Description
శుక్ర గ్రహం ఎప్పుడు ఏర్పడింది? అంతటి గొప్ప స్థితి అసలు శుక్రుడికి ఎలా ప్రాప్తించింది? ఇది శివపురాణం రుద్రసంహిత యుద్ధఖండం యాభయ్యో అధ్యాయంలో ఉన్న కథాసార సంగ్రహం.
పూర్వం రాక్షస గురువు శుక్రాచార్యుడు మృతసంజీవని విద్యను సంపాదించాలని సంకల్పించాడు. వెంటనే ఆ అపూర్వ విద్యా సముపార్జన కోసం కాశీ నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుడిని ధ్యానించసాగాడు.
ఆ తపస్సులో భాగంగానే పంచామృతాలతో శ్రద్ధాపూర్వకంగా ఆ దేవదేవుడిని లక్ష సార్లు అభిషేకించాడు. పరిమళ భరితాలైన జలాలతో పలుమార్లు శివుడిని అభిషేకించాడు.
చందనం, కర్పూరం, కస్తూరిలాంటి వాటితో చేసిన ముద్దలను తీసుకొని వేయిసార్లు పరమ ప్రీతితో శివలింగానికి లేపనాలను చేశాడు.
అనంతరం రాజ చంపకాలు, దత్తూరాలు, గన్నేరు పూలు, పద్మాలు, జాజి, కొండగోగు, బకుల పుష్పాలు, నల్ల కలువలు, మల్లెలు వావిలి పూలు, మంకెన పూలు, సురపొన్నలు,
నాగకేసరాలు, పొగడలు, విరజాజులు, కుందన పుష్పాలు, ముచికుంద పుష్పాలూ, మందారాలు, మారేడు దళాలు, నీలిచెట్టు పుష్పాలు, మరువం,
మాచిపత్రి, దమనకం (దవనం) వీటితోపాటుగా అందమైన మామిడి చిగుళ్ళు, తులసి, దేవగాంధారి, వాకుడు ఆకులు, దర్భచిగుళ్ళు,
అగస్థ్యశాల దేవదారు పుష్పాలు, ముళ్ళగోరింట పూలు, గరిక, పచ్చగోరింట పూలు, ఇలాంటి రకరకాల పుష్పాలు,
పత్రులతో సహస్రదళ పద్మాలతో సావదాన మనస్కుడై మహాప్రీతితో శంకరుడిని అర్చించాడు శుక్రుడు. అలాంటి అర్చనానంతరం మంచి నైవేద్యాన్ని సమర్పించి గాన నృత్యాలను ప్రదర్శించి అనేక స్తోత్రాలతో సహస్ర నామాలతో స్తుతించాడు.
అయినా ఆయన తపస్సును ఇంకా ఇంకా పరీక్షించాలనుకుని శివుడు త్వరగా ప్రత్యక్షం కాలేదు.
శుక్రుడు కూడా నిరుత్సాహపడక మరింత దీక్షతో తన తపస్సును కఠినతరం చేశాడు. మనస్సును నిగ్రహించి అచంచల భక్తితో శుక్రుడు తపస్సును సాగించాడు.
కాలిన క నుంచి వచ్చే పొగను మాత్రమే పీలుస్తూ ఎంతో కఠినంగా తపస్సు చేస్తుండటంతో శివుడికి శుక్రుడి భక్తిమీద నమ్మకం కలిగింది.
వెంటనే శుక్రుడు ఎదురుగా ఉన్న లింగం నుంచి వేయి సూర్యుల కంటే అధిక కాంతితో పరమేశ్వరుడు ఆవిర్భవించి, ఆ భార్గవుడితో ఇలా అన్నాడు.
భృగువంశవర్ధనా భార్గవా! నీవు చేసిన పుష్ప పూజాదికాలు, కఠిన తపస్సు అన్నీ నాకు నచ్చాయి. ఇంతటి తపస్సు చేసిన వాడికి ఇవ్వతగనిది ఏదీ ఉండదు.
ఏ వరం కావాలో కోరుకో అని శివుడనగానే శుక్రుడాయనకు నమస్కరిస్తూ పరిపరి విధాలా స్తుతించాడు. ఆ స్తోత్రాలు కూడా పరమేశ్వరుడిని మరింతగా ఆనందపరిచాయి.
అప్పుడు తన భక్తుడిని ప్రేమ మీర ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు ఆ పార్వతీపతి.
కాశీలో శివలింగాన్ని స్థాపించి ఆరాధించిన పుణ్యం చేత పవిత్రము, నిశ్చలము అయిన మనసుతో తపస్సు చేయటం ద్వారా కాశీ మహాక్షేత్రంలో పవిత్రంగా జీవించటం చేత ఓ శుక్రుడా నీవు నా ఇద్దరు పుత్రులతో సమానుడివి అయ్యావు అని శివుడనగానే శుక్రుడికి అమితానందం కలిగింది.
ఆ తరువాత శుక్రుడు కోరిన అత్యంత విలువైన, రహస్యమైన మృతసంజీవని విద్యను కూడా శివుడు ప్రసాదించాడు.
ఎవరిని బతికించాలనుకుంటే వారిని ఆ విద్యచేత బతికించవచ్చన్నాడు.
అన్నిటినీ మించి శుక్రుడు గ్రహరూపుడై సూర్య, అగ్నిలను మించిన ప్రకాశంతో ఆకాశంలో నిరంతరం ప్రకాశిస్తాడని అన్నాడు.
ఉత్తమ గ్రహంగా పేరొందుతాడని ఆశీర్వదించి శివుడు అంతర్థానమయ్యాడు.
ఈ కథా సందర్భంలో శుక్రగ్రహం ఏర్పడిన తీరుతోపాటు అచంచల భక్తికి శివుడు ఎలా సంతృప్తి చెందుతాడనే విషయం కూడా ప్రస్తావితమై ఉంది.