Description
ఆదిశంకరుల విష్ణుస్తోత్రాలకు వెలకట్టలేం. అద్వైత సిద్ధాంతాన్ని విడమరచడానికి, హరిభక్తిని బోధించడానికి ఆయన ఈ స్తోత్రాలను విరివిగా ఉపయోగించుకున్నారు. షట్పదీ స్తోత్రం, అచ్యుతాష్టకం, లక్ష్మీనృసింహ కరావలంబం వంటివి విష్ణుభక్తులకు నిత్యపఠనీయాలు. ఆర్యాంబకు కృష్ణదర్శనం కలిగించిన కృష్ణాష్టకం, మానసపూజ వంటి స్తోత్రాలు సాధకులకు అత్యవసరమైనవి. విష్ణు పాదాది కేశాంత స్తోత్రంలో స్వామిని అణువణువూ వర్ణించిన విధానం మనల్ని తరింప చేస్తుంది. ఆదిశంకరుల స్తోత్రాలలోని భక్తిరసాన్ని తేటతెలుగులోకి ప్రవహింపచేసే ఈ గ్రంథంలో మొత్తం 23 విష్ణు స్తోత్రాలున్నాయి.
నేతి సూర్యనారాయణశర్మ నవలారూపంగా రచించిన శంకరవిజయం విశేష పాఠకాదరణకు నోచుకుంది. దరిమిలా శివానందలహరికి రసదీపికా వ్యాఖ్యను, శంకర భాష్యానుసారమైన విష్ణుసహస్రనామ స్తోత్ర భాష్యాన్ని శర్మ సమకూర్చారు. శంకరభారతి ప్రచురణల పక్షాన ఇప్పటివరకు ‘గణేశం భజే!’ (వ్యాస సంకలనం), భుజంగ ప్రయాతం (స్తోత్రాలు) ప్రచురించాం. శంకరుల శివ, దేవీ స్తోత్రాలతో కూడిన గ్రంథాలు త్వరలో రానున్నాయి.