Kakarthya Gundana – Charitraka Kalpana

Nethi Suryanarayana Sharma,

కాకర్త్య గుండన – చారిత్రక కల్పన

నేతి సూర్యనారాయణ శర్మ

250.00

Share Now

Description

కాకర్త్య గుండన – చారిత్రిక కల్పన

‘కాకతి’ అన్నది ఒక ఊరి పేరా, దేవత పేరా అన్న విషయంపై భిన్నమయిన అభిప్రాయాలూ వున్నాయి. ఆంధ్ర చరిత్ర పరిశోధకుల మధ్య ఈ విషయమై బహు విధాల చర్చ జరిగింది. కాకతీయుల వంశంలో ఈ మొదటిబేతరాజుకు పూర్వమే, అతని పేరులో ‘కాకతి’ శబ్దం కనుపించే ‘కాకర్త్య గుండ్యన’ అనే రాజు వున్నాడు. ఇతడు క్రీ.శ.945-995 మధ్య కాలానికి చెందినవాడు. ఇతని పేరులోని ‘కాకర్త్య’ అనే పదం సంస్కృతీకరణం చెందిన ‘కాకతి’ శబ్దం అనీ, కొన్ని తెలుగు పేర్లు సంస్కృతీకరణం చెందే క్రమంలో గాలి నరసయ్య అనే పేరు వాతుల అహోబిలపతి అయినట్లుగా ‘కాకతి గుండన’ శబ్దం ‘కాకర్త్య గుండ్యన’ గా మారడం అసంభవమేమీ కాదని చరిత్రకారుల అభిప్రాయం. ఇతనిది సామంతఒడ్డె వంశం. ఒడ్డె పదం ఓడ్ర శబ్దాన్నుంచి పుట్టినది కాబట్టి ఇతడు విశాఖపట్టణ ప్రాంతపు ఒడ్డెనాడుకు చెందినవాడయి వుండవచ్చని ఒక అభిప్రాయం. కాకతీయులు దుర్జయవంశంవారని ఒక శాసనంలో కనబడుతుంది.

కాకర్త్య గుండన తూర్పు చాళుక్యుల వద్ద ఉన్నతోద్యోగంలో వున్న వాడని మాగల్లు శాసనం వలన తెలుస్తుంది. ఇతడు అనుమకొండలోని ప్రాచీన రాజవంశజులతో పెళ్ళిసంబంధం చేసుకుని పెండ్లి గుండమరాజు అని కూడా పిలవబడ్డాడు. ఇతనికి కుంతలదేవి అని ఒక సోదరి ఉంది. ఆమెను బలవంతులయిన విరియాల వంశంజులకు ఇచ్చి వివాహంచేయడం ద్వారా వరంగల్లులో తన స్థానాన్ని పదిలం చేసుకో సంకల్పించాడని చెబుతారు. విరియాల వారిది దుర్జయ వంశం. వీరి వృత్తాంతం క్రీ.శ.1000 ప్రాంతపుదైన గూడూరు శాసనంలో వివరంగా వుంది. ఈ రాజులలో ఎఱ్ఱనరేంద్రుడు పరాక్రమశాలి. ఈయన భార్య కామమసాని, గొప్ప రాజనీతిజ్ఞురాలు, వీరవనిత. పెండ్లి గుండనగా పిలవబడిన కాకర్త్య గుండ్యన సోదరి పేరు కుంతలదేవిగా వున్నా, ఈ విరియాల కామమసాని అనే వనితనే కుంతలదేవిగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు.

కాకర్త్య గుండ్యన అనుమకొండలోని రాజవంశీయులతో పెళ్ళిసంబంధ మేర్పరచుకుని, అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లోపలే మరణిస్తాడు. అతని కొడుకైన బేతరాజు అప్పటికి చాలా చిన్నవాడు, బాలుడు. మేనల్లుడు, బాలుడు అయిన బేతరాజును అతని మేనత్తయైన విరియాల కామమసాని (గుండ్యన చెల్లెలైన కుంతలదేవి), భర్తయైన ఎఱ్ఱనరేంద్రుని సహయంతో సంరక్షించి కాపాడుతుంది. బేతరాజు యుక్తవయస్కుడు కాగానే అతడిని రాజ్యాభిషిక్తుని చేస్తుంది. ఇది గూడూరు శాసనంలో చెప్పబడి ‘కాకతి నిల్పుట కోటి సేయదే’ అని కామమసాని రాజనీతిజ్ఞతకు ప్రశంసాపూర్వక కథనంగా లోకోక్తియై చరిత్రలో నిలిచింది.