Description
హనుమద్ వ్రతం
లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మనముందు నిలుస్తాయి. ప్రతి దేవత పాత్ర వెనక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది. అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు. భౌతిక రూపంలో వానరుడైనా వృత్తి, ప్రవృత్తుల్లో నరులవలె ప్రవర్తించి శక్తియుక్తుల్లో దైవత్వం కనబరచాడు. తేజస్సు, ధైర్యం, సామర్థ్యం, వినయం, నీతి, చాతుర్యం, పౌరుషం, పరాక్రమం, బుద్ధి హనుమంతుడిలోని విశిష్ట గుణాలుగా రామాయణంలో దర్శించగలుగుతాం. హనుమ- గురువు, దైవం, జ్ఞాని. రుద్రాంశ సంభూతుడిగా శైవులకు, రామభక్తుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు.
హనుమత్తత్వం మనసుకు ప్రతీక. మనసు నిత్యం చలిస్తుంది. ఈ చాంచల్యాన్ని అరికట్టడానికి సాధన అవసరం. పరమార్థ సాధనకు, శ్రీరామ చరణారవింద ప్రాప్తికి వానరం వంటి మనసూ ప్రయత్నం చేయవచ్చునని ఆంతర్యం కావచ్చు. అచంచల మనఃస్థితికి ప్రతినిధి మారుతి.
హనుమ గొప్ప కార్యసాధకుడు. ఆయనది దాస్యభక్తి. స్మరించగానే సాంత్వన భావం కలిగించి, ధైర్యం చేకూర్చి కార్యోన్ముఖుల్ని చేయగలడని విశ్వాసం. స్వామిని పూజించడంవల్ల సకల భయాలూ నశిస్తాయని గ్రహ, పిశాచ, పీడలు దరిచేరవని మానసిక వ్యాధులు తొలగిపోతాయని అనాదిగా భక్తులు విశ్వసిస్తున్నారు. అటువంటి ఆంజనేయ మూర్తిని ఆరాధిస్తూ చేసే ‘హనుమద్వ్రతం’ మార్గశిర మాసంలో శుక్లపక్ష త్రయోదశినాడు ఆచరించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.
పాండవులు వనవాసంలో ఉండగా వ్యాసమహర్షి వారిని చూసేందుకు వెళతాడు. ధర్మరాజు తమకష్టాలు తొలగిపోయే మార్గం ఉపదేశం చేయమని వ్యాసుణ్ని ప్రార్థిస్తాడు. అప్పుడాయన ఈ వ్రతాన్ని ఆచరింపజేసినట్లు పురాణ కథనం.
పూజా మందిరంలో బియ్యపు పిండిలో అష్టదళ పద్మాన్ని చిత్రించి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి దానిపై కుంకుమ, గంధం, సిందూరం, పుష్పాలతో అలంకరిస్తారు. కలశం ముందు స్వామివారి చిన్నవిగ్రహాన్ని గాని, చిత్రపటంగాని ఏర్పాటు చేసుకొని కలశంలోనికి స్వామివారిని ఆవాహనచేసి వినాయక పూజ, పిమ్మట స్వామివారి పూజ ఆచరిస్తారు. షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. గోధుమలతో చేసిన భక్ష్యాలను .నైవేద్యంగా సమర్పిస్తారు. 13 పోగుల తోరాన్ని స్వామివారి వద్ద ఉంచి పూజించి ధరిస్తారు. వ్రత కథాశ్రవణ చేస్తారు. రాత్రి ఉపవాసం ఉంటారు. తోరాన్ని మరుసటి ఏడాది వరకు భద్రంగా ఉంచుకుంటారు. ఏడాది తరవాత కొత్త తోరం ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చెయ్యాలి. కనీసం ఒక్కసారైనా ఈ వ్రతం చేసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతాచరణం వల్ల సమస్యలూ కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు, సౌభాగ్యం, జ్ఞానం లభిస్తాయని పండితులు చెబుతారు.
వ్యక్తిత్వ వికాసంలో కార్యసాధనలో పరిణత బుద్ధితో హనుమ తన విలక్షణ వ్యక్తిత్వంతో నేటి యువతకు ఆదర్శప్రాయుడు. హనుమత్ తత్వ స్ఫూర్తికి ఈ వ్రతాచరణం దోహదకారి అవుతుంది.
– డాక్టర్ దామెర వేంకట సూర్యారావు