Description
కాలవిధాన పద్ధతి
లోకమున (వైదికములును లౌకికములునునగు శ్రౌతస్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మములు కాలమునే ఆధారముగ చేసుకొని ప్రసరిల్లుచున్నవి – అట్టి కాలమను సరిగా తెలియక ఆ కాలమున నాచరించు కర్మములు (పనులు) చెడిపోయి నెరవేరకపోవుటేగాక వానివలన అశుభములు గల్గుటయునవి దుష్కృతమునకు హేతువగుటయును గల్గను. అట్టి కాలములను తెల్పుశాస్త్రము జ్యోతిషము అందు మూడు స్కంధములు,
(3 భాగములు)
1.సిద్ధాంత భాగము:- అందు తిధినక్షత్రయోగ గ్రహచారాదికమును దాని గణితమును దెల్పును.
2.జాతక భాగము:- ఈభాగమున జననకాల గ్రహస్థిత్యాదుల ననుసరించి కల్గు ఫలములు శుభాశుభములమ దెలియజేయును.
3.సంహితా భాగము:- ఈ భాగమున ముందుభాగములు అందు ముహూర్త భాగము.
అనగా గర్భాదానాది సంస్కారముల వాని కాలములును వాని శుభాశుభములు తెలియజేయును.
ఇక
ప్రశ్న భాగము:- పశ్న కాలముననుసరించి కలుగబోవు శుభాశుభఫలమును తెలియజేయును.
వాస్తుభాగము:- ఈ భాగమున గృహనిర్మాణ వాన్తునిర్మాణ విధానము వానికనువగు కాలములు వాని శుభా శుభములను దెల్పును.
పైమూడు భాగము అందును ఋషి ప్రోక్తములును పౌరుషేయములందును అనేక గ్రంథములుగలవు.
(2) ముహూర్తమనగానేమి:- ముహూర్త పదమును గూర్చి అమరకోశమున
“అష్టాదశ నిమేషాస్తు కాష్ఠా త్రింశత్తు తాః కలా తాస్తు త్రింశత్క్షణస్తే తు ముహూర్తో ద్వాదశాస్త్రియాం|| “ అని కలదు.
- 18 నిమేషాలు (కంటి రెప్పపాటు కాలం) = 1 కాష్ఠ
- 30 కాష్ఠలు = 1 కల (లేదా కలా)
- 30 కలలు = 1 క్షణము
- 12 క్షణములు = 1 ముహూర్తము (2 గడియల కాలము)
కాల పరిమితుల స్పష్టత (సెకన్లు మరియు నిమిషాలలో):
సూర్యోదయము నుండి తదుపరి సూర్యోదయము వరకు గల 24 గంటల కాలాన్ని అహోరాత్రము
(పగలు మరియు రాత్రి) అంటారు. దీనిని 60 ఘడియలుగా లేదా 30 ముహూర్తాలుగా విభజించారు.
- 1 కల = 3.2 సెకన్లు (సుమారుగా)
- 1 క్షణము = 96 సెకన్లు (సుమారు 1.6 నిమిషాలు)
- 1 ఘడియ (2 క్షణములు) = 24 నిమిషాలు
- 1 ముహూర్తము (12 క్షణములు / 2 ఘడియలు) = 48 నిమిషాలు
పగలు మరియు రాత్రి విభజన:
- ఒక అహోరాత్రము (24 గంటలు) = 30 ముహూర్తములు
- పగటి సమయం = 15 ముహూర్తములు
- రాత్రి సమయం = 15 ముహూర్తములు
- మొత్తం కలిపి 30 ముహూర్తములు అగును.
అహోరాత్రముల ప్రమాణము అనుసరించి ఉత్తరాయణమున పగటిముహూర్తము వృద్ధియును,
రాత్రి ముహూర్తము క్షయమును .
దక్షిణాయనమున పగటిమహూర్త క్షయమును రాత్రి ముహూర్తము వృద్ధియ మనుగును
“పగటిలో 15వ భాగము. రాత్రిలో 15 వ భాగము వచ్చును.
