వారు సంపన్నులుగా, విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావనీ! నా పూర్వజన్మసుకృతమువలన నీ పాద దర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించినది. చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించినవారై చారుమతిని వరలక్ష్మీవ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి, గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరు చారుమతి గృహానికి చేరుకొన్నారు.
ఆమె గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటుచేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో “సర్వమంగలమాంగళ్యేశివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అని ఆహ్వానించి ప్రతిష్టించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య,భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేసారు.
మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణచేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మివ్రతం ఫలితంగా ఇతర స్త్రీలయొక్క ఇళ్ళు ధన, కనక, వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ళనుండి గజతురగ రధ వాహనములు వచ్చి వారిని ఇళ్ళకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీవ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకలసౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు.
మునులారా! మహర్షులారా! మముక్షువులారా! శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీవ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూతమహర్షి.
ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
వరలక్ష్మి వ్రతంలో 
తోరం ఎలా కట్టుకోవాలి!
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాణ్ని ధరించే సంప్రదాయం గురించి తెలిసిందే! ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు? దీన్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకుందామా?
అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకు దారితీసిందని నమ్మేవారూ ఉన్నారు.
వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తయిదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు… నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట!
ఈ నవసూత్రాన్ని తయారుచేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒకో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి.
ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథిపూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒకో ముడినీ అక్షతలతో కానీ, పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథిపూజ. ఇందుకోసం ఒకో ముడినీ పూజిస్తూ ఒకో మంత్రం చదవాలి.
ఓం కమలాయై నమ: ప్రథమగ్రంథిం పూజయామి
ఓం రమాయై నమ: ద్వితీయ గ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమ: తృతీయ గ్రంథిం పూజయామి
ఓం విశ్వజనన్యై నమ: చతుర్థ గ్రంథిం పూజయామి
ఓం మహాల క్ష్మైనమ: పంచమ గ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్దితనయామై నమ: షష్టి గ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్షిణ్యై నమ: సప్తమ గ్రంథిం పూజయామి
ఓం చంద్రోసహోదర్యై నమ: అష్టమ గ్రంథిం పూజయామి
ఓం హరివల్లభాయై నమ: నవమ గ్రంథిం పూజయామి
ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత…
‘బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాధివృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే’
అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి.
పై శ్లోకంలో దక్షిణేహస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడిచేతికే ధరించాలన్నమాట. అంతేకాదు! చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు. కానీ తోరాన్ని కనీసం ఒకరాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుందని నమ్ముతారు.