Description
లక్ష్మీ – గౌరీ నిత్య పూజ
అనేక రూపాల వరలక్ష్మి
జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం- ఈ మూడూ ప్రతివారూ కోరుకొనేవి, కోరదగినవి. ఈ ‘కోరదగిన’ విషయాలను ‘వరం’ అంటారు. ఈ మూడింటి స్వరూపమైన దేవతాశక్తి ‘వరలక్ష్మి’. జన్మను చరితార్థంచేసే జ్ఞాన ఐశ్వర్య ఆనందాలకంటే గొప్ప వరాలు ఏముంటాయి? కాంతి స్వరూపుడైన సూర్యుడు కాంతిని ప్రసాదించినట్లుగా, వీటి స్వరూపమైన వరలక్ష్మి ఈ వరాలు అనుగ్రహిస్తుందని ఆర్షభావన.
ఈ వరాల్లో మొదటిది ‘జ్ఞానం’. ఇది ప్రథమమే కాక ప్రధానం కూడా. జ్ఞానం కలిగి ఉంటే అన్నింటినీ సాధించగలం. అందుకే తెలివైన భక్తుడు జ్ఞానాన్నే వరంగా కోరుకుంటాడు. సనాతన ధర్మచింతనలో లక్ష్మీస్వరూపం ఒక అద్భుతం. పవిత్రత, స్వచ్ఛత, సంతోషం, సౌశీల్యం, ఉపకార స్వభావం, సౌందర్యం- వీటన్నింటి సమాహార స్వరూపమే మహాలక్ష్మి.
పురాణాగమాది శాస్త్రాలు- పరిశుభ్రమైన పరిసరాల్లో, శుద్ధమైన శరీరంలో, పవిత్రమైన అంతఃకరణలో ఉండే వైశిష్ట్యమే ‘లక్ష్మీకళ’ అని వర్ణించాయి. మొదట పరిశుభ్రతను పాటించడమే ఐశ్వర్యదేవతకు ఆహ్వానం పలకడం. ఒంటితో, ఇంటితో ప్రారంభమయ్యే స్వచ్ఛత, క్రమంగా పరిసరాలకు, దేశానికి విస్తరిల్లాలి. లక్ష్మీకళలతో దేశసౌభాగ్యం విస్తరిల్లడమే లక్ష్మీకటాక్షం. దాన్ని కాంక్షించి పాటించడమే నిజమైన లక్ష్మీపూజ.
వృక్షసంపద, సస్యసమృద్ధి శ్రీస్వరూపమని దేవీశాస్త్రాలు వర్ణించాయి. శాకంభరి, ధాన్యలక్ష్మి మొదలైన శక్తిరూపాల భావనలో పరమార్థం- ప్రకృతిని పరాశక్తిగా, జగన్మాతగా దర్శించడమే. వ్యర్థంగా వృక్షాలను నరికితే సంపదల దేవత ఆగ్రహిస్తుందని లక్ష్మీగాథల్లో రుషులు వక్కాణించారు. వనసంపద, హరితశోభ అన్నిచోట్లా వర్ధిల్లడం లక్ష్మీనివాసానికి తార్కాణం.
ధర్మబద్ధంగా సంపాదించేది, ధర్మానికే వినియోగించేది ధనలక్ష్మీ స్వరూపమని దార్శనికుల భావన. అక్రమార్జన ధనలక్ష్మి అనిపించుకోదు. ఆర్జనలో, వినియోగంలో ధర్మం ఉన్నప్పుడే ధనానికి దివ్యత్వం సమకూరుతుంది. అది మనల్ని రక్షిస్తుందనేది ధార్మికశాస్త్ర బోధ.
కలహం, స్వార్థం, వైమనస్య ధోరణి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదని పురాణేతిహాసాల్లో పలు తావుల్లో వర్ణించారు. పరస్పర ప్రేమ, స్నేహం, సౌమనస్య, సామరస్యాలు ఉన్నచోట ఉండే ప్రశాంత, ఆనంద స్థితే నిజమైన లక్ష్మీకళ. క్షమతో, ప్రేమతో సాధించుకొనే లక్ష్మీదేవి సాక్షాత్కారమిది.
‘ఉద్యమం’ మరొక లక్ష్మీరూపంగా చెబుతారు మహర్షులు. ఈ పదానికి ‘ప్రయత్నం’ అని అర్థం. ప్రయత్నశీలుడైన వ్యక్తికి లక్ష్మీప్రాప్తి ఉంటుందని అనేక సందర్భాల్లో వివరించారు. ఎంత సమర్థుడైనా సోమరి అయితే ఏమీ సాధించలేడు. సమర్థత లేకున్నా, ప్రయత్నిస్తే సామర్థ్యాన్ని పొందగలడు. ప్రయత్నశీల లక్షణంతో, కాలాన్ని వ్యర్థంచేయకుండా, శ్రమించే వ్యక్తి దేనినైనా సాధించగలడని భారతాది గ్రంథాల్లో సనాతనులు ఉద్బోధించారు.
చేసిన పనికి లభించే ‘సిద్ధి’, దానికి కావలసిన ‘బుద్ధి’, దానితో చేసే ‘ఉద్యోగం’ (ప్రయత్నం)- ఈ మూడూ పూర్ణలక్ష్మీ రూపాలు. సిద్ధలక్ష్మి, జ్ఞానలక్ష్మి, ఉద్యోగలక్ష్మి – ఈ మూడింటితో భౌతిక సాధనలనైనా, ఆధ్యాత్మిక సాధనలనైనా ఫలింపజేసుకోగలం. ఐశ్వర్యాల్లో ఆరోగ్యాన్ని ప్రధానంగా చెబుతూ- ‘ఉన్నంత కాలం విలువ తెలియనిది, లేకపోతే తెలిసేదీ ఆరోగ్య సంపద’ అన్నాడు ధర్మరాజు (భారతం). ఆరోగ్యం ఉన్నప్పుడే విలువను గుర్తించి పరిరక్షించుకోవాలి. క్రమశిక్షణ, నిగ్రహం కలిగిన సదాచార యోగజీవితమే ఆరోగ్య లక్ష్మికి ఆవాసమవుతుందని శాస్త్రాలు విశదీకరించాయి.
స్త్రీమూర్తులు లక్ష్మీ అంశాలని దేవీభాగవత కథనం. లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీమూర్తులు స్త్రీలే. స్త్రీ సంతోషంగా ఉండేచోట సిరితల్లి సంపూర్ణంగా భాసిల్లుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దివ్యత్వాన్ని స్త్రీమూర్తిగా ఆరాధించే పవిత్ర హైందవ సంస్కృతి, మహిళామతల్లుల విజ్ఞాన, ఆరోగ్య, వికాస, ఆనందాలవల్ల కుటుంబానికి, సమాజానికి కూడా వైభవ సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని చాటుతోంది. లక్ష్మీమాత దాల్చిన ఈ ‘వరాల’ లక్ష్మీరూపాలన్నీ అనుగ్రహించుగాక అని భక్తితో ప్రార్థిద్దాం! – సామవేదం షణ్ముఖశర్మ