ముహూర్త భాగము వివాహ ముహూర్తము మొదలగు వానిలో ముహూర్తమనగానేమి ? ముహూర్తమున శుభాశుభ కాలములను దెలియజేయులగ్నకాలము ఆనిభావము. లేదా వివాహముల శుభముహూర్తమన వివాహాది కాలమును ఒక లగ్నమును తెలియజేయునది అనిభావము. ఈ అర్ధముననే గర్భాధానాది ముహూర్తముల తెలియజేయు గ్రంథములకు
- ముహూర్త దర్పణము
- ముహూర్తదీపిక
- ముహూర్త మార్తాండము
- ముహూర్త చింతామణి
- ముహూర్త రత్నావళి
- ముహూర్త సింధు
- ముహూర్త చూడామణి
- ముహూర్త కల్పద్రుమం
- విద్వజ్జన వల్లభం
- అద్భుత సాగరం
- వ్యవహార ప్రదీపం
- జ్యోతిర్విధాభరణం
- జ్యోతిర్నిబంధం
- కాలప్రకాశిక ఇత్యాది నామములు వచ్చెను.
ఇందు అనుసరించి ముహూర్తభాగ గ్రంథములందు ప్రాయికముగా స్మార్తములగు షోడశ సంస్కారములకును లేదా శ్రౌతములను 4రి సంస్కారములకు ఆరంభ శుభకాల నిర్ణయమును జేసిరి. ముహూర్త చింతామణి పీయూష ధార వ్యాఖ్యయందు సంస్కార ప్రకరణమున సంస్కారములను ఇట్లు వివరించిరి.
సంస్క్రియతేఽనేన శ్రీతేన కర్మణా స్మార్తేన వా పురుష ఇతి సంస్కారః |
స్వీయస్వీయజాతౌ సామాన్యవిశేషవిహిత వైదికస్మార్తకర్మానుష్ఠానద్వారాఽదృష్టవిశేషాధాయక ఇతి యావత్ |
లక్షణయా తదర్థోక్తదినశుద్ధయాదికం సంస్కారశబ్దేనోచ్యతే | తస్య ప్రకరణముపక్రమః |
అష్టచత్వారింశత్సంస్కారనామాని సఫలాని| తే చ సంస్కారాః అష్టచత్వారింశత్ |
యదాహ గౌతమః – ‘గర్భాదానం పుంసవనం సీమంతోన్నయనం జాతకర్మ నామకరణాన్నప్రాశనచీలోపనయనం చత్వారి వేదవ్రతాని స్నానం సహధర్మచారిణీసంయోగః పంచానాం యజ్ఞానామనుష్ఠానమష్ట కాపార్వణశ్రాద్ధం శ్రావణ్యాగ్రహాయణీ చైత్రీ ఆశ్వియుజీతి సప్తపాకసంస్థా అగ్న్యాధాన మగ్నిహోత్రం దర్శపూర్ణమాసో చాతుర్మాస్యాన్యగ్రయణేష్టినిరూఢపశుబంధః సౌత్రామణీతి సప్తహవిర్వృహ యజ్ఞసంస్థా అగ్నిష్టోమ ఉక్తః షోడశీ వాజపేయోఽతిరాత్రోప్తోర్యామ ఇతి సప్త సోమయజ్ఞసంస్థా ఇత్యేతే చత్వారింశ త్సంస్కారాః | ఆష్టావాత్మగుణాః-దయా సర్వభూతేషు క్షాంతిరనసూయాశౌచమనా యాసో మాంగల్యమకార్పణ్యమ స్పృహేతి | యస్యైతే చత్వారింశత్సంస్కారా అష్టావాత్మగుణాశ్చ స బ్రాహ్మణః సాయుజ్యమాప్నోతి‘ ఇతి| తత్రైతే పుంసః సంస్కారాః సమీచీనదివసేష్వనుష్ఠితాః సంతోఽభిహితఫలదాతారో భవంతి | తత్ర ప్రథమం గర్భాధానాఖ్యః సంస్కారోఽభిహితః | స చ రజస్వలాస్త్ర్యధీనః | ఉక్తం చ భరద్వాజసంహితాయాం — ‘రజస్వలా యదా నారీ యోగ్యా స్యాద్గర్భధారణే |తతః కుర్వీత తత్సంగం గర్భార్థ బుద్ధిమాన్నరః ||‘
సంస్కారములు 48 అంత్యేష్టి తో కలుపుకొని 49.
భార్యకు చేయవలసిన సంస్కారములు
1) గర్భాదానం 2) పుంసవనం 3) సీమంతం
తన సంతాన శ్రేయస్సు కోసం అచరించవలసిన సంస్కారములు
1) జాత కర్మ 2) నామకరణం 3) అన్నప్రాసన 4) చౌలం 5) ఉపనయనం
వటువు నుద్దేశించి ఆచార్యులు చేయవలసినవి
1) ప్రాజాపత్యం 2) సౌమ్యం 3) ఆగ్నేయం 4) వైశ్వదేవం
బ్రహ్మచారి విద్యానంతరం అచరించవలసిన సంస్కారములు
1) సమావర్తనం(స్నాతకం) 2) వివాహం
పంచ యజ్ఞములు
1) దేవ యజ్ఞం 2) పితృ యజ్ఞం 3) భూత యజ్ఞం 4) మనుష్య యజ్ఞం 5)బ్రహ్మ యజ్ఞం
పాక యజ్ఞములు
1)అష్టకా 2) పార్వణ:3) శ్రార్ధం 4) శ్రావణి 5) అగ్రహాయణి 6) చైత్రీ 7) ఆశ్వయుజి
హవిర్యజ్ఞములు
1)అగ్న్యాధేయం 2)అగ్ని హోత్రం 3) ధర్శపూర్ణమాన్యం 4) చాతుర్మాస్యం 5)ఆగ్రయణేష్టి
6) నిరుడపశు బంధ:7)సౌత్రాయణి
సోమ యజ్ఞములు
1)అగ్నిస్టోమం 2) అత్యగ్నిస్టోమం 3)ఉక్ధ్యం4) షోడశి 5) వాజపేయమ్6)అతిరాత్రం 7) ఆప్తోర్యామం
ఎనిమిది ఆత్మ గుణములు
1)దయ 2)క్షాన్తి 3)అనసూయ4)శౌచం5)అనాయాసం 6)మాంగల్యం 7)అకార్పణ్యం8)అస్ప్రుహ
ఇవే కాకుండా దరిదాపు 55 ఉప సంస్కారములు కలవు.
పైదానికర్ధము గర్భాదాన పుంసవనసీమంతోన్నయన జాతకర్మ నామకరణము అన్నప్రాశనము చౌలము ఉపనయనము వేదవ్రతములు స్నాతకము వివాహము. ఇత్యాది 15 సంస్కారములును శ్రౌతసంస్కారములు అన్నియు కలసి 48సంస్కారములు. “ఈ సంస్కారములు మంచిశుభదినము ననుష్టించిన సుఖవంతములగును. ఇట్టి సంస్కారములే గాక గృహారంభ వ్యాపారారంభము కృష్యారంభమా మొదలగు కర్మలకును ముహూర్తమలు శుభ కాలము లేక లగ్నము నిర్ణయింపఁబడినవి. అట్టి సమీచీన కాలము అందారంభించిన పనులు (కర్మములు) నిర్వహ్నముగా నెరవేరుటయే గాక సుఫలవంతములగును.
ఈ కాలవిధాన పధ్ధతి అను గ్రంధము అతి పాచీనమైన ముహూర్త గ్రంధముగా కీర్తించబడినది. ఈ గ్రంథాన్ని సంకలనం చేసినవారు ఎవరో ఈ గ్రంథంలో ఏ ప్రదేశంలోనూ ఇవ్వలేదు.
అన్ని దిక్కులా కీర్తి వ్యాపించేలా, విజ్ఞాన ఫలాలను పంచుతున్న ఘనత తమిళనాడులోని తంజావూరులో ఉన్న సరస్వతీ మహల్ గ్రంథాలయానిది. లెక్కలేనన్ని సాహిత్య, వ్యాకరణ, వైద్య, జ్యోతిష మరియు ఇతర విశేషమైన విషయాలతో కూడిన తాళపత్ర గ్రంథాలకు ఇది నిలయంగా ప్రకాశిస్తోంది.
ఆ గ్రంథాలయంలో ఉన్న B. 11028 – D. 11352 నంబర్లు గల, సంస్కృత భాషలో ఉన్న అత్యంత ప్రాచీనమైన ఈ తాళపత్ర గ్రంథాన్ని శ్రద్ధగా చదివి, పరిశోధించి, అర్థం చేసుకుని, దోషాలను సవరించి, సంస్కృత శ్లోకాల సంఖ్య క్రమానికి అనుగుణంగా తమిళంలో అనువదించిన పండితాచార్యులు తేదియూర్ ఎస్. కృష్ణమూర్తి శాస్త్రిగారు. వీరు ఈ గ్రంథాలయంలోని సంస్కృత విభాగంలో సీనియర్ పండితులుగా పనిచేసి, అనేక గ్రంథాలను పరిష్కరించి ప్రచురించారు. అంతేకాకుండా, మూల తాళపత్ర గ్రంథంలో అనేక చోట్ల అసంపూర్ణంగా ఉన్న భాగాలను ‘కాలవిధానం’ అనే మరో గ్రంథం సహాయంతో పూర్తి చేసి ఈ గ్రంథాన్ని ప్రచురించారు. వీరి ఈ అద్భుత ప్రయత్నం ప్రశంసనీయం.
పూర్వపు పండితులు అనేకులు చెప్పి వెళ్లిన విషయాల సంకలనమే (కాలవిధాన పద్ధతి) అనేది. ధర్మ రహస్యాలను నిక్కచ్చిగా చెప్పే (ప్రామాణిక) గ్రంథంగా ప్రసిద్ధి చెందిన(నిర్ణయసింధు) అనే గ్రంథాన్ని రచించిన కమలాకర పండిట్ అనే పండితుడు తన ‘నిర్ణయసింధు’ గ్రంథంలో ఈ (కాలవిధానం) గ్రంథం గురించి మరియు గ్రంథంలో ఉన్న సీమంతం అనే విషయం గురించిన పద్యం గురించి కూడా పేర్కొన్నాడు. {Nirnayasiṃdhu Chowkhamba Edition, Varanasi, (2001 – Edition) Page No. 177.}
ఈ గ్రంథం ఒక సంకలన గ్రంథం (వివిధ చోట్ల నుండి సేకరించిన సమాచారం). దీని అసలు రచయిత ఎవరో తెలియరాలేదు. అయినప్పటికీ, దీనిని సంకలనం చేసినవారు, పూర్వీకులు చెప్పిన గొప్ప విషయాలను ఏకీకరించి “కాలవిధాన పద్ధతి” అని పేరు పెట్టి అందించారు. ఈ గ్రంథంలో గృహ జీవితానికి సంబంధించిన శుభ కార్యాలు, జాతక ఫలాలు, నామకరణం, అన్నప్రాశన, పిల్లలకు సరైన వయసులో అక్షరాభ్యాసం చేయించడం, వివాహం, వివాహ పొంతన, మంచి ముహూర్తం నిర్ణయించడం, వ్యవసాయానికి అనుకూల కాలం, విత్తనాలు నాటడం, దుంప జాతులను పండించడం, పంట కోత సమయం, గృహారంభం, గృహప్రవేశం వంటి మరియు రోజువారీ జీవితానికి సంబంధించిన నియమాలను తెలిపారు. ఇవి చదువుతున్న వారికి ఆనందాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు.
ఇటువంటి బృహద్గ్రంధం తెలుగులో సరళమైన భాషలో అందరికి చేరాలన్న కుతూహలంతో మా పెదనాన్నగారైన శ్రీమాన్ కుమాండూరి శ్రీరంగ వరదాచార్యుల గారు,వీరు సంస్కృత,జ్యోతిష వాస్తు పండితులు.వీరు పెద్దల వద్ద సంస్కృత శ్లోకాలతో సహా ముహూర్త గ్రంధాలను అధ్యయనం చేశారు వారి సహాయ సహకార్యంతో ఈ గ్రంధాన్ని తెలుగులో అనువాదం చేయుట ప్రారంభం చేసిన సమయంలో అనేక నూతన విషయాలు తెల్సుకున్నాను.ఆఖరికి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో సాధ్యమైంత వరకు తప్పులు లేకుండా పూర్తి చేసాము.నా ఈ గ్రంధ తెలుగు అనువాదంలో సహకరించిన మా సోదర సమానులు బ్రహ్మశ్రీ పుచ్చా శ్రీనివాసరావుగారికి మరియు మా మిత్రులు బ్రహ్మశ్రీ జల్లవరం సాయి ధీరజ్ శర్మ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ఈ గ్రంధంలో తప్పులు ఉన్నచో ఆ తప్పులను పెద్దలు పెద్ద మనసుతో నాకు తెల్పిన వచ్చే ముద్రణ లో వాటిని సరిచేయగలనని తెల్పుచున్నాను.
Send Your Messages Only 




































