Description
..ఏష ధర్మః సనాతనః
(ఇదీ మన సనాతన ధర్మం)
“సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్న బ్రూయాత్సత్యమప్రియమ్, ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః” (మనుస్మృతి)
సత్యమే పలకాలి, ప్రియమైన వాక్యమే పలకాలి, సత్యమే అయినా అప్రియ వాక్యం పలకకూడదు. ప్రియంకదా అని అసత్యం చెప్పకూడదు. ఇది సనాతన ధర్మం. ఇత్యాది శ్లోకాలలో ‘ఏష ధర్మః సనాతనః’ అను వాక్యం చేర్చి అనేకమైన అన్ని కాలాలకూ, అన్ని దేశాలకూ ఉపయోగించే, లోకవ్యవహారోపయోగ ధర్మాలు చెప్పబడ్డాయి. అదే శీర్షికతో ఈ గ్రంథంలో చెప్పిన విషయాలన్నీ సనాతన ధర్మాలే.
ఈ గ్రంథంలో దాదాపు 200 ఖండికలున్నాయి. రెండు పేజీలకు మించని ఒక్కొక్క ఖండికలో ఒక్కొక్క అంశం సమగ్రంగా ప్రతిపాదింపబడింది. దేవతా స్వరూపాది ప్రతిపాదకాలు, దీపారాధనాదుల ప్రాశస్త్యాన్ని బోధించేవీ అయిన కొన్ని ఖండికలు రెండేసి, అంతకుమించీ కూడ ఉన్నాయి. చెప్పిన ప్రతీ విషయానికీ శ్రుతి స్మృతి-పురాణాది ప్రామాణ్యం చూపడం ఈ గ్రంథంలో ఒక వైశిష్ట్యం,
ఆయా దేవతాదులు స్వరూపాలను, ప్రతాదులు తత్త్వాన్నీ తెలిసికొనకుండా చేసిన కర్మ-పూజాదుల కంటే వాటిని తెలిసికొని చేసిన కర్మ – పూజాదులు అధికమైన ఫలం ఇస్తాయని శాస్త్రం.
“యదేవ విద్యయాకరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి”
(ఛాం.ఉ.1.1.10)
ఏ యజ్ఞయాగాది కర్మను విద్యతోను, అనగా దానికి సంబంధించిన పూర్తి జ్ఞానంతోను, శ్రద్ధతోను, ఉపనిషత్తుతోను, అనగా ఆ దేవతయందు మనస్సు నిలపడం అనే యోగంతోను ఆచరిస్తారో ఆ కర్మయే వీర్యవత్తరం, అనగా ఎక్కువ వీర్యం కలది అవుతుంది. అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది.
ఈ గ్రంథంలోని ఖండికలన్నీ వివిధ దేవతావ్రత-ఆచారాదుల రహస్యాలను బోధించడం ద్వారా, సనాతన ధర్మ శ్రద్ధాళువులు ఆయా పర్వదినాదులలో చేసే దేవతారాధనాదులు పరిపూర్ణ ఫలం పొందడానికి ఉపకరిస్తాయి.
ఇలాంటి అనేకమైన ఆవశ్యక ధార్మిక విషయాలను ఒకచోట కూర్చి అందించిన శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి యత్నం సకలాస్తికలోక ప్రశంసాపాత్రమైనది.
పుటలు: 610