Description
సత్యనారాయణవ్రతం
సత్యదేవ వైభవం
తెలుగునాట శుభకార్యాల సందర్భంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం పరిపాటి. ‘ధర్మయుతమైన ఆకాంక్షల సాధనకు, జీవన గమనంలో ఎదురయ్యే అడ్డంకుల్ని ధైర్యంగా అధిగమించడానికి, కర్తవ్య దీక్షలో విజయవంతంగా, ముందుకు సాగడానికి సత్యదేవ వ్రతం సర్వోన్నతమైనది’ అని శ్రీ మహావిష్ణువు, నారద మహర్షికి ఉపదేశించినట్లు ప్రతీతి. ఈ వ్రతాచరణ విధివిధానాల్ని శ్రీమన్నారాయణుడే వివరించాడంటారు.
స్కాందపురాణంలో అన్నవర క్షేత్ర వైభవం, సత్యనారాయణుడి అవతార మూర్తిమత్వ ప్రాభవం, సత్యదేవ వ్రత వైశిష్ట్యాలు సవివరంగా ఉన్నాయి. అన్నవరంలో వెలసిన సత్యనారాయణుడికి ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా స్మార్త ఆగమ విధాన పూర్వకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వైశాఖశుద్ధ ఏకాదశినాడు స్వామివారి కల్యాణోత్సవాన్ని కమనీయంగా, రమణీయంగా నిర్వహిస్తారు.
అనంత వరాల పెన్నిధి- అన్నవరం సన్నిధి. సత్యశివ సుందర స్వరూపుడైన, అపురూప తేజోమయుడైన పరమాత్మ దశావతారాలకు అతీతంగా లోకోద్ధరణే లక్ష్యంగా మరెన్నో రూపాల్ని ధరించాడు. విష్ణుమాయావిలాసంలో ఎన్నో పార్శ్వాలు ప్రకటితమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే సత్యనారాయణుడి దివ్యమంగళాకృతి. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లోగిలిలో నెలకొని ఉండటం అన్నవర క్షేత్ర ప్రత్యేకత.
హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడై అనంతలక్ష్మీ సత్యవతీ రమాదేవి సమేతుడై పంపానదీ తీరాన రత్నగిరిపై సత్యమూర్తి సత్వస్ఫూర్తిగా విరాజిల్లుతున్నాడు. భూలోకంలో నారాయణ తత్త్వాన్ని ప్రచారం చేయడానికి విచ్చేసిన నారదుడు, రత్నగిరిపై నారాయణ మహామంత్రాన్ని జపించి, ఎంతోకాలం ఇక్కడే తపమాచరించాడంటారు. తన తపోశక్తిని, నారాయణ మంత్ర ఫలితాన్ని రత్నగిరిలో నిక్షిప్తంచేసి, ఈ గిరిపై కలియుగ సత్య స్వరూపుడిగా నారాయణుడు అవతరించాలని సంకల్పించాడంటారు. నారదుడి అభీష్టం మేరకు బ్రహ్మ, మహేశ్వరుల మేలు కలయికతో నారాయణుడు సత్యనారాయణమూర్తిగా ఈ గిరిపై సాకారమయ్యాడని చెబుతారు.
మరో కథనం ప్రకారం- భద్రుడు, రత్నాకరుడు అనే సోదరులు విష్ణువు కోసం తపస్సు చేస్తారు. శ్రీహరి దివ్యానుగ్రహంతో భద్రుడు భద్రగిరిగా, రత్నాకరుడు రత్నగిరిగా రూపాల్ని ధరిస్తారు. ఆ శరీరంలో శిలాకృతితో భద్రగిరి శ్రీరాముణ్ని, రత్నగిరి సత్యనారాయణుణ్ని తమ శిరస్సులపై మోసే భాగ్యాన్ని అందుకున్నారనేది మరో గాథ. గర్భాలయంలో సత్యనారాయణ మూర్తికి ఎడమవైపు అనంతలక్ష్మీ సత్యవతీదేవి, కుడివైపు మహేశ్వరుడు, మహిమాన్విత యంత్రరూపంలో బ్రహ్మ కొలువై ఉంటారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్టులకు దిగువన మహా వైకుంఠ నారాయణ యంత్రం సువ్యవస్థితమై ఉంటుంది. ఈ యంత్రం ఇరవైనాలుగు వృత్తాలతో, బీజాక్షరాలతో, గాయత్రీ మంత్రం, నారాయణ సూక్తాలతో పరివేష్టితమై రూపుదాల్చింది. అన్నవర క్షేత్రం విష్ణు పంచాయతన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆదిత్యుడు, గణపతి, అంబిక, ఈశ్వరుడు విగ్రహాకృతుల మధ్యలో పదమూడు అడుగుల మహా చైతన్యమూర్తిగా సత్యదేవుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయం రాధాకృతిలో, పంచవిమాన గోపురాలతో పరమ పునీతంగా పరిఢవిల్లుతోంది.
సత్యనారాయణ వ్రతంలో, వ్రతాచరణలో ప్రసాదానికి ప్రత్యేక స్థానం ఉంది. గోధుమ నూక, బెల్లం, ఆవునెయ్యి, సుగంధ ద్రవ్యాలు కలిపి తయారుచేసే ఈ పవిత్రమైన ప్రసాదాన్ని ‘సుపాద’గా పేర్కొంటారు. త్రిమూర్తుల శక్తి ఏకోన్ముఖంగా ప్రకటితమైన దివ్యక్షేత్రం అన్నవరం. నారదుడి తపస్సు, రత్నాకరుడి యశస్సు, శ్రీమన్నారాయణుడి తేజస్సు సమ్మిళితమై రాశీభూతమైన, రమ్యమోహనమైన, పావనకరమైన సన్నిధానం- అన్నవరం క్షేత్రం!
– డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
Dr. Kavuri Rajesh Patel