Navagraha Puranam telugu

Vakkantham Suryanarayana Rao
నవగ్రహ పురాణం

వక్కంతం సూర్యనారాయణరావ్

 

342.00

Share Now

Description

వక్కంతం సూర్యనారాయణరావ్

మానవుడి జాతక చక్రంలో కొలువుదీరి, అతని జీవిత చక్రాన్ని నియంత్రించే అశేష, విశేష దైవ స్వరూపాలు నవగ్రహాలు! మానవుల ఆలోచన, అభివ్యక్తీకరణ, ఆచరణ ఈ మూడు నవగ్రహ వీక్షణ మీదే ఆధారపడి వుంటాయి!నిర్విఘ్నంగా సాగే నవ గ్రహ పురాణ పఠనం అ నిష్ట పరిహారానికీ, ఇష్టప్రాప్తికీ దోహదం చేస్తుందని విజ్ఞుల వాక్కు…నవగ్రహ పురాణ పఠనం – సకల శుభాలనూ, సర్వ సుఖాలనూ సమకూర్చేనవగ్రహ ఆరాధనతో సమానం.ఇదిగో ‘నవగ్రహ పురాణం!’ పఠించండి! గ్రహ దేవతలను ప్రసన్నం చేసుకోండి! అవిఘ్నమస్తు!జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహోద్యుతింతమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్‌!నిర్వికల్పానందుల కంఠంలో శ్లోకం శ్రావ్యంగా ధ్వనించింది; భక్తి ప్రతి ధ్వనించింది. చేతులెత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాడాయన. శిష్యులు విమలానందుడూ, శివానందుడూ, సదా నందుడూ, చిదానందుడూ గురువు గారిని అనుసరిస్తూ సూర్యుడికి నమస్కారాలు అర్పించారు.పడమటి ఆకాశంలో గుండ్రటి సూర్యుడు దిశా సుందరి నుదురు మీద సిందూర తిలకంలా మెరిసిపోతున్నాడు.‘‘గ్రహణం వీడిన సూర్యుడు ఎలా ధగధగలాడిపోతున్నాడో చూశారా?’’ తదేకంగా సూర్య బింబాన్నే చూస్తూ అన్నాడు నిర్వికల్పానంద.

‘‘ఔను గురువుగారూ! సూర్యభగవానుడు కళకళలాడుతున్నాడు!’’ విమలానందుడు చిరు నవ్వుతో అన్నాడు.‘‘గ్రహణం’ నుంచీ ‘మోక్షం’ సిద్ధించింది కదా! అందుకే తెగవెలిగి పోతున్నారు!’’ చిదానందుడు నవ్వాడు.అందరూ నదిలోంచి గట్టు వైపు అడుగులు వేస్తున్నారు.‘‘ఈ గ్రహణాన్నీ, మోక్షాన్నీ చూశావ్‌ – ఆ సూర్యుడి చరిత్ర – పుట్టుపూర్వోత్తరాలతో – సాకల్యంగా వినాలనిపిస్తోంది… గురువు గారూ, వినిపిస్తారా?’’ సదానందుడు ఆసక్తిగా అడిగాడు.‘‘ఒక్క గ్రహరాజు చరిత్ర మాత్రమే ఏమిటి, సదానందా…. గురువు గారి అమృతవాణి ద్వారా నవగ్రహాల కథ అంతా విందాం!’’ శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.నిర్వికల్పానంద గట్టుమీద ఆగి శిష్యుల్ని కలయజూశారు. ‘‘మన శివానందుడి ఆలోచన బాగుంది! నవగ్రహాల చరిత్రలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని వుంటాయి. అందుచేత అందరి గురించీ తెలుసుకుందాం! పదండి! ఇవాళే ‘నవగ్రహ పురాణం ప్రారంభించుదాం!’’

ఆశ్రమంలో వాతావరణం ప్రశాంతంగా వుంది. పక్షుల కిలకిలారావాల్నీ, పువ్వుల సువాసనల్నీ మోసుకువస్తూ పరవశిస్తోంది పిల్లగాలి.నిర్వికల్పానంద అరుగు మీద కూచున్నాడు. శిష్యులు ఆయన ముందు వినయంగా కూచున్నారు. నిర్వికల్పానందుల మొహం మీద చిరునవ్వు మెరిసింది.‘‘నవగ్రహాల చరిత్ర వినాలని మీరు ముచ్చట పడటం చాలా మంచిది. ఒకరి చేత ‘చెప్పించుకుని వినాలి’ అనుకోవడమే గొప్ప విషయం. ఎందుకంటే – ‘శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం’ అనేవి భక్తి యోగంలో తొమ్మిది విధానాలు. ఈ తొమ్మిదింటినీ కలిపి – ‘నవ విధ భక్తి’ అన్నారు పెద్దలు. ఈ తొమ్మిదింటిలో ‘శ్రవణం’ అనేది ప్రథమ విధానం మాత్రమే కాదు; ప్రధాన విధానం కూడా! భక్తి ప్రక్రియలలో శ్రవణానిదే పెద్దపీట!‘‘నవగ్రహ పురాణం అనేది ఒక మహత్తర, బృహత్తర చరిత్ర! ఆ పురాణ శ్రవణం నిర్విఘ్నంగా, నిరంతరాయంగా సాగి పోవాలి!’ నిర్విఘ్నంగా చేసే నవగ్రహ పురాణ ప్రవచనం; శ్రవణం – నవ్రగహాల ఆరాధనతో సమానం’ అన్నారు విజ్ఞులు!’’‘‘అయితే, గురువుగారూ! నవగ్రహ పురాణ శ్రవణం ప్రారంభించి, పూర్తయ్యేదాకా మనం సంచారం వెళ్ళమన్న మాట!’’ విమలానందుడు ప్రశ్నించాడు